కన్నెపల్లి పంప్​హౌస్‌​లో లీకేజీ

  •                 కార్మికులకు తప్పిన ప్రమాదం
  •                 ఘటనపై అధికారుల మౌనం

వెంటనే రిపేర్​ పనులు షురూకాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కన్నెపల్లి (లక్ష్మి) పంప్​హౌస్‌ లోకి నీళ్లు లీకయ్యాయి. సోమవారం మధ్యాహ్నం పంప్​హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోసే పైప్​లైన్​ వైపు ప్రొటెక్షన్​ వాల్​ దెబ్బతిని భారీగా వరద నీళ్లు లోపలికి చేరాయి. సుమారు 200 మీటర్ల పొడవునా, ఏడు మీటర్ల ఎత్తు నీళ్లు చేరి.. కొత్తగా బిగిస్తున్న మోటార్ల విడి భాగాలు మునిగిపోయాయి. పంప్​హౌస్‌  మొత్తం బురదగా మారిపోయింది. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంజనీర్లు, సిబ్బంది లీకేజీని గుర్తించిన వెంటనే వరదకు అడ్డుకట్ట వేశారు. మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. మూడో టీఎంసీ ఎత్తిపోతల కోసం జరుగుతున్న పనుల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. ఇటీవలే బాహుబలి మోటార్లు ఉన్న లక్ష్మీపూర్‌‌‌‌ పంప్‌హౌస్‌‌‌‌ సమీపంలో ప్రొటెక్షన్​ వాల్​ దెబ్బతిని లీకైన విషయం తెలిసిందే. తాజాగా మరో చోట లీకేజీ ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులెవరూ ఈ ఘటనపై పెదవి విప్పడం లేదు.

ప్రొటెక్షన్​ వాల్​ కింద నుంచి..

కాళేశ్వరం ప్రాజెక్టు‌‌లో ప్రధానమైనది కన్నెపల్లి పంప్‌హౌస్‌‌‌‌. ప్రాజెక్టులో మొదటి నీటి లిఫ్టింగ్ చేసేది ఇక్కడి నుంచే. రూ.2,827 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పంప్​హౌస్‌​ను మెగా ఇన్‌‌‌‌ఫ్రా కాంట్రాక్టు సంస్థ నిర్మిస్తోంది. తొలుత రోజుకు 2 టీఎంసీల చొప్పున పంప్​ చేసేలా 11 పంపులను ఏర్పాటు చేయాలని భావించారు. ఒక్కోటి రూ.40 కోట్ల విలువ చేసే 40 మెగావాట్ల సామర్థ్యం గల10 పంపులను ఏర్పాటుచేశారు. 11వ మోటార్‌‌‌‌ పనులు జరుగుతున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు‌‌ సామర్థ్యాన్ని రోజుకు 3 టీఎంసీలకు పెంచింది. అందుకోసం కన్నెపల్లి పంప్‌హౌస్‌‌‌‌ వద్ద మరో 6 మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. మోటార్ల నుంచి గ్రావిటీ కెనాల్​కు నీటిని తరలించే పైప్​లైన్ల పనులు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆ పైప్​లైన్​ వైపు ప్రొటెక్షన్​ వాల్​ పక్కన నీళ్లు నిండాయి. దానికితోడు సోమవారం పంప్​హౌస్‌లోని రెండో మోటార్​ను ఆన్​ చేసినప్పుడు గేట్​వాల్వ్​ లీకై నీరు ఎగజిమ్మింది. ఆ నీళ్లు కూడా వాల్​ పక్కన చేరాయి. సోమవారం మధ్యాహ్న సమయంలో పంపుహౌజ్​లోకి నీళ్లు లీకవడం మొదలైంది. కొద్ది నిమిషాలకే నీరుపెరగడంతో ఇంజనీర్లు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి, అడ్డుకట్ట వేశారు. అప్పటికే పంప్‌హౌస్‌‌‌‌లో సుమారు 200 మీటర్ల పొడవునా 7 మీటర్ల ఎత్తులో నీళ్లు చేరాయి. మరో మూడు, నాలుగు మీటర్లు నీరు చేరితే.. మోటార్లు మునిగేవని సమాచారం. నీటి లీకేజీ సమయంలో పంప్​హౌస్‌​ దిగువ భాగంలో పది మంది కార్మికులు పనిచేస్తున్నారని.. పైన ఉన్న వాళ్లు అప్రమత్తం చేయడంతో నిచ్చెనలతో పైకి చేరుకున్నారని సిబ్బంది చెప్తున్నారు.

నష్టం భారీగానే..!

నీటి లీకేజీకి సంబంధించి కాంట్రాక్టు సంస్థ వేగంగా మరమ్మతుల పనులు చేపడుతోంది. 50 హెచ్​పీ సామర్థ్యంగల మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. సుమారు రెండు వందల మంది ఇంజనీర్లు, సిబ్బంది పనిచేస్తున్నారని, రెండు, మూడు రోజుల్లో పరిస్థితి మాములు స్థితికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా బిగించాల్సిన మోటార్ల విడి భాగాలన్నీ నీళ్లు, బురదలో కూరుకుపోయాయని.. నష్టం కోట్ల రూపాయల్లోనే ఉండవచ్చని సిబ్బంది అంటున్నారు. ఈ విషయమై కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డిని, ఈఎన్​సీ వెంకటేశ్వర్లును ‘వెలుగు’ప్రతినిధి సంప్రదించగా స్పందన రాలేదు.

Latest Updates