కరోనాకు ముందు.. తర్వాత..

మారిపోనున్నజీవితం
ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ పర్ట్స్ చెబుతున్నది ఇదే
మనుషులు దూరం.. మనసులు దగ్గర
దేశభక్తికి కొత్త అర్థం.. ప్రాణాల్ని కాపాడేవాళ్లకే మన్ననలు
నో పోలరైజేషన్.. అందరికీ ఒకే కామన్ శత్రువు
దేవుణ్ని మొక్కడంలోనూ కొత్త శైలి
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం.. నెట్లోనే వైద్యం
మందుల తయారీకి సర్కారు కంపెనీలు
వర్చువల్ పార్లమెంట్.. ఫోన్లతోనే ఓట్లేసే రోజులు
అసమానతలు పెరిగే చాన్స్.. లైఫ్ స్టైల్లో మార్పులు

కరోనా.. 3 నెలల ముందు ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేస్తోంది. ప్రతి ఒక్కరిలో దడ పుట్టిస్తోంది. కరోనాకు ముందు
మన జీవితం వేరు. అది ఎంటరయ్యాక మనం చూస్తున్న లైఫ్ వేరు. ఇప్పుడేముంది.. ముందుంది అసలు మార్పు అంటున్నారు నిపుణులు.
కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అనేంతలా ప్రపంచం మారిపోయే అవకాశముందని చెబుతున్నారు. మన తిండి, కట్టు, బొట్టు, వైద్యం… ఒక్క
మాటలో చెప్పాలంటే మన మన జీవితాలనే అది మార్చేస్తుందంటున్నారు.

పొద్దునెప్పుడో ఆఫీసుకెళ్లే నాన్న.. రాత్రైతే గానీ ఇంటికి రాడు. పిల్లలతో మనసు విప్పి మాట్లాడే టైం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అది మారింది.

పొద్దున స్కూలు..సాయంత్రం దాకా క్లాస్ రూంలో పుస్తకాలతో కుస్తీ.. ఇంటికి వచ్చాక హోం వర్క్.. ఆడుకునే టైం లేదు పిల్లలకు.
అదీమారిందిప్పుడు.

సిటీల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్. టన్నుల కొద్దీ పొల్యూషన్. కానీ, ఇప్పుడు మొత్తం క్లియర్.

చదువుకుని మంచి పొజిషన్ లో ఉన్నోళ్లు.. ఇంటి నుంచే పని చేస్తున్నారు. కానీ, పొట్టచేతబట్టుకుని పట్నాలకు వలసెళ్లిన కూలీలు
బతుకుజీవుడా అంటూ సొంతూళ్లకు వెనక్కొస్తున్నారు.

ఇవన్నీచిన్న మార్పులే. కానీ, వాటి ఎఫెక్ట్ మాత్రం పెద్దదే. దానంతటికీ కారణం మహమ్మారి కరోనా. ఇలాంటి చిన్నచిన్న మార్పులే కాదు. పెద్ద పెద్ద మార్పులకు ముందు ముందు ఈ మహమ్మారి బాటలు వేస్తుందంటున్నారు నిపుణులు. ఆచార వ్యవహారాల్లో కొత్త పోకడ వస్తుందంటున్నారు. చదువు నుంచి రాజకీయాల వరకు, మతంనుంచి మానవత్వం వరకు, నమ్మకాల నుంచి సైన్స్ వరకు, హెల్త్ నుంచి టెక్నాలజీ వరకు, తినే తిండి దగ్గరి నుంచి లైఫ్ స్టైల్ వరకు ఎన్నెన్నో మార్పులకు దోహదం చేస్తుందంటున్నారు. 30 మంది నిపుణులు ఆ మార్పులు ఎట్ల జరుగతయో కళ్లకు కట్టారు. ఇప్పటికిప్పుడు ఆ మార్పులన్నీ సాధ్యం కాకపోయినా, మార్పులకు దారులు మాత్రం పడతాయంటున్నారు. అందులో కొన్ని పాజిటివ్ మార్పులున్నాయి. ఇంకొన్ని నెగెటివ్ ఉన్నాయి. మరి, ఆ మార్పులేంటి.. ఎట్లా వస్తాయో చూద్దాం.

ఆరోగ్యం పైలం
ఆరోగ్య రంగంలో ఎన్నెన్నో మార్పులు వస్తాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా ప్రైవేట్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అయినా, ఏడాదిన్నర టైం పడుతుందంటున్నాయి. వాటికీ వివిధ దేశాల ప్రభుత్వాలు సహకారాలందిస్తున్నాయి. నిజానికి చాలా కంపెనీలు ఇలాంటి వాటికి ముందుకు రావు. వాటిని తయారు చేసేటప్పుడు తమ లాభాన్నీ చూసుకుంటాయి. ఎంత వరకు అది ప్రాఫిటబులో ఆలోచిస్తాయి. తయారు చేసినా పేటెంట్ అంటూ మెలికపెడతాయి. దీంతో సామాన్యుడికి అది అందే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో
ప్రభుత్వాలే రంగంలోకి దిగి సొంతంగా వాటిని అభివృద్ధి చేయించేందుకు కృషి చేస్తాయి. దాని వల్ల ప్రతి పేదవాడికీ మందులందేలా బాటలు పడతాయి. ఇప్పటికిప్పుడు అది సాధ్యంకాకపోయినా, ఎప్పుడో అప్పుడు అది మాత్రం కచ్చితంగా నిజమవుతుంది. ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తేగానీ మందులు రాయరు. ఇప్పుడు ఆ బెడద లేకుండా టెలీమెడిసిన్ కు దార్లు ఫ్రీ అవుతున్నాయి. ఇండియా సహా చాలాదేశాలు దానికి ఆమోదం చెబుతున్నాయి. దీనివల్ల ఓ పేషెంట్ కు తొందరగా ట్రీట్మెంట్ అందే అవకాశాలుంటాయి. ఇటు ప్రతి ఇంటికి వైద్యం అందే
అవకాశాలొస్తాయి. మూఢనమ్మకాలను పక్కనపెట్టి సైన్స్ ను నమ్మే రోజులొస్తాయి. 35 ఏళ్లలో కచ్చితంగా ఆ మార్పు కనిపిస్తుంది.

రాజకీయంలో కొత్త నీళ్లు
ఎప్పుడూ కొత్త సీసాలో పాత సారానేనా.. ఇకపై ఆ పరిస్థితి మారుతుందంటారు నిపుణులు. అవును, రాజకీయాల్లో కొత్త నీళ్లు పారుతాయంటున్నారు. దాని వెనక ఆవేశం, ఆక్రోశం, కడుపు రగిలిన బాధ ఉంటుందని చెబుతున్నారు. చాలా దేశాల్లో ఈ ఎమర్జెన్సీ అయిపోగానే డబ్బున్నోళ్లు, అన్ని అందుబాటులో ఉన్నోళ్లను అక్కును చేర్చుకుని, పేదలు, కనీస అవసరాలు తీరని వాళ్లను విస్మరించే పరిస్థితి
ఉంటుందంటున్నారు. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు కంపెనీలకు బెయిలవుట్లు ప్రకటించే ప్రభుత్వాలు, పేదలను మాత్రం
పట్టించుకోవంటున్నారు. అదే జరిగితే ఎప్పుడూ తమనే మోసం చేస్తారన్న భావన పేదల మనసుల్లోకి నాటుకుపోతుందని, వాళ్ల కడుపు రగిలి ఆందోళనలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

అసమానతలు పెరుగుతయ్
కొన్ని దశాబ్దాలుగా ఓ వర్గానికి చెందిన వాళ్ల ఇన్ కం మెరుగుపడతూ వస్తోంది. చదువుకున్నోళ్లు, మంచి మంచి పొజిషన్లో ఉన్నోళ్లకు ఆదాయంలో ఢోకా లేదు. అలాంటి వాళ్లు మంచి జాబులు చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి విపత్కర పరిస్థితులెదురైనా ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం ఉంది. కానీ,చదువుకోనోళ్లు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నోళ్ల పరిస్థితి అందుకు భిన్నం. ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు వాళ్ల ఆదాయానికి గండి పడుతుంది. పని ఉండదు.ఫలితంగా అసమానతలు పెరుగుతాయి. వాళ్ల పిల్లలకు చదువు, వైద్యం చేయించుకునే స్తోమతా ఉండదు. గ్యాప్ మరింత పెరుగుతుంది.

లైఫ్ స్టైల్ మారుద్ది
కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే చాలా మంది లైఫ్ స్టైల్ మారిపోయింది. మన దగ్గర లాక్డౌన్ తో మందు వంటివి దొరికే పరిస్థితి లేదు. ఇది ఇంకొన్నాళ్లు ఇలాగే ఉంటే, దాదాపు చాలా మంది ఆరోగ్యకరమైన అలవాట్లకు దగ్గరయ్యే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలు వచ్చాక, చాలా మంది ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఈ టైంలో అది తగ్గి ఇంట్లోనే వండుకోవడం ఎక్కువైంది. ఇదీ ఒకందుకు మంచిదేనంటున్నారు నిపుణులు. అమెరికాలో అయితే, చాలా మంది ఇప్పటికే ఇంట్లో వండుకోవడం మొదలుపెట్టారట. నిజానికి అక్కడి వాళ్లకు
బయటి ఫుడ్డే దిక్కు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని అక్కడా గరిట తిప్పే రోజులొచ్చాయి. ఇక, కరోనా ఎఫెక్ట్ తో ఇన్నాళ్లూ ఇండ్లలోనే ఉంటున్న
వాళ్లు, ఆ ఎఫెక్ట్ తో ఇక మంచి గాలికి బయట తిరిగేందుకు మొగ్గు చూపిస్తారు. మానసిక ప్రశాంతత కోసం పరితపిస్తారు. అందుకోసం పార్కుల బాట పడతారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పార్కులకు కొత్త రూపు వస్తుంది.

ఇంటి నుంచే ఓట్లు
ఎన్నికల రోజు రాగానే జనం పోలింగ్ బూతుల ముందు క్యూ కట్టేస్తారు. నచ్చిన నాయకుడికి ఓటేస్తారు. అయితే, చాలా మంది ఉద్యోగం, ఇతర పరిస్థితుల వల్ల ఓటేసే చాన్స్ మిస్సవుతుంటారు. ఇకపై అలా కాకుండా అందరూ ఓటేసే అవకాశంవస్తుందంటున్నారు. ఇంటి నుంచే ఫోన్లతో ఓటేసే వీలు చిక్కుతుందంటున్నారు. ఇప్పటికే మన దేశంలో పోస్టల్ బ్యాలెట్ ఉన్న సంగతి తెలుసు కదా. ఆ వెసులుబాటు కొందరికి మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఫోన్లలో ఓటు వేసే అవకాశం వస్తుందని చెబుతున్నారు. మెయిల్లోనూ ఓట్లు పంపే రోజులు వస్తాయని చెబుతున్నారు. ఒకరోజు ఎన్నికలు కాస్తా నెలరోజులు లేదా నెలల తరబడి జరిగే
అవకాశాలూ ఉన్నాయట.

తినే తిండిమారుద్ది..
గ్లోబలైజేషన్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ తో ఉన్న వనరులన్నింటినీ వాడేస్తున్నాం. అది చాలదన్నట్టు అడవులు ఆక్రమించేస్తున్నాం. దీంతో అక్కడి వన్యప్రాణులు మనం ఉంటున్న చోటుకు వచ్చేస్తున్నాయి. వాటినీ వేటాడేసి తినేస్తున్నారు. అందువల్లే అప్పుడు సార్స్, ఇప్పుడు కరోనా వంటివి విజృంభించాయన్న వాదన వినిపిస్తోంది. అయితే, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ను తగ్గించేసి, వన్యప్రాణులను తినడం తగ్గిస్తే ఆ వైరస్లు జంతువుల్లోనే ఉండిపోతాయని, జనాలదాకా ఇలాంటివి రావని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనం తినే తిండిలోనూ మార్పులు
వస్తాయంటున్నారు. హెల్దీ ఫుడ్ పై ఫోకస్ పెడతారంటున్నారు.

డొమెస్టిక్ సప్లైస్ పెరుగుతయ్
కరోనా ఎఫెక్ట్ తో వివిధ దేశాల మధ్య సప్లయ్ చెయిన్ తెగిపోయింది. ఎక్కడికక్కడ ఎగుమతులు,దిగుమతులు ఆగిపోయాయి. అవసరాలకు తగ్గట్టు మాత్రమే అవి జరుగుతున్నాయి. ఈ ఎఫెక్ట్ తో వివిధ దేశాల్లో డొమెస్టిక్ సప్లయ్ చెయిన్ కు డిమాండ్ పెరిగింది. ఇక్కడి వస్తువులు ఇక్కడే ఉండేలా దారులు తెరుచుకున్నాయి. మొత్తంగా దేశీ ఉత్పత్తులకు ఇంపార్టెన్స్ పెరిగింది. దీని వల్ల ప్రజలకు ఖర్చు తగ్గుతుంది. అది మరింత ఎక్కువవుతుంది.

దేవుణ్ని మొక్కుడూ మారుతది
మొన్న శ్రీరామనవమి పండుగనే ఉదాహరణగా తీసుకుందాం. మామూలుగా అయితే, కొన్ని లక్షల మంది భక్తులు శ్రీరాముడి కల్యాణం చూడ్డానికి వెళ్తుండేవాళ్లు. కానీ, ఇప్పుడు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే అక్కడకు వెళ్లారు . అందరూ ఇళ్లలో నుంచే ఆ కార్యక్రమాన్ని చూశారు. ఇది ఒక్క మతానికి సంబంధించిందే కాదు. అన్ని మతాలకూ వర్తిస్తుంది. ఈ నెలలో జరిగే ఈస్టర్ వేడుకలనూ తీసుకుందాం. భక్తులెవరూ రావొద్దని వాటికన్ పిలుపునిచ్చింది. లైవ్ టెలీ కాస్ట్ లోనే చూడాలని చెప్పింది. అలాగని మత విశ్వాసాలు మారతాయని కాదు. దేవుణ్ని మొక్కే విధానం,
కార్యక్రమాలు నిర్వహించే విధానాల్లో మాత్రం మార్పులొస్తాయి.
– ఎమీసలివాన్, ఓట్ కామన్ డ్డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ

దేశభక్తి కొత్తగా..
చాలా దేశాల ప్రభుత్వాలకు ఇప్పుడు దేశభక్తి అన్నది ఓట్లు మలిచే ఆయుధంగా మారిపోతోంది. అందుకు బారర్డ్ దగ్గర ప్రాణాలను పణంగా పెడుతున్న సైన్యమే అందరికీ ముందు గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరికీ ఓ సైనికుడంటే ఎనలేని గౌరవం. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లను నిజమైన సైనికుల్లా చూస్తున్నారు ప్రపంచ జనం. వాళ్లకు సెల్యూట్ చేస్తున్నారు. వారికి సానుభూతి చూపిస్తున్నారు. మున్ముందు అదింకా పెరుగుతుంది. మన
ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడే వారికిచ్చే గౌరవం మరింత ఎక్కువవుతుంది. అదే గొప్ప దేశభక్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.
– పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మార్క్ లారెన్స్

టెక్నాలజీకి వరం
ఇప్పటికే ప్రపంచం మొత్తం ఆన్ లైన్ యుగంగా మారిపోయింది. అదింకా ఎక్కువవుతుంది. అన్నింట్లోనూ అది భాగమైతదని చెప్పలేం. కానీ, చాలా రంగాల్లో మాత్రం దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. టెలీమెడిసిన్ అంతగా లేకపోయినా, ఇప్పుడిప్పుడే దానిపై మొగ్గు చూపిస్తున్నాయి చాలా దేశాలు. మన దేశంలోనూ దానికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ తో స్కూళ్లు, కాలేజీలు బందయ్యాయి. దీంతో చాలా ప్రభుత్వాలు ఆన్లైన్ క్లాసులకు ఓకే చెప్పేశాయి. ఇంట్లోనే పాఠాలు వినేలా డీటీహెచ్ క్లాసులకు మన ప్రభుత్వం ఓకే చెప్పింది. డిజిటల్ క్లాస్ రూంలను ప్రోత్సహిస్తోంది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు సై అన్నాయి. ఇకపై అది మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైంలో ఇంట్లోనే ఎక్సర్ సైజులు చేసుకునేలా చాలా మంది యోగా ఎక్స్ పర్ట్స్ ఆన్లైన్లో ఫ్రీ ట్యుటోరియల్స్ ఇస్తున్నారు. క్వారంటైన్లో ఒంటరిగా ఉంటున్నామన్న ఫీల్ లేకుండా చూస్తోంది వర్చువల్ రియాలిటీ. మన దేశంలో దానికి ఇంకా ప్రచారం అంతలేకపోయినా, విదేశాల్లోమాత్రం ఎక్కువగానే ఉంది. భవిష్యత్లో ఇలాంటివి వస్తే ఎదుర్కొనే ధైర్యం వస్తుంది.

సభలు, సమావేశాలు నెట్లోనే
పార్లమెంట్ కావొచ్చు.. కాంగ్రెస్ కావొచ్చు.. సభలో నేతలంతా కూర్చుని ప్రజాసమస్యలపై చర్చిస్తుంటారు. అందులో చర్చ కన్నా గొడవే ఎక్కువ కనిపిస్తది మనకు. అయితే, మున్ముందు ఆ సభాసమావేశాలూ ఆన్లైన్లోకి మారిపోయే అవకాశాలున్నాయి. అంటే సభకు రావాల్సిన అవసరం లేకుండా ఉన్న నియోజకవర్గం నుంచే ఆ వర్చువల్ సభలో పాల్గొనే టైం వస్తుంది. ప్రజల సమస్యలను తెలుసుకుని వాళ్లకు దగ్గరయ్యేలా చేస్తుంది. అంతేకాదు, ప్రభుత్వ సేవలకూ డిమాండ్ పెరుగుతుంది. మొత్తంగా పెద్ద ఫెడరల్ వ్యవస్థలు మరింత బలంగా తయారవుతాయి.

పోలరైజేషన్ తగ్గుతది
చాలా దేశాలు రాజకీయ, సాంస్కృతిక పోలరైజేషన్ (వర్గాలు లేదా గ్రూపుల విభజన) అనే ఒక చట్రంలో చిక్కుకుపోయాయి. ఈ కరోనా టైం ఒకేజాతిగా మారేందుకు అవకాశం కల్పించింది. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి ‘కామన్ శత్రువు’. ఇప్పుడు అందరికీ కామన్ శత్రువు కరోనా. కులం, మతం, వర్గం అన్న తేడాలేకుండా అది అందరినీ కబళించేస్తోంది. దీనిపై ఫైటింగ్ కు ఒక్కతాటిపైకి వచ్చారంతా. అది మరింత ఎక్కువవుతుంది. రెండోది పొలిటికల్ షాక్ వేవ్. అంటే, ప్రాంతాల వారీగా గీతలు గీసుకుని బతికేస్తున్నాం మనం. ఇప్పుడు హద్దులనేవి లేకుండా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఆ దేశానికి ఈ దేశం.. ఈ దేశానికి ఆ దేశం పరస్పరం సాయం చేసుకుంటున్నాయి. అంటే, ఒకరకంగా ఇప్పటికే అది ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికిప్పుడు అది మరింత ఎక్కువ కాకపోయినా, రాబోయే రోజుల్లో తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది.
– పీటర్ టీ. కోలెమన్, కొలంబియా
యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్

For More News..

ఉద్యోగులకు షాక్ ఇస్తున్న కంపెనీలు.. రాత్రికి రాత్రే టర్మినేషన్ లెటర్లు

Latest Updates