క‌రోనాకి ట్రీట్ మెంట్ మ‌న‌లోనే..

కరోనా వైరస్ బారిన పడకుండా మనకు మనమే లాక్ డౌన్ విధించుకొని బయటికి రాకుండా జాగ్రత్తగా ఉంటున్నాం. ఒకవేళ ఈ వైరస్ మనదాకా వస్తే? కరోనా విషయమే కాదు వేరే చిన్న జబ్బులు వచ్చినా ఇప్పుడు ఉన్న టైంలో మెడికల్ సర్వీస్ దొరకడం కూడా కష్టమే. అందుకే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ ని ఎలా కాపాడుకోవాలో చెబుతున్నారు నేచురోప‌తి డాక్ట‌ర్ ఖాజా పాషా.

నేచురోపతిలో కరోనా వైరస్ కి చికిత్స ఉందా? వైరస్ కి ఏ వైద్య విధానంలోనూ ఇప్పటి వరకు కచ్చితంగా ఇదీ అని మందు లేదు. వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కోవిడ్ మాత్రమే కాదు… ఏ వైరస్ కి అయినా కరెక్ట్ ట్రీట్మెంట్ మనలో ఉన్న ఇమ్యూనిటీపవర్ ని పెంచుకోవడమే. మన చుట్టుపక్కల ఉండే ఏరియా, మన ఇల్లు,  వాడే వస్తువులు ప్రతిదీ శుభ్రంగా ఉంచుకోవాలి. నిజానికి పరిశుభ్రమైన లైఫ్ స్టైల్,  మంచి ఫుడ్, మంచి ఆలోచనలు ఇవే నిజమైన మందులు. నేచురోపతి చెప్పేది ఒకటే ‌.. మన చుట్టూ ఉండే నేచురల్ లో కలిసిపోయి బతకటం. మట్టి, నీళ్ళు , ఆకాశం,  గాలి,  నిప్పు ఇవన్నీ మన బాడీలో కూడా ఉంటాయి. ప్రతి మనిషి తాను బతికే ప్రాంతంలోని 200 కిలోమీటర్ల లోపు దొరికే ఫుడ్డు మాత్రమే తినటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం ఉన్న వాతావరణానికి సరిపోయే యాంటీబాడీస్ మన శరీరంలో కరెక్టు లెవెల్స్ లో ఉంటాయి. రోజు ఒక యాపిల్ తినటం కంటే ఒక జామ లేదా బొప్పాయి తినడం ఎక్కువ మంచి చేస్తుంది. ఎక్కువ రోజులు నిలువ ఉంచిన ఫుడ్డు, ఫ్రూట్ చేసే మేలు తక్కువ. మన దగ్గర పండే పండ్లను తినాలి. గోధుమలకు బదులు బ్రౌన్ రైస్ , ఓట్స్ బదులు జొన్నలు తినొచ్చు. ఇవి వేగంగా మనలో ఇమ్యూనిటీపవర్ పెంచుతాయి. కూరగాయలు నిల్వచేసి వాడుకోవటం మంచిది కాదు. అట్లనే పండ్లు కూడా నిల్వ ఉన్నవి తినొద్దు.

అంటే ఫ్రిజ్లో పెట్టుకోవటం మంచిది కాదా?

ఇప్పుడు పరిస్థితి బట్టి ఫ్రిజ్ లో పెట్టక తప్పదు. కానీ మామూలుగా అయితే ఇలా చేయడం మంచిది కాదు. ఇప్పుడు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వండి తినేయాలి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తినాలి. మాంసం మనకి కావలసిన ప్రొటీన్లు ఇస్తుంది. కానీ  తినేది ఫ్రెష్ మాంసం కాకపోతే కొత్త సమస్యలు తెస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీపవర్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది. నిమ్మరసం, ఆరెంజ్ లాంటి జ్యూస్ వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత శరీరంలో ఇమ్యూనిటీపవర్ పెంచుతుంది. అది లేకుండా మనం ఎంత మంచి తిండి తిన్నా.‌ ఎన్ని జాగ్రత్తలు పాటించినా వృధా.

ఫుడ్ మెనూ ఎలా ఉండాలి?

వేపుళ్ళు, మసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పొద్దున లేవగానే గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం అంటే.. మన బాడీకి స్నానం చేయించినట్టే. అయితే నిమ్మ రసం తయారు చేసుకునేందుకు ఒక పద్ధతి ఉంది. నిమ్మకాయలు కోసేటప్పుడు గింజలు కట్ కాకూడదు. నిమ్మరసం తీశాక నీళ్లు కలపకుండా, నీటిలోనే జ్యూస్ కలపాలి. దీని వల్ల ఎసిడిటికి దూరంగా ఉండొచ్చు. పసుపు కలిపిన నీళ్ళు తాగటం, ఆవిరి పట్టడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ ఇవి కోవిడ్ కి పరిష్కారం కాదు. వైరస్ మన లోపలికి రాకముందు తీసుకునే జాగ్రత్తలు మాత్రమే. వీటి వల్ల వైరస్ చచ్చి పోదు. కాకపోతే మన బాడీలోకి చేరకుండా అడ్డుకునే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న చిన్నపిల్లలు ..పెద్ద వాళ్ల విషయంలో?

కోవిడ్ మాత్రమే కాదు ఎలాంటి వైరస్ అయినా ముందుగా ఎటాక్ చేసేది మన రెస్పిరేటరీ సిస్టమ్ మీదనే. ఆస్తమా, డస్ట్ ఎలర్జీ ఉన్న పిల్లలు .. వయసు మీద పడ్డ వాళ్ల విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. బ్రీతింగ్, ఎక్సర్ సైజులు, ప్రాణాయామం లాంటివి చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి రోజు కనీసం 20 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేస్తే చాలు. పెద్దవాళ్లు అర్థం చేసుకుంటారు. కానీ పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టం. అందుకే పిల్లలతో చిన్న చిన్న ఆటలు ఆడించాలి. మెట్లు ఎక్కడం దిగడం.. పరిగెత్తటం వంటి ఆటలు ఆడించాలి. అయితే బయట ఉన్నా గోడలని.. మెట్ల రేయిలింగ్స్ ముట్టుకోనియొద్దు. పిల్లల్ని బాగా నవ్వించాలి. గట్టిగా నవ్వుతున్నప్పుడు శ్వాసనాళాలు ఎక్కువగా తెరుచుకుంటాయి. అలాగని అదే పనిగా నవ్వించకుండా మధ్యమధ్యలో నవ్విస్తే చాలు.

డయాబెటిస్ వాళ్ళకి కోవిడ్ వల్ల ఎక్కువ ప్రమాదమా..? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్లలో ఇమ్యూనిటీపవర్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండి , బాడీలోకి వచ్చే చిన్న చిన్న సమస్యలతో పోరాడుతూనే ఉంటుంది. డయాబెటిస్ చేసేదే మన ఇమ్యూనిటీ పవర్ దెబ్బతీయడం. డాక్టర్లు చెప్పినట్టే మంచి ఫుడ్ తింటున్నా.. డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటం లేదంటే బ్రెయిన్ విశ్రాంతిగా లేదని అర్థం. అనవసరంగా భయపడి పానిక్ ఆపటం.. ఎప్పుడూ కోవిడ్ గురించి ఆలోచించడం మానేయాలి. ఫుడ్ తినేటప్పుడు టీవీ చూడ కూడదు. కరోనా వార్తలని అవాయిడ్ చేయాలి. అనవసరంగా ఆందోళన పడితే షుగర్ లెవల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు టెర్రస్, కారిడార్, అపార్ట్మెంట్ సెల్లర్ లోనూ వాకింగ్ చేయాలి. టాబ్లెట్స్, ఇన్సులిన్ వాడటం నిర్లక్ష్యం చేయొద్దు. షుగర్ కంట్రోల్లో ఉన్నంతకాలం కోవిడ్ గురించి భయపడటం అనవసరం. కూరగాయలు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. బియ్యం, గోధుమలు తినటం తగ్గించాలి. మినిమం ఎక్సర్ సైజ్ చేస్తే సరిపోతుంది.

వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వర్క్ ఫ్రొం హోమ్ చేయటం అంటే మామూలు కన్నా ఎక్కువ బర్డెన్ నెత్తిమీద పెట్టుకోవటమే. ఇంట్లో ఉండే వాతావరణం ఆఫీస్ వర్క్ చేసేందుకు ఏ మాత్రం సపోర్ట్ చెయ్యదు. మధ్యలో మాట్లాడాల్సి రావడం.. అవసరమైన చిరుతిళ్ళు తినటం ఎక్కువ అవుతాయి. ఇవి అటు వర్క్ ఇటు హెల్త్ నీ దెబ్బతీస్తాయి. అందుకే ఆఫీస్ వర్క్ చేయాలనుకుంటే ఆఫీస్ టైమింగ్స్ ఫాలో కావాలి. మామూలుగా ఎన్ని గంటలకి లేస్తామో.. ఎన్ని గంటలకి ఆఫీస్ చేరుకుంటామో.. ఆ టైం ఫాలో కావాలి. వీలైతే ఒక గదిని ఆఫీస్ గా మార్చుకోవాలి. ఇంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ ఎంత తగ్గితే అంత మంచిది. బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి పోవటం వల్ల చిరాకు, కోపం పెరుగుతాయి. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. పని మధ్యలో లేచి అటూ ఇటూ నడవాలి. సిగరెట్ , టీ లాంటి అలవాట్లను తగ్గించుకోవాలి. ముఖ్యంగా సిగరెట్ తగ్గించినప్పుడు ఆకలిగా అనిపిస్తుంది. చిప్స్, ఆయిల్ ఫుడ్ కాకుండా.. మొలకెత్తిన గింజలు, ఫ్రూట్స్ , వెజిటేబుల్ సలాడ్ తినాలి. రెగ్యులర్ ఆఫీస్ లైఫ్ స్టైల్ కి దూరం కావద్దు. ఏదో ఒక టైమ్ లో పని చేయవచ్చని పగలు నిద్రపోవటం సాయంత్రాలు సినిమా చూస్తూ.. రాత్రి ఎప్పటికో నిద్ర పోవడం లాంటివి చేయొద్దు. ఇది లాక్ డౌన్ అయిపోయాక డైలీ రొటీన్ ని డిస్టర్బ్ చేస్తుంది‌.

Latest Updates