జీవితమే ఓ క్రికెట్‌‌ మ్యాచ్‌‌

life-is-a-cricket-match

క్రికెట్‌‌‌‌పండుగ మొదలైంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం క్రికెట్‌‌‌‌ ఫీవర్‌‌‌‌తో ఊగిపోతోంది. ఈ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో 10 టీంలు పాల్గొంటున్నాయి. ఎవరు గెలుస్తారు? కప్‌‌‌‌ ఎవరికి దక్కుతుంది అనే విషయాలు పక్కనపెడితే.. ఈ ఆటను జీవితానికి అన్వయించుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

క్రికెట్‌‌‌‌ టీంలో ఎవరి బలాలు వాళ్లకుంటాయి. బౌలర్లు, బ్యాట్స్‌‌‌‌మెన్లు, కీపర్‌‌‌‌, ఫీల్డర్లు… టీం మొత్తం కలిసికట్టుగా ఆడితేనే విజయం దక్కుతుంది. ఒకరిద్దరు పొరపాట్లు చేసినా, మిగిలిన వాళ్లు విజయంకోసం కష్టపడాలి. ఒక్కోసారి చిన్నతప్పు మ్యాచ్‌‌‌‌ మొత్తాన్ని మలుపు తిప్పుతుంది. జీవితం కూడా అలాంటిదే. అమ్మానాన్న, కుటుంబం, పిల్లలు, స్నేహితులు.. అందరితో కలిసి బతకాలి. సలహాలు తీసుకోవాలి. ఇవ్వాలి. రిలేషన్స్‌‌‌‌లో, చేసే పనిలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. ‘నేనే రాజు, నేనే మంత్రి’ అనుకుంటే కుదరదు. ఒకే మనిషి కొడుకు.. కూతురు, తండ్రి.. తల్లి, ఫ్రెండ్, ఉద్యోగి .. అనేక బాధ్యతలు నిర్వహించాలి. జీవితం కూడా అనేక బంధాలు, బాధ్యతలతో ముడిపడిన క్రికెట్​లాంటిదే.

ముందుండి నడపాలి..

కెప్టెన్​.. టీంను ముందుకు నడిపేవాడు. సభ్యులకు సలహాలు, సూచనలు ఇస్తూ గెలవడం కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తాడు. ప్రత్యర్థుల ఆటతీరును గమనిస్తూ ఎత్తులు వేస్తాడు. మ్యాచ్‌‌ గెలవడమే లక్ష్యంగా శ్రమిస్తాడు. కెప్టెన్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే బ్యాటింగ్‌‌ లేదా కీపింగ్‌‌ లేదా బౌలింగ్‌‌లో రాణిస్తాడు. జీవితం విషయానికొస్తే, ఎవరి జీవితానికి వాళ్లే కెప్టెన్. బరిలో దిగిన తర్వాత ఎవరి మ్యాచ్‌‌ వాళ్లు ఆడాల్సిందే. ఇతరులు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. సాయం అందుకోవచ్చు. కానీ లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, సాధించడం, జీవితాన్ని అందంగా తయారుచేసుకోవడంలో ఎవరి బతుకు వాళ్లదే. ఎవరి ఎత్తులు, పై ఎత్తులు వాళ్లవే.  ఎదగడం కోసం ప్రతిఒక్కరూ క్రికెట్‌‌లో కెప్టెన్‌‌లా కష్టపడాలి.

ప్రయత్నం చేయాలి

కీపర్‌‌ తప్ప మిగిలిన వాళ్లందరూ క్రికెట్‌‌లో  ఫీల్డింగ్‌‌ చేస్తారు. ఫోర్లు, సిక్స్‌‌లు  పోకుండా ఆపేందుకు చాలా పెద్ద ప్రయత్నమే చేస్తారు. బతకడం కోసం ప్రతి ఒక్కరూ క్రికెట్‌‌ గ్రౌండ్‌‌లో ఫీల్డర్‌‌లా రోజూ ఇలాంటి కసరత్తు చేయాల్సిందే. నిద్రలేచింది మొదలు పడుకునే వరకు ఉరుకులు, పరుగులు తప్పవు. వద్దనుకున్నా, వదిలేద్దామనుకున్నా కుదరదు. బరువు, బాధ్యతల మధ్య సంపాదన, ఉద్యోగం కోసం పోరాడాల్సిందే. లక్ష్యం అనే బాల్‌‌ అందుకోవడానికి ప్రయత్నించాల్సిందే. బతుకుపోరులో ప్రతి ఒక్కరూ ఫీల్డర్లే.

అవకాశాలు అందుకోవాలి

కీపర్‌‌ బౌలర్​ సంధించే బంతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బ్యాట్స్​మెన్​ని అవుట్​ చేసే అవకాశం అసలు వదులుకోడు. జీవితంలో కూడా ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా? అని ఎదురు చూడాలి. కాలం కలిసి రాకపోయినా ఆశతో జీవించాలి. చిన్న ఆసరా దొరికినా దాని సాయంతో ఎదగాలి. ప్రతి క్షణం కీపర్‌‌లా కొత్త అవకాశాలకోసం ప్రయత్నిస్తూ ఉండాలి. అవకాశాన్ని అనుకూలంగా మలచుకోవడానికే ప్రయత్నించాలి.

మ్యాచ్​.. అబీ బాకీ హై

మొదట బ్యాటింగ్‌‌ చేసో లేక బౌలింగ్‌‌ చేసో ఫెయిల్‌‌ అయినంత మాత్రాన మ్యాచ్‌‌ ఓడిపోయామని బాధపడాల్సిందేం లేదు. సగం మ్యాచ్‌‌ మిగిలే ఉంటుంది. బ్యాటింగ్‌‌లో రాణించకపోయినా బౌలింగ్‌‌లో రాణించి గెలవొచ్చు. జీవితం కూడా అంతే.. ఒక అవకాశం చేజారిందని బాధపడే కంటే, మరో అవకాశం కోసం వెతకాలి. ఓటమి నుంచి బయటపడి, ఆ ఓటమినే విజయంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. తప్పు పక్కనే ఒప్పు ఉంటుంది. ఒక రంగంలో రాణించలేదంటే, మరో రంగంలోకి అడుగుపెట్టాలి. చాలామంది పనిని ప్రారంభించి మధ్యలోనే వదిలేస్తుంటారు. అలా కాకుండా చివరి వరకు పోరాడాలి. ఒకటి కాకపోతే మరొకటి అందుకొని ముందుకెళ్లాలి.

బెస్ట్‌ ఫినిషర్‌

బ్యాటింగ్‌‌ చేసేటప్పుడు పిచ్‌‌ని అర్థం చేసుకోవాలి. బౌలింగ్‌‌ ఎలా పడుతుందో గమనించాలి. ఓపెనింగ్‌‌లో  ఒకలా, మిడిల్‌‌  ఆర్డర్‌‌లో మరొకలా, ఫినిషింగ్‌‌లో ఇంకొకలా బ్యాటింగ్‌‌ చేయాలి. జీవితంకూడా అంతే.. ఒక్కసారిగా కోట్లు సంపాదిస్తా, పెద్ద ఇల్లు కడతా, గొప్ప ఉద్యోగం కావాలి.. అంటే కుదరదు. ముందు పునాది బలంగా వేసుకోవాలి. పరిస్థితులు గమనించి, ముందుకు పోవాలి. జాక్‌‌పాట్‌‌ తగిలిందని ఎగిరిగంతేసే లోపే అడ్డంకులు ఎదురుకావచ్చు. ఆడుతూ పాడుతూ సాగే బాల్యం నుంచి చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, కుటుంబం..  బాధ్యతలు పెరుగుతూ పోతాయి. ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉంటాయి. భవిష్యత్తు కోసం  డబ్బు దాచుకోవాలి. జీవితంలో ఎదురయ్యే  ఆటుపోటులు తట్టుకుని ముందుకెళ్లాలి. జీవితంలో చివరి దశ వచ్చేసరికి బ్యాట్స్‌‌మెన్‌‌లా మంచి ఫినిషింగ్‌‌ ఇచ్చాననే సంతృప్తి మిగుల్చుకోవాలి.

దూకుడు అవసరమే..

బౌలర్ల లక్ష్యం వికెట్లు తీయడం, ఎక్కువ పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌‌మెన్లను కట్టడి చేయడం. బ్యాట్స్‌‌మెన్‌‌ ఆటతీరు గమనించి బౌలింగ్‌‌ మారుస్తుండాలి. అచ్చం అలాగే  జీవితంలో చిన్నప్పుడు ఒకటి రెండు పొరపాట్లు చేసినా, తట్టుకుని నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లొచ్చు. అలాగే కొన్ని పనులు చేసేటప్పుడు ఉరుకులు, పరుగులు తప్పవు. కోపం, బాధ రావొచ్చు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. బౌలింగ్‌‌లో కూడా బ్యాట్స్‌‌మెన్లను అవుట్ చేయడానికి బౌలర్‌‌ వేసే  రకరకాల బంతుల్లా. . పని పూర్తికావాలంటే జీవితమనే బౌలింగ్‌‌లో కాస్త దూకుడు అవసరం.

Latest Updates