మళ్లీ లెప్రసీ పంజా

కనుమరుగైపోయిందనుకున్న కుష్టు (లెప్రసీ) మళ్లీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో వందలాది మంది దాని బారిన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ లెప్రసీ స్క్రీనింగ్​ చేస్తోంది. ఆ లెక్కల ప్రకారం 90 వేల మందికి కుష్టు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అందులో 1,400 మందికి ఆ జబ్బు ఉన్నట్టు నిర్ధారించారు. మరో 100 నుంచి 200 కేసులు నమోదయ్యే అవకాశముందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

అయితే, ఆగస్టు చివరి నాటికి రాష్ర్టంలో 2,263 మంది కుష్టుతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ లెక్కకు మరో 1,400 కలిసి ఆ జబ్బున్నోళ్ల సంఖ్య 3,663కు పెరిగింది. నిజానికి 2005–06లోనే దేశంలో కుష్టు వ్యాధి కనుమరుగైందని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. లెప్రసీ కంట్రోల్​ యూనిట్లనూ ఎత్తేశారు. కానీ, మూడేళ్లుగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏటా సగటున 1.2 లక్షల కేసులు నమోదవుతున్నాయి. రాష్ర్టంలో 2016–17లో మూడు ఉమ్మడి జిల్లాల్లో సర్వే చేసి 515 కేసులను గుర్తించారు. ఆ ఏడాది మొత్తం 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 2017–18లో నిజామాబాద్​ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో స్ర్కీనింగ్​ చేస్తే మొత్తం 2,800 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కుష్టు వ్యాధి ఉన్నట్టు తేలిన వారికి రిఫాంపిసిన్​, డాప్సోన్​ అనే టాబ్లెట్లను పంపిణీ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ జిల్లాల్లోనే ఎక్కువ

ఆసిఫాబాద్​, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో కుష్టు కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అక్కడే ఎక్కువ కేసులు ఎందుకు అన్న ప్రశ్నకు అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్టు వస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది తొందరగా సోకుతుంది. కుష్టులో రెండు రకాల కేసులుంటాయి. పీబీ (పాసీబాసిలరీ); ఎంబీ (మల్టీబాసిలరీ). పీబీ దశలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా ఒంట్లోకి ప్రవేశించిన ఐదేళ్లకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. మల్టీ డ్రగ్​ థెరపీ ద్వారా కుష్టును పూర్తిగా నయం చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

  •     రాష్ర్టవ్యాప్తంగా  స్ర్కీనింగ్​ చేస్తున్న ఆరోగ్య శాఖ
  •     90 వేల అనుమానిత కేసులు.. 1,400 మందికి పాజిటివ్​
  •       ఇప్పటిదాకా 3 వేలు దాటిన మొత్తం కేసులు

లక్షణాలు:

    శరీరంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడటం

    స్పర్శ తగ్గడం 

    చర్మం పొడిబారడం

    అరికాళ్లపై నొప్పిలేని వాపు, పుండ్లు

    కండరాల బలహీనత

    కంటి సమస్యలు

    మొహం, చెవులపై వాపు

    కనుబొమ్మ వెంట్రుకలు రాలడం

Latest Updates