పట్టాలున్నా.. ఫారెస్టు భూములంటాన్రు

రెవెన్యూ ఆఫీసర్ల నిర్వాకంతో భారీగా నష్టపోనున్న రైతులు

లింగంపేట శివారులో 170 మందికి పట్టాల పంపిణీ

తమ భూమి అంటూ అటవీశాఖ గెజిట్ జారీ

 రైతుబంధు పైసలు బంద్

 కొన్నోళ్లకు అన్యాయం

        తమ భూమి అంటూదశాబ్దాల క్రితం ప్రభుత్వాలు పేదలకు అసైన్డ్​ చేసిన వ్యవసాయ భూములకు సరైన హద్దులు చూపడంలో రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారు. వాళ్లు అనామత్​గా చూపిన భూముల్లో రైతులు ఇన్నేళ్లుగా సాగుచేసుకుంటూ వచ్చారు. లబ్ధిదారుల్లో కొందరు ఆర్థిక ఇబ్బందులతో భూములు అమ్ముకున్నారు. వాటిని వేరే రైతులు కొనుక్కున్నారు. వారి పేర కూడా మార్చుకున్నారు. తీరా ఇప్పుడు రెవెన్యూ శాఖ చేపట్టిన భూప్రక్షాళన సర్వేలో ఏకంగా 450 ఎకరాలు అటవీశాఖవని తేలింది. దీంతో కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన 170మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

లింగంపేట, వెలుగురెవెన్యూ ఆఫీసర్ల నిర్వాకంతో కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామ రైతులు భారీగా నష్టపోనున్నారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 983లో 450 ఎకరాల అసైన్డ్ భూమిని రెవెన్యూ ఆఫీసర్లు 1959, 1970, 1995, 1996 సంవత్సరాల్లో విడతల వారీగా 170 మంది రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. రెవెన్యూ ఆఫీసర్లు చూపిన చోట ఆయా రైతులు పంటలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ ఆఫీసర్లు ఆ భూమిని సర్వే చేసి అటవీశాఖకు చెందినదని తేల్చారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు తమ శాఖ భూమి అంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ భూమిలో పంటలు సాగు చేస్తున్న రైతుల పేర్లతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ ను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై పెట్టారు. ఈ క్రమంలో రెవెన్యూ ఆఫీసర్లు రైతుల పట్టాలను హోల్డ్ లో పెట్టారు. దీంతో వానాకాలం సీజన్ లో ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు పైసలు వారి ఖాతాలో జమకాలేదు. ఎకరానికి రూ.5వేల చొప్పున నష్టపోయారు.

కొన్నవాళ్ల పరిస్థితి ఏంది?

రెవెన్యూ ఆఫీసర్లు సర్వే నంబర్ 983లోని భూమిని రైతులకు పట్టాలు ఇవ్వగా, ధరలు పెరగడంతో పలువురు అమ్ముకున్నారు. ఈ క్రమంలో అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు పట్టాల మార్పిడి కూడా చేశారు. ఇప్పుడు అవే భూములు ఫారెస్ట్ శాఖ పరిధిలోనివని తేల్చడంతో లక్షలు పెట్టి కొనుగోలు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

అందులోనే సర్కార్ ఆఫీసులు

లింగంపేట శివారులోని 983 సర్వే నంబర్ భూముల్లో తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎస్సీ హాస్టల్, ఐకేపీ ఆఫీస్, విద్యుత్ సబ్ స్టేషన్, తదితర గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. తాజాగా ఈ భూములన్నీ అటవీశాఖ పరిధిలోకి వెళ్లడంతో ఏం జరుగుతుందోనని గవర్నమెంట్ ఆఫీసర్లు సైతం ఆందోళనగా ఉన్నారు.

అడ్డగోలుగా పట్టాలు

1954లో రెవెన్యూ శాఖ కాస్రా పహాణిని రూపొందించింది. ఇందులో రెవెన్యూ, ఫారెస్టు భూములకు సంబంధించిన వివరాలతోపాటు రెవెన్యూ శాఖకు చెందిన పట్టా భూములు, అసైన్ మెంట్, లావణి పట్టా, ఇనాం భూములకు సంబంధించిన వివరాలను కాస్రా పహాణీలో పొందుపరిచారు. సర్వేనంబర్ 983లోని భూములు 1954లో రూపొందించిన కాస్రా పహాణీలో ఫారెస్టు భూములని రికార్డుల్లో ఉన్నప్పటికీ రెవెన్యూ ఆఫీసర్లు అసైన్డ్ భూములుగా పట్టాలు పంపిణీ చేసినట్లు వెల్లడైంది.

24 ఏండ్లుగా సాగు చేస్తున్న
సర్వే నంబర్ 983లో మూడు ఎకరాల భూమికి 1996లో రెవెన్యూ ఆఫీసర్లు పట్టా ఇచ్చిన్రు. ఇందులో 24 ఏండ్లు గా పంటలు సాగు చేస్తున్న. యాసంగిలో రైతుబంధు పైసలు కూడా వచ్చాయి. కానీ ఈ మధ్య ఆ భూములు ఫారెస్టు వని చెప్పడంతో మా పట్టా లు హోల్డ్ లో పెట్టిన్రు. నాకాలం రైతు బంధు పైసలు ఇయ్యలేదు.-ఆరీఫ్, రైతు, లింగంపేట

భూములు పోతే ఎట్ల బతకాలె?

సర్వే నంబర్ 983లో నాకు రెండెకరాల భూమి ఉంది. ఎన్నో ఏళ్ల సుంది మేం పంటలు సాగుచేసుకుంట బతుకుతున్నం. ఇప్పుడేమో ఫారెస్టు ఆఫీసర్లు ఆ భూమి మాదే అంటున్నరు. ఎన్నో ఏండ్ల సుంది సాగుచేసుకుంటున్న భూములను మాకే దక్కేలా కలెక్టర్​ చూడాలె. రైతుబంధు పైసలు ఇప్పియ్యాలే. – నర్వ బాగవ్వ, రైతు, లింగంపేట

జాయింట్ సర్వే తర్వాత న్యాయం చేస్తం

సర్వే నంబర్ 983లోని భూములను రెవెన్యూ, ఫారెస్టు శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేపట్టి రైతులకు న్యాయం చేస్తం. 170 మంది రైతుల పట్టాలను హోల్డ్ లో ఉంచాం. జాయింట్ సర్వే తర్వాత రూల్స్ ప్రకారం రైతులకు పట్టాలు అందిస్తం. సర్కార్ రూల్స్ ప్రకారమే అందరూ నడుచుకోవాలి. -నారాయణ, తహసీల్దార్ లింగంపేట.

 

 

 

 

Latest Updates