డేటా ప్రైవసీ ఇలా

అప్పుడప్పుడు తమ ఫోన్​ హ్యాక్  అయిందని సెలబ్రిటీలు చెప్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మొబైల్​లో ఉన్న పర్సనల్​ డేటా హ్యాకర్ల చేతికి వెళ్తుంది. కొన్ని పర్సనల్​ ఫొటోలు కూడా లీకవుతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఫోన్​లోని డేటా ఇతరుల చేతికి వెళ్లకుండా కాపాడుకోవచ్చు.

కొత్త యాప్​ ఇన్​స్టాల్​ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎక్కువ మంది వాడే యాప్స్​తో పెద్దగా సమస్యలుండకపోవచ్చు కానీ, అంతగా ఎవరికీ తెలియని యాప్స్​ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బ్రౌజర్లు, థర్డ్​ పార్టీ సైట్స్​ నుంచి యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకోకూడదు. వీటిలో చాలా వరకు మాల్​వేర్​ ఉండే అవకాశముంది. ‘గూగుల్​ ప్లే స్టోర్’,  ‘యాప్​ స్టోర్’ నుంచి మాత్రమే డౌన్​లోడ్​ చేసుకోవాలి. సోషల్​ మీడియా, ఇతర యాప్స్​లో వచ్చే లింకులను క్లిక్​ చేయకూడదు.

పాస్​వర్డ్స్,  పిన్​కోడ్​ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ఓ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఎక్కువ మంది ‘12345’ వంటి సులభమైన పాస్​వర్డ్స్​ పెట్టుకుంటున్నారు. ఇలాంటి పాస్​వర్డ్స్,  పిన్​ కోడ్​లను హ్యాకర్లు ఈజీగా పట్టేస్తారు. అందుకే కాస్త కష్టమైన వాటిని పాస్​వర్డ్స్​గా సెట్​ చేసుకోవాలి. అలాగే అవి కష్టమైనా సరే ఒక యాప్​ కోసం వాడిన పాస్​వర్డ్​ మరో దానికి వాడకూడదు.

ఫోన్​ ఓఎస్​కు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్​డేట్​ వచ్చినా వెంటనే ఫాలో అవ్వాలి. అలాగే యాప్స్​ను కూడా అప్​డేట్​ చేసుకుంటూ ఉండాలి. కొత్త అప్​డేట్​లలో సెక్యూరిటీ ఫీచర్లు యాడ్​ అవుతూ ఉంటాయి. దీనివల్ల మాల్​వేర్,  బగ్స్​ నుంచి కాపాడుకోవచ్చు.

కొత్త యాప్స్​ ఇన్​స్టాల్​ చేసుకున్నప్పుడు అవి రకరకాల ‘పర్మిషన్స్’ అడుగుతుంటాయి. వాటిని ఓకే చేసేముందు కాస్త ఆలోచించాలి. వాటికి అన్ని యాక్సెస్​లు ఇవ్వాలా వద్దా అని పరిశీలించాలి. ‘లొకేషన్,  గ్యాలరీ, కెమెరా, కాంటాక్ట్స్,  సెన్సర్స్’​ వంటివి యాక్సెస్​ ఇచ్చేముందు జాగ్రత్తగా ఉండాలి.

ఫ్రీగా వస్తోంది కదా అని పబ్లిక్​ వై-ఫై వాడకూడదు. అలాగే హోటళ్లు, షాపింగ్​ మాల్స్​లో ఉండే ఉచిత వై-ఫై సర్వీస్​ వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

Latest Updates