పిల్లలు అదేపనిగా కూర్చునే ఉంటున్నారా? అది పెద్దయ్యాక డేంజర్!!

పదేళ్ల వయసు దాటాక పిల్లలు చలాకీగా, హుషారుగా ఉంటారు. వాళ్లు టీనేజ్ ముగిసి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి శారీరకంగా, మానసికంగానూ ఆరోగ్యంగా కనిపిస్తారు. ఏ పని చేసినా యాక్టివ్‌గా దూసుకెళ్తుంటారు. కానీ కొద్ది మంది ఏ పని మీదా ధ్యాస లేకుండా ఎప్పుడూ మూడీగా కూర్చుని కనిపిస్తుంటారు. డల్‌గా కనిపిస్తూ డిప్రెషన్ అంచుల్లో ఉంటారు. దీనికి కారణమేంటో అర్థం కాక తల్లిదండ్రులు తలపట్టుకుంటుంటారు. మావాడు ఎప్పుడూ మొద్దులా కనిపిస్తున్నాడంటూ బాధపడుతుంటారు. ఏ పనిలోనూ ఇతర పిల్లలతో పోటీపడలేకపోతున్నాడని నిరాశతో పిల్లల్ని తిడుతుంటారు. అయితే అసలు పిల్లలు 18 ఏళ్లు దాటాక డిప్రెషన్‌ మూడ్‌లో ఉండడానికి కారణాన్ని గుర్తించారు యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు. కౌమార దశలో (12 నుంచి 16 ఏళ్ల మద్య) పిల్లలు ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అదే పనిగా కూర్చుని ఉంటే 18 ఏళ్ల వయసులో డిప్రెషన్‌ బారినపడే ముప్పు పెరుగుతుందని తేల్చారు.

సుదీర్ఘ కాలం స్టడీ

లండన్‌లోని 4257 మంది పిల్లలపై సుదీర్ఘ కాలం అధ్యయనం చేశారు యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ శాస్త్రవేత్తలు. 1990ల్లో పుట్టిన పిల్లలను ప్రతి దశలోనూ పరిశీలిస్తూ వచ్చారు. వారి చదువు, హాబీస్, వ్యాయామం, శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలన్నీ ఎప్పటికప్పుడు నోట్ చేశారు. ఆయా ఫలితాలను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తమ స్టడీ కోసం వినియోగించుకున్నారు. 12, 14, 16 ఏళ్ల వయసుల్లో ఆ పిల్లల ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది? 18 ఏళ్ల తర్వాత వారి శారీరక, మానసిక ఆరోగ్యం పరిస్థితి ఏంటి? క్లినికల్‌గా వాళ్లు రిపోర్టులు నేరుగా పరిశీలించారు. ఆయా వయసుల్లో పిల్లల ఫిజికల్ యాక్టివిటీ తీరును లైట్, మీడియం, సెడెంటరీ (పూర్తిగా డల్‌గా కూర్చునే ఉండడం) అని మూడుగా విభజించారు.

10 శాతం చొప్పున ముప్పు అధికం

నడక, ఇంట్లో ఆడుకోవడం, పెయింటింగ్ లాంటి హాబీస్‌ని లైట్ యాక్టివిటీగా నిర్ణయించారు యూనివర్సిటీ ఆఫ్ లండన్ కాలేజీ పరిశోధకులు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, గ్రౌండ్‌లో ఆటలు లాంటివి మీడియం యాక్టివిటీగా, స్కూలు నుంచి వచ్చాక బ్యాగ్ పడేసి ఇంట్లో కదలకుండే కూర్చునే వాళ్లని సెడెంటరీలో పెట్టారు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గేకొద్దీ 10 శాతం చొప్పున డిప్రెషన్ ముప్పు పెరిగింది.

ఆటలు ఆడేలా..

18 ఏళ్లు దాటాక 4257 మంది పిల్లల క్లినికల్ స్టేజ్‌ని పక్కన పెట్టి  కొన్ని ప్రశ్నలు అడగడం డిప్రెషన్‌లో ఉన్నారా లేదా అనే దాన్నిని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. మూడీగా ఉండడం, ఏ పనిపై ఇంట్రెస్ట్ లేకపోవడం లాంటి కొన్ని లక్షణాల ఆధారంగా పిల్లలకు డిప్రెషన్ ఉన్నవాళ్ల శాతాన్ని తేల్చారు. 12, 14, 16 ఏళ్ల వయసుల్లో ఉన్నప్పుడు రోజులో ప్రతి 60 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ తగ్గే కొద్దీ 18 ఏళ్ల వయసు తర్వాత 11.1, 8, 10.5 శాతం చొప్పున డిప్రెషన్ ముప్పును గుర్తించారు. ఆయా అన్ని వయసుల్లోనూ ఎక్కువ సమయం స్తబ్ధుగా గడిపిన వారు 28.2 శాతం ప్రమాదం ఉందని చెప్పారు శాస్త్రవేత్తలు. పిల్లలు అదేపనిగా సెల్‌ఫోన్ పట్టుకుని, టీవీ చూస్తూ కూర్చుని ఉంటుంటే ఆటలు ఆడుకుంటూ నలుగురిలో కలిసేలా చూడడం మంచిందని తెలిపారు.

Latest Updates