పింక్, గోల్డ్ వాట్సప్‌ లింక్‌లతో జాగ్రత్త! 

పింక్, గోల్డ్ వాట్సప్‌ లింక్‌లతో జాగ్రత్త! 

న్యూఢిల్లీ: వాట్సప్‌‌ పింక్ పేరుతో వాట్సప్‌లో ఓ మెసేజ్ షేర్ అవుతోంది. ఈ లింక్‌‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని, లింక్‌‌ను ఓపెన్ చేసి ఫోన్ నంబర్‌‌ను ఇస్తే ఫోన్ హ్యాక్‌కు గురవుతుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరికొత్త ఫీచర్ల పేరుతో యూజర్లకు ఎర వేసుందుకు హ్యాకర్లు ఇలాంటివి చేస్తుంటారని ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. పింక్ కలర్‌లో వాట్సప్‌ను వాడుకోవచ్చననే అపోహతో ఈ లింక్‌‌ను చాలా మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. తాము వాడటమే కాకుండా మిగతావారికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇలాంటి లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ రాజశేఖర్ రాజహరియా సూచించారు. 

‘వాట్సప్ పింక్‌‌తో జాగ్రత్త. ఏపీకే డౌన్‌‌లోడ్ లింక్‌‌తో ఈ వైరస్ వాట్సప్ గ్రూపుల్లో వ్యాప్తి అవుతోంది. వాట్సప్ పింక్ పేరుతో వచ్చిన ఏ లింక్‌ను కూడా ఓపెన్ చేయకండి. దీని వల్ల మీ ఫోన్ డేటా పూర్తిగా హ్యాక్ అవ్వొచ్చు. మీ పర్సనల్ డేటా, ఫొటోలు, ఎస్‌‌ఎంఎస్‌‌లు, కాంటాక్ట్స్ లాంటివి ఎరేజ్ కావడం లేదా హ్యాక్ అవుతాయి. ఇలాంటి వాటిల్లో వాడే కీబోర్డ్ ఆధారిత మాల్‌‌వేర్ వల్ల మీరు టైప్ చేసే వాటిని పూర్తిగా ట్రాక్ చేయొచ్చు. పింక్ వాట్సప్ లేదా వాట్సప్ గోల్డ్‌లు ఫేక్ వాట్సప్ ఫీచర్ యాప్‌లు. ఇలాంటి వాటితో అప్రమత్తంగా ఉండండి’ అని రాజశేఖర్ పేర్కొన్నారు.