గ్రేటర్ లో కార్పొరేటర్​ టు మినిస్టర్ అయినోళ్లు వీరే..

హైదరాబాద్, వెలుగు: గల్లీ నేతల్ని తక్కువగా అంచనా వేస్తే పొరపడ్డట్టే. ఒకప్పుడు కార్పొరేటర్​గా పనిచేసిన ఎందరో ఎమ్మెల్యే, ఎంపీ, డిప్యూటీ స్పీకర్, మంత్రులు అయ్యే స్థాయికి ఎదిగారు. కొందరు కేంద్ర పదవులను సైతం చేజిక్కించుకుని చక్రం తిప్పారు. ఇలా సిటీలో పదుల సంఖ్యలో ఉన్నారు.

ఇదీ సంగతి..

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కార్పొరేటర్ స్థాయి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2002లో మోండా మార్కెట్‌ నుంచి కార్పొరేట‌ర్‌గా గెలుపొందారు. అనంత‌రం 2004, 2014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్​గా ఉన్నారు.

  • బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా కార్పొరేటర్​ స్థాయి నుంచే ఎదిగారు. 1986లో జవహర్‌నగర్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్​గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత 1999, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఏర్పడ్డాక బీజేపీ పార్టీ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు.
  • కాంగ్రెస్ హ‌యాంలో కేంద్రమంత్రిగా ప‌నిచేసిన రేణుకా చౌదరీ రాజ‌కీయ ప్రస్థానం కూడా హైదరాబాద్​ కార్పొరేటర్ గానే ప్రారంభమైంది.1986లో బంజారాహిల్స్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు.
  •  కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా ప‌నిచేసిన ముఖేష్​ గౌడ్ కూడా కార్పొరేటర్​ స్థాయి నుంచే రాజకీయం మొదలుపెట్టారు. 1986లో జాంబాగ్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. 2004లో మహారాజ్‌గంజ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో గోషామహల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.  2014లో బీజేపీ నేత రాజాసింగ్​చేతిలో ఓడిపోయారు. అనారోగ్యం కారణంగా గతేడాది ఆయన మరణించారు.
  • టీడీపీ నేత సి.కృష్ణయాదవ్ పాతబస్తీలోని అలియాబాద్ డివిజన్ కార్పొరేటర్ గా తన పొలిటికల్​కెరీర్​ను షురూ చేశారు. 1991లో హిమాయత్ నగర్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే స్థానం నుంచి అనూహ్యంగా విజయం సాధించి టీడీపీ హయాంలోమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
  • 1964 గౌలీపుర కార్పొరేటర్ గా గెలిచిన రామస్వామి 1983లో మహరాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ తరఫున కార్పొరేటర్​గా గెలుపొందిన తీగల కృష్ణారెడ్డి మేయర్ గా పనిచేశారు. ఆ తరువాత మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు ఎంఐఎం ఎమ్మెల్యేగా పనిచేసిన సయ్యద్‌ సజ్జాద్ కూడా ముందుగా కార్పొరేటర్​గానే పనిచేశారు. ప్రస్తుతం ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్‌రెడ్డి కూడా 1986లో ముసారంబాగ్​ కార్పొరేటర్​గానే ఎన్నికయ్యారు.
  • కంటోన్మెంట్​ ఎమ్మెల్యే సాయన్న ముందు కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఆతరువాత కంటోన్మెంట్​ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత చార్మినార్​ ఎమ్మెల్యే గాఉన్న ముంతాజ్​ఖాన్​ కూడా 1986లో రియాసత్​నగర్​ కార్పొరేటర్ గా గెలిచారు. ప్రస్తుతం మలక్​పేట్ ఎమ్మెల్యేగా ఉన్న అహ్మద్‌బలాల అంతకు ముందు 2002లో కార్పొరేటర్ గానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1986లో కార్పొరేటర్​గా గెలిచిన ముఠా గోపాల్​ ప్రస్తుతం ముషీరాబాద్​ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజ‌కీయ జీవితం కూడా కార్పొరేటర్‌గా పోటీ చేయడం ద్వారానే మొద‌లైంది. 1986లో మోండా మార్కెట్‌ నుంచి జనతాదళ్‌ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం 1994, 1999, 2008, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్నారు.

ఏఐఎంఐఎం నేత సలావుద్దీన్‌ ఒవైసీ 1960లో మల్లేపల్లి డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. అనంతరం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఆరు సార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఎంఐఎం నేత‌లైన అసదుద్దీన్ ‌ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీలు సలావుద్దీన్ కుమారులే.

Latest Updates