వానాకాలం వరకు కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లు: KCR

వానాకాలానికల్లా కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలన్నారు CM KCR.  కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై రివ్యూ చేశారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని చెరువులు, చిన్ననీటి వనరులను కాల్వల ద్వారా నింపాలని, ఇందుకోసం ఈ ఏడాది వీలైనన్ని చెరువులను లింక్ లోకి తీసుకురావాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. వానాకాలం నాటికి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా అన్ని బ్యారేజీలు, పంపుహౌజ్ ల పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, నిర్వహణ ప్రణాళికపై సీఎం సమీక్షించారు.

ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో… బ్యారేజీలు, పంపుహౌజ్ ల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడం అంతే ముఖ్యమని కేసీఆర్ చెప్పారు. బ్యారేజీలు, పంపుహౌజ్ లు, సబ్ స్టేషన్ల వద్ద ఇంజనీర్లు, సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది నివాసం ఉండేందుకు క్వార్టర్లు, వాచ్ టవర్లు నిర్మించాలని ఆదేశించారు. బ్యారేజీల దగ్గర భారీ ప్రవాహం ఉన్నా ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హైఫ్లడ్ లెవల్ కన్నా ఎత్తులో వాచ్ టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండేలా జాగ్రత్త పడాలని చెప్పారు.

నదిలో ప్రస్తుతమున్న హైఫ్లడ్ లెవల్ను కాకుండా ప్రాజెక్టు నిర్మాణం తర్వాత వచ్చే లెవల్ ను పరిగణనలోకి తీసుకొని పనులు చేయాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పటిష్టమైన భద్రత కోసం పోలీస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపే ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. ఈ ఏడాది వీలైనన్ని ఎక్కువ చెరువులను లింక్ చేయాలని సూచించారు. అన్ని కాల్వలపై మూడు వేలకుపైగా తూములు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

గతంలో చెరువులు నింపుకోవడానికి రైతులే ప్రాజెక్టు కాల్వలు తెంపేవారని, దాంతో పోలీస్ కేసులు, ఇతర సమస్యలు తలెత్తేవని సీఎం గుర్తుచేశారు. ప్రాజెక్టుల నీటితో చెరువులు నింపడంతో పాటు వాన నీళ్లు చెరువులు, కుంటల్లోకి చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం కూడా పెరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వానాకాలంలో ఆయకట్టుకు నిళ్లు ఇవ్వాలన్నారు.

Latest Updates