న్యాయ వ్యవస్థ ధనికులు, శక్తివంతుల వైపే

  • పదవీ విరమణ సందర్భంగా సుప్రీం కోర్టు జస్టిస్ దీపక్ గుప్తా
  • న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడాలని సూచన

న్యూఢిల్లీ: దేశ న్యాయ వ్యవస్థ ధనికులకు, శక్తివంతులకు అనుకూలంగా ఉందని సుప్రీంకోర్టు జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. ధనవంతుడి కేసులలో న్యాయ వ్యవస్థ వేగంగా పనిచేస్తుందని, పేదలకు సంబంధించిన వ్యాజ్యాల విచారణ మాత్రం ఆలస్యం అవుతుందని అన్నారు. మూడేళ్లుగా సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేస్తున్న దీపక్ గుప్తా..బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడ్కోలు పొందిన మొదటి న్యాయమూర్తిగా గుప్తా చరిత్రలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

‘‘చట్టాలు, న్యాయ వ్యవస్థ ధనవంతులు, శక్తివంతమైనవారికి అనుకూలంగా ఉంటాయి. ధనవంతులు, శక్తివంతులు ఎవరైనా నిందితులుగా ఉంటే.. మరో ఉత్తర్వు వచ్చేంతవరకు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. సివిల్ వ్యాజ్యాలను ఆలస్యం చేయాలనుకుంటే సుప్రీం కోర్టు వరకు వెళ్లగలుగుతారు. విచారణను కావాలని ఆలస్యం చేయగలరు. ఇది ఖర్చుతో కూడుకున్నది గనుక పేదలు అలా చేయలేరు” అని గుప్తా అన్నారు. ఉష్ట్రపక్షిలాగా తల దాచిపెట్టుకుని న్యాయవ్యవస్థలో అంతా బాగానే ఉందని అనుకోవడం మంచిది కాదని, అందులోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు కృషి చేయాలని న్యాయమూర్తులకు సూచించారు. న్యాయవ్యవస్థపై గొప్ప నమ్మకం ఉన్న మన దేశంలో దాని సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

లాయర్లు కూడా సైద్ధాంతిక, రాజకీయాల వైపు వాదించడం మంచిదికాదని, చట్టం వైపు నిలబడాలని కోరారు. సంక్షోభ సమయాల్లో పేదలకు రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడతాయని, అలాంటి వారి పక్షాన గొంతెత్తితే కోర్టులు వినాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన దీపక్ గుప్తా పలు కీలక తీర్పులిచ్చిన బెంచ్​లలో భాగస్వామిగా ఉన్నారు. వీడ్కోలు కార్యక్రమంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్ పాల్గొన్నారు.

Latest Updates