వలస బతుక్కి గ్యారెంటీ లేదు

లిబియాలో దారుణంగా డిటెన్షన్ సెంటర్లు

మైగ్రెంట్లు.. లిబియాలోని అత్యంత దారుణమైన డిటెన్షన్ సెంటర్లలో చిక్కుకున్నారు..  రియో గ్రాండే నదీ తీరాలకు కొట్టుకుపోయారు.. మధ్యదరా, పసిఫిక్ సముద్రాల్లో మునిగారు.. విమాన బాంబు దాడులకు బలైపోయారు.. అయినా వారి నడక ఆగలేదు. కానీ అడుగడుగునా అవరోధాలే. దీంతో ఆశ్రయం కోసం బోర్డర్ లో పడిగాపులు కాస్తున్నారు.

గతేడాది 7 కోట్ల మంది..
ఒకటీ రెండు కాదు గతేడాది ఏకంగా ఏడు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయులయ్యారని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. 2019లో మరెందరో వలస వెళ్తున్నారని, లేదా లిబియాలో నిర్బంధ కేంద్రాల్లో చిక్కుకుపోతున్నారని తెలిపింది. ఎయిర్​ఫోర్స్ దాడుల్లో చనిపోతున్నారని చెప్పింది. వారం రోజుల కిందట ట్రిపోలి సబర్బన్‌‌ ప్రాంతంలోని టజౌరా డిటెన్షన్ సెంటర్​పై మంగళవారం జరిగిన ఎయిర్​స్ట్రైక్​లో 44 మంది వలసదారులు చనిపోయారు. వలసదారులను టజౌరాతో పాటు లిబియాలోని ఇతర డిటెన్షన్‌‌ సెంటర్లలో లిబియన్‌‌ కోస్ట్‌‌గార్డ్‌‌ నిర్బంధిస్తోంది. ఈయూకు బోర్డర్ ఫోర్స్​మాదిరి పని చేస్తోంది. కూటమిలోని 28 ప్రభుత్వాలు.. మైగ్రెంట్ల రాకను అంగీకరించకపోవడంతో ఈయూ ఇలా చేస్తోంది. మరోవైపు యూరప్‌‌ దేశాలతోపాటు, అమెరికాలో వలస సంక్షోభం తలెత్తినా.. టర్కీ, పాకిస్థాన్‌‌ , ఉగాండా దేశాలు రెఫ్యూజీలను ఆహ్వానిస్తున్నాయి. వలసదారులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో ఇవి తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. ఈ లిస్టులో జర్మనీ ఐదో స్థానంలో ఉంది.

20 ఏళ్ల యువకుడు.. చస్తూ బతుకుతున్నడు
సబ్ సహారన్ ఆఫ్రికా నుంచి వలస వచ్చిన ఓ 20 ఏళ్ల యువకుడి బాధ వర్ణనాతీతం. విమాన బాంబు దాడుల నుంచి బయటపడ్డాడు. సరిహద్దు దాటుతున్న సమయంలో మిలీషియా మెంబర్లు జరిపిన కాల్పుల నుంచీ బయటపడ్డాడు. డబ్బుల కోసం ట్రాఫికర్లు పెట్టిన హింసను భరించాడు. మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన బోటులో ఉన్నా.. ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం వందలాది మైగ్రెంట్లతో కలిసి టజౌరా డిటెన్షన్ సెంటర్ బయట ఉన్నాడు. సరిహద్దు దాటడానికి మరో చాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘‘మా దేశంలో జరిగిన యుద్ధంలో నా సోదరులను పోగొట్టుకున్నా. లిబియాలో ఎన్నోసార్లు చావు అంచుల దాకా వెళ్లా. చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా” అని చెప్పుకొచ్చాడతను. అయితే తన పేరు చెప్పలేదు.

పడవల మునకలు ఆగలే
ఎయిర్​ఫోర్స్ దాడుల తర్వాత కూడా రెండు పడవలు లిబియా తీరంలో మునిగిపోయాయి. 140 మందికిపైగా గల్లంతయ్యారు. మరో పడవలో వెళ్తున్న గ్రూప్​ను ఇటీలీకి చెందిన ఓ రెస్క్యూ షిప్ కాపాడింది.

ఉద్యోగాలు కల్పించండి
‘‘సమస్యను మూలాల్లోకి వెళ్లి పరిష్కరించుకోవాలి. అంతేకాని మైగ్రెంట్లను అడ్డుకోవడం సరికాదు. యూరప్‌‌కు వలస వెళ్లేందుకు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. వారిని అడ్డుకోవాలంటే దక్షిణ లిబియా, మైగ్రెంట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పించండి. పెట్టుబడులు పెట్టండి’’ లిబియా హోంశాఖ మంత్రి ఫాతీ బషాఘా.. యూరప్​ను కోరారు.

Latest Updates