‘సోషల్’కు ఆధార్​ లింక్​ చేయాలి

న్యూఢిల్లీ: సోషల్ మీడియా యూజర్ ప్రొఫైల్స్ ను ఆధార్ తో లింక్ చేసే అంశంపై ఫేస్ బుక్ వేసిన పిటిషన్ ను  విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. యూజర్ ప్రొఫైల్స్ ను ఆధార్ నంబర్ తో లింక్  చేయాలంటూ మధ్యప్రదేశ్, బాంబే, మద్రాస్ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సుప్రీంకోర్టు బదిలీ చేయాలని ఫేస్ బుక్ సంస్థ కోరింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన బెంచ్ కేంద్ర ప్రభుత్వం, గూగుల్, ట్విటర్, యూట్యూబ్ ఇతరులకు నోటీసులు జారీచేసింది. సెప్టెంబర్ 13లోపు జవాబివ్వాలని ఆదేశించింది. సోషల్ మీడియా యూజర్ ప్రొఫైల్స్ ను  ఆధార్ నంబర్ తో లింక్ చేసే అంశానికి సంబంధించిన కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో కొనసాగుతుందని, తుది తీర్పు ఇవ్వబోదని బెంచ్ చెప్పింది. మద్రాస్ హైకోర్టులో 18 సార్లు హియరింగ్ జరిగిందని, వాదనలు ముగిసి తీర్పు వచ్చేవరకు ఆగాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బెంచ్ ను కోరారు.

ఫేస్ బుక్, వాట్సప్ తరఫున సీనియర్ అడ్వకేట్లు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. నేర విచారణకు దర్యాప్తు సంస్థలు అడిగే డేటాను సర్వీస్ ప్రొవైడర్లు అందజేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బ్లూ వేల్ గేమ్ ను ప్రస్తావించిన వేణుగోపాల్.. ఆ గేమ్ లో క్యూరేటర్ గురించి సర్కారుకు ఎలాంటి క్లూ దొరకలేదన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్ లకు కారణమైనవారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. బ్లూ వేల్ గేమ్ తో తమ ప్లాట్ ఫాంలకు ఎలాంటి సంబంధం లేదని ఫేస్ బుక్, వాట్సప్ సంస్థలు కోర్టుకు తెలిపాయి. థర్డ్ పార్టీతో డేటాను షేర్ చేస్తే  యూజర్ల ప్రైవసీ హక్కును ఉల్లంఘించినట్లేనని వాదించాయి.  ప్రైవసీ హక్కు,  దేశాన్ని పాలించే హక్కు రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉందని బెంచ్ అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అశ్లీల కంటెంట్. దేశ వ్యతిరేక, టెర్రరిజం అంశాలు వ్యాప్తి చెందకుండా చెక్ పెట్టేందుకు యూజర్ ప్రొఫైళ్లను ఆధార్ తో లింక్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. దీన్ని ఫేస్ బుక్ వ్యతిరేకించింది. యూజర్ల ఆధార్ నంబర్ ను షేర్ చేస్తే ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినట్లేనని చెప్పింది. థర్డ్ పార్టీతో ఆధార్ నంబర్ షేర్ చేయబోమని, వాట్సప్  ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అయి ఉన్నందున దాన్ని యాక్సెస్ చేయలేరని ఫేస్ బుక్ తెలిపింది.

Latest Updates