శంషాబాద్ ఏరియాలో చిరుత కలకలం

  • ఎయిర్ పోర్టు గోడ దూకి పొలాల్లోకి..
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్
  • బోన్లు ఏర్పాటు చేసి పట్టుకుంటం: ఫారెస్ట్ ఆఫీసర్లు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఎయిర్ పోర్టు గోడ దూకి పొలాల్లోకి వెళ్లింది. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డయింది. సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు, ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. బోన్లు ఏర్పాటు చేసి, త్వరలోనే చిరుతను పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు చెప్పారు. శంషాబాద్ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుత సంచరిస్తోందని తెలిసిన పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ, గొల్లపల్లి, రషీద్ గూడ గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.

గోడ దూకి పొలాల్లోకి..

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి, రషీద్గూడ రోడ్లకు ఆనుకొని ఎయిర్పోర్టు గోడ ఉంది. ఆదివారం రాత్రి 10 గంటల టైంలో చిరుత ఎయిర్పోర్ట్ గోడ దూకి పొలాల వైపు వెళ్లడాన్ని స్థానికులు చేశారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సోమవారం పోలీసులతో కలిసి వచ్చిన ఫారెస్టు ఆఫీసర్లు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గోడ ప్రాంతం, గొల్లపల్లి, రషీద్ గూడ గ్రామాలతోపాటు చిరుత తిరిగిన ప్రాంతాలు పరిశీలించారు. తర్వాత సీసీ ఫుటేజీని చూశారు. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది.

చిరుత సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే పులిని పట్టుకోవాలని వేడుకుంటున్నాం. – జగన్ మోహన్ రెడ్డి, రైతు, రషీద్ గూడ

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మా గ్రామంలోకి ఇంకో చిరుత వచ్చిందని తెలిసింది. రాత్రిళ్లు కూడా పొలానికి వెళ్తాం. వెళ్లి వచ్చే దారిలో చిరుత దాడి చేస్తదేమోనని భయంగా ఉంది.- రాములమ్మ, రషీద్ గూడ

Latest Updates