లిబ్రా డిజిటల్‌‌ కరెన్సీ ఆగయా

విమర్శలను పట్టించుకోని ఫేస్‌‌బుక్‌‌

న్యూయార్క్‌‌: ఎన్నో అడ్డంకులు ఎదురైనా పట్టించుకోకుండా ఫేస్‌‌బుక్‌‌ తన క్రిప్టోకరెన్సీ లిబ్రాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు నుంచి మాస్టర్‌‌కార్డ్‌‌, వీసా, పేపాల్‌‌ వంటి సంస్థలు గతంలోనే తప్పుకున్నాయి. అమెరికా రాజకీయ నాయకుల నుంచి ప్రభుత్వ సంస్థ నుంచి విమర్శలు, అభ్యంతరాలు వచ్చాయి. అయినప్పటికీ  జెనీవాలో కరెన్సీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఫేస్‌‌బుక్‌‌కు చెందిన లిబ్రా అసోసియేషన్‌‌ డిజిటల్‌‌ కరెన్సీని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా 21 మంది ఫౌండింగ్‌‌ మెంబర్లు డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు. అసోసియేషన్‌‌లో మొదట 27 మంది మెంబర్లు ఉండేవారు. వీసా, పేపాల్‌‌ వంటివి వెళ్లిపోవడంతో ఈ సంఖ్య 21కి పడిపోయింది. వీరిలో ఎక్కువ మంది వెంచర్‌‌ క్యాపిటల్‌‌ కంపెనీలకు చెందినవాళ్లు. ఉబర్, లిఫ్ట్‌‌, స్పాటిఫై, వొడాఫోన్‌‌ వంటి పెద్ద కంపెనీలకూ ఇందులో మెంబర్షిప్‌‌ ఉంది. లిబ్రా అసోసియేషన్‌‌లో చేరడానికి మరో 180 కంపెనీలు ఆసక్తి చూపాయని, వీటికి తగిన అర్హతలూ ఉన్నాయని ఫేస్‌‌బుక్‌‌ తెలిపింది.

తీవ్ర వ్యతిరేకత వచ్చినా..

వివిధ దేశాల యూజర్లు సులువుగా చెల్లింపులు జరిపేందుకు అనువుగా ప్రైవేట్‌‌ కరెన్సీ సిస్టమ్‌‌ను తీసుకొస్తామని ఫేస్‌‌బుక్ గత ఏడాది చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫేస్‌‌బుక్‌‌ యూజర్ల వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని చాలా మంది ఆందోళన ప్రకటించారు. దీనిపై ది మెన్లో పార్క్‌‌ అనే అమెరికా కంపెనీ స్పందిస్తూ ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టే ఫేస్‌‌బుక్‌‌ లిబ్రా కోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసిందని తెలిపింది. లిబ్రా పూర్తిగా ఫేస్‌‌బుక్‌‌ సొంత కంపెనీ కాదని పేర్కొంది. ఇలాంటి వివాదాలు ఎన్ని వచ్చినా కంపెనీ వెనక్కి తగ్గలేదు. లిబ్రాను రూపొందించిన ఫేస్‌‌బుక్‌‌ ఆఫీసర్‌‌ డేవిడ్ మార్కస్‌‌ను అసోసియేషన్‌‌ తన డైరెక్టర్లలో ఒకరిగా ఎంపిక చేసింది. లిబ్రా వివాదంపై అమెరికా హౌజ్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ కమిటీ ఈ నెలాఖరున చర్చించనుంది. ఫేస్‌‌బుక్‌‌ సీఈఓ జుకర్‌‌బర్గ్‌‌ దీనికి హాజరవుతారు. ఈ కమిటీ చైర్మన్‌‌ మాక్సిన్‌‌ వాటర్స్‌‌ లిబ్రాను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందరి అనుమానాలనూ తీర్చాకే డిపాజిట్లు తీసుకుంటామని లిబ్రా అసోసియేషన్‌‌ ప్రకటించింది.

Latest Updates