‘కావేరి’కి సాయం చేస్తం

మన దేశీ జెట్ ఇంజన్ ప్రాజెక్టుపై  ఫ్రాన్స్ కంపెనీ ‘శాఫ్రాన్’ ఆఫర్

దాదాపు ముప్పై ఏండ్లు అవుతోంది.. మనదేశంలోనే సొంతంగా ఐదో తరం యుద్ధ విమానాలను  తయారు చేసుకోవాలన్న ప్రయత్నాలు మాత్రం సక్సెస్ కావడం లేదు. ఈ యుద్ధ విమానం తయారీ కోసం డీఆర్‌‌డీవో మూడు దశాబ్దాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, వైఫల్యాలే ఎదురవుతున్నాయి. ఇందుకు కారణం.. వీటికి అమర్చాల్సిన కావేరి ఇంజన్ తయారీలో అడుగు ముందుకు పడకపోవడమే! అయితే, ఈ ప్రాజెక్టులో తాము పూర్తి సహకారం అందిస్తామంటూ తాజాగా ఫ్రాన్స్‌‌కు చెందిన శాఫ్రాన్ ఏరోస్పేస్ కంపెనీ ఆఫర్ ఇచ్చింది. కావేరి ఇంజన్ తయారీకి సహకరించడమే కాకుండా పూర్తి టెక్నాలజీని ట్రాన్స్‌‌ఫర్ చేస్తామని తెలిపింది. ఆ కంపెనీ హెల్ప్ తీసుకుంటే మన దేశీ జెట్ ఇంజన్ తయారీ దిశగా కీలక ముందడుగు పడినట్లేనని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

రాఫెల్ ఇంజన్‌‌ల వెనక ‘శాఫ్రాన్’

మనదేశం కొన్న తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవలే ఫ్రాన్స్‌‌లో అందుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫైటర్ జెట్‌‌ను ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ కంపెనీ తయారు చేసినా, దానికి చాలా కీలకమైన  ఎం-88 టర్బో ఫ్యాన్ ఇంజన్ లను తయారు చేసింది మాత్రం శాఫ్రాన్ ఏరోస్పేస్ కంపెనీయే. ఇటీవల ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ ఆధ్వర్యంలో రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, ఇతర అధికారుల బృందం పారిస్ సమీపంలోని శాఫ్రాన్ కంపెనీకి వెళ్లారు. ఫైటర్ జెట్ ఇంజన్‌‌ల తయారీలో సహకరించడంతో పాటు అందుకు అవసరమైన పూర్తి టెక్నాలజీని అందిస్తామని ఈ సందర్భంగా శాఫ్రాన్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇంతవరకూ జెట్ ఇంజన్‌‌ల తయారీ టెక్నాలజీని తాము ఏ దేశానికీ ఇవ్వలేదని వారు వెల్లడించారు.

కావేరి ఇంజన్ కథ ఇదీ..

ఐదో తరం యుద్ధ విమానాలను సొంతంగా తయారుచేసుకునేందుకు ఇండియా 30 ఏండ్ల కిందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ (ఎల్సీఏ) కు అమర్చడం కోసం కావేరి ఇంజన్‌‌లను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం1986లోనే డీఆర్‌‌డీవోకు అనుమతి ఇచ్చింది. ఈ ఇంజన్ తయారీ బాధ్యతను డీఆర్‌‌డీవోకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్​ మెంట్ సంస్థ తీసుకుంది. కానీ ఇన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఈ ప్రాజెక్టు ఇంకా పరిశోధన దశలోనే కొనసాగుతోంది. దీంతో తేజస్ ఎల్సీఏల కోసం రక్షణ శాఖ అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్స్ కంపెనీ నుంచి ఎఫ్​–404 ఇంజన్లను కొని, అమర్చింది. అయితే కావేరి ఇంజన్‌‌కు రెండు ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ఆఫ్టర్ బర్నింగ్, రెండు టర్బో ఫ్యాన్. ఈ రెండు స్పెషాలిటీస్ ఉన్న జెట్ ఇంజన్ ఆ విమానాన్ని సూపర్ సోనిక్ (సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్) వేగంతో పరుగులు తీయిస్తుంది.

ఫైటర్ జెట్ల కొనుగోళ్లకు త్వరలో ఫుల్ స్టాప్

ఐదో తరం యుద్ధ విమానాలను సొంతంగా  తయారుచేసుకునేందుకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, సమీప భవిష్యత్తులోనే ఫైటర్ జెట్లు దిగుమతులు చేసుకోవడమన్నదే ఉండదని ఎయిర్​ఫోర్స్ చీఫ్​ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అన్నారు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) పేరుతో తయారు చేస్తున్న వీటి కోసమే కావేరి ఇంజన్ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ‘‘ఫైటర్ జెట్ల తయారీలో 15 శాతం ఖర్చు ఇంజన్ల తయారీకే అవుతుంది. రెండు మూడు వందల ఇంజన్లను కొనే బదులు ఆ టెక్నాలజీని కొంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో పాటు కీలకమైన టెక్నాలజీని సొంతం చేసుకున్నట్లు కూడా ఉంటుంది” అని నేవీ మాజీ చీఫ్​ అడ్మిరల్ అరుణ్​ ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.

Latest Updates