లెప్రసీ మళ్లొస్తున్నది

హైదరాబాద్, వెలుగు: అంతమైందనుకున్న కుష్టు (లెప్రసీ) మళ్లీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రాష్ర్టంలో ఇంటింటి సర్వే చేశారు. ఇందులో సుమారు 90 వేల మంది అనుమానితులను గుర్తించగా, 1,927 మందికి కుష్టు ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. గద్వాల జిల్లాలో అత్యధికంగా 168 కేసులు నమోదు కాగా, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (146), భూపాలపల్లి (110) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికే రాష్ర్టంలో సుమారు 3,300 మంది లెప్రసీ పేషెంట్లు ఉన్నారు. కొత్తగా గుర్తించిన 1,927 కేసులతో కలిపి రాష్ర్టంలో కుష్టు పేషెంట్ల సంఖ్య 5 వేలు దాటింది.

ప్రమాదమేమీ కాదు

మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్టు వస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు తొందరగా సోకుతుంది. కుష్టులో రెండు రకాల కేసులుంటాయి. పీబీ (పాసీబాసిలరీ); ఎంబీ (మల్టీబాసిలరీ). పీబీ కేసుల్లో 6 నెలలు మందులు వాడితే వ్యాధి తగ్గుతుంది. ఎంబీ కేసుల్లో కనీసం ఏడాదిపాటు మందులు వాడాలి. శరీరంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడటం, స్పర్శ తగ్గడం, చర్మం పొడిబారడం, అరికాళ్లపై నొప్పిలేని వాపు, పుండ్లు, కండరాల బలహీనత, కంటి సమస్యలు, మొహం, చెవులపై వాపు, కనుబొమ్మ వెంట్రుకలు రాలడం వంటి లక్షణాల ఆధారంగా కుష్టును గుర్తించొచ్చు. అయితే పీబీ టైప్ లెప్రసీలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా ఒంట్లోకి ప్రవేశించిన ఐదేళ్లకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో తమకు రోగం ఉన్నట్టు కూడా చాలా మంది తెలుసుకోలేరు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఉమ్మి ద్వారా లెప్రసీ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. దీంతో కుటుంబ సభ్యులకు సోకకుండా, వారికి కూడా ప్రివెంటివ్ డ్రగ్స్ అందజేస్తున్నట్టు స్టేట్ లెప్రసీ కంట్రోల్ యూనిట్ అధికారులు వెల్లడించారు. రాష్ర్టంలో లెప్రసీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.

ఉచితంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

లెప్రసీ పేషెంట్లందరికీ ప్రభుత్వమే ఉచితంగా మందులు అందజేస్తోంది. ఇప్పటికే పాత కేసుల్లో దాదాపు అందరికీ వ్యాధి నయమైందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా గుర్తించిన రోగులకు మల్టీ డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థెరపీ ప్రారంభించామని, మందులు ఎలా వినియోగించాలో అవగాహన కల్పించామని వివరించారు. ప్రస్తుతం కుష్టు వ్యాధి ఉన్నట్టు తేలిన వారికి రిఫాంపిసిన్, డాప్సోన్ అనే టాబ్లెట్లను పంపిణీ చేస్తున్నారు.

అంతమైందనుకుంటే..

20వ శతాబ్దంలో కుష్టు వ్యాధి ఎక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా కంట్రోల్ యూనిట్లను పెట్టి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు. వ్యాధి విస్తరణ తగ్గుముఖం పట్టడంతో 2005–06లో దేశంలో కుష్టు వ్యాధిని నిర్మూలించినట్టు ప్రకటించారు. లెప్రసీ కంట్రోల్​యూనిట్లనూ ఎత్తేశారు. కానీ ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఏటా సగటున 1.2 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి.

 

 

Latest Updates