భద్రాచలం మన్యంలో విజృంభిస్తున్న కాళ్లవాపు వ్యాధి

  • నాలుగు నెలల్లో 14 మంది మృతి
  • తూర్పు, పశ్చిమ మన్యంలో కలకలం

భద్రాచలం: ఓ వైపు కరోనాతో ప్రపంచం వణుకుతుంటే భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న తూర్పు, పశ్చిమ మన్యాల్లో కాళ్లవాపు వ్యాధి వణుకు పుట్టిస్తోంది. తాజాగా ఆంధ్రా విలీన మండలాలైన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం, పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండ లాల్లో కాళ్ళవాపు అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన నాలుగు నెలల్లో 14 మంది మృతిచెందారు. ఉమ్మడి ఏపీలోని ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న సమయంలోనూ ఈ రోగం ఇక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలుగేళ్ల క్రితం 28 మంది చనిపోయారు. ఢిల్లీ నుంచి అధ్యయన బృందాన్ని రప్పించినా వారు వ్యాధి కారకాన్ని తేల్చలేకపోయారు. మళ్లీఇప్పుడు ఈ వ్యాధి పంజా విసురుతోంది. జనవరి 29న కట్టి రాంబా బు(21), కారం జోగయ్య, మార్చి 13న పండ్రూం దుర్గారావు, ఈ నెల 13న చింతూరు మండలం మదుగూరుకు చెందిన కట్టం నాగయ్య(43), 15న అదే గ్రామానికి చెందిన పాండ్రుం జోగయ్య(23), మామిళ్ల గూడేనికి చెందిన సరియం లక్ష్మయ్య(52) మృతి చెందారు. గురువారం మదుగూరుకు చెందిన పాండ్రు కన్నయ్య(35), కొండపల్లికి చెందిన వంజం సీతయ్య(18), వేగితోటకు చెందిన బంధం ముత్తమ్మ(55) చనిపోయారు. మదు గూరుకు చెందిన వారు ఆసుపత్రికి వెళ్లకుండా నాటు వైద్యం , మంత్రగాళ్లను ఆశ్రయించారని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన పెంటయ్య, జోగయ్యలు తులసిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.

చుక్కలొద్ది గ్రామంలోనే ఐదుగురు..

ప్రస్తుతం చింతూరు మండలంలో ప్రబలిన ఈ వ్యాధి గతంలో వరరామచంద్రాపురం, కూనవరం, ఎటపాకలను కూడా వణికించింది. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం చుక్కలొద్ది వలస ఆదివాసీ గ్రామంలో నెల రోజుల్లో ఐదుగురు ఆదివాసీలు కాళ్లవాపుతో కన్నుమూశారు. మారేడుబాక గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో ఉండే చుక్కలొద్ది గ్రామంలో 20 కుటుంబాలవారుంటున్నారు. మడకం అడమయ్య(50), సోడె సోమ(35), మడకం మాడ(35), కొవ్వాసి సోమడ(35), కుంజా గంగమ్మ(35)లు ఇదే రోగంతో మరణించారు. ఇదే గ్రామానికి చెందిన మరో నలుగురు మంచానపడ్డా రు. వైద్యబృందాలు గ్రామానికి వెళ్లి చికిత్స అందిస్తున్నాయి. కానీ మరణాలకు అసలు కారణాలను ఇప్పటి వరకు గుర్తించలేక పోయారు. పౌష్టికాహార లోపం వల్లే ఈ రోగం వస్తుందని గౌరిదేవిపేట పీహెచ్‍సీ మెడికల్‍ ఆఫీసర్ పుల్లయ్యచెబుతున్నారు. విలీన మండలాల రోగులు డయాలసిస్‍కు వెళ్లాలంటే ఘాట్‍ రోడ్డును దాటి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెళ్లాలి. ఈ పరిస్థితుల్లో కాళ్లవాపు వ్యాధి తూర్పు, పశ్చిమ మన్యానికి సవాల్‍ విసురుతోంది.

Latest Updates