రోగమేందో పెదవి రంగు చెప్పేస్తది

నలుగురితో దోస్తీ చేయాలంటే.. పెదాలు దాటే మాటలు బాగుండాలి. నాలుగు కాలాల పాటు బతికి ఉండాలంటే.. పెదవులు దాటి కడుపులోకెళ్లే ఆహారం బాగుండాలి. అంతెందుకూ.. ‘దొండపండు లాంటి పెదవి’ అని అమ్మాయిల  పెదవులను కవులు అందంగా వర్ణిస్తారు. అయితే.. పెదవులు ఎంతసేపూ.. అందాన్ని వర్ణించడానికేనా? కాదు..పెదవులు చూసి ఆరోగ్యం ఎలా ఉందో కూడా చెప్పొచ్చు.

అందమైన పెదవులు లేకుండా.. ముఖం అందాన్ని వర్ణించలేం. ఎదుటివారిని స్నేహానికి ఆహ్వానించాలన్నా.. ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలన్నా పెదవులు చిలికే నవ్వే ఆధారం. నవ్వు ఒక మత్తు మందు. తెలిసిన వారినే.. కాదు.. తెలియని వారిని చూసి ఆప్యాయంగా నవ్వినా.. వారి పెదవులపై కూడా చిరునవ్వు పూస్తుంది. ఆ నవ్వుకు చిరునామా పెదవులు. అలాంటి పెదవులు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. కానీ.. మనిషి ఆరోగ్యాన్ని పెదవులు చెప్పేస్తాయని తెలుసా?  అవును.. లిప్​స్టిక్​లాంటి రంగులేవి లేకుండా.. పెదవుల రంగును చూసి ఎదుటివారి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని మార్పులను, ఆరోగ్య పరిస్థితులను కొన్ని శరీర భాగాలు అద్దంలా చూపిస్తాయి.

అందులో.. కళ్లు, గోళ్లు, పెదవులు, నాలుక బయటికి కనిపించేవి. ఆరోగ్యంలో మార్పులు పెదవుల రంగును మార్చేస్తాయి.  ఆ రంగులను గమనించి సమస్య ఏమిటో.. దాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలో ఆలోచించవచ్చు. ఆ ఆరోగ్య సమస్య పోవడానికి ఏ రకమైన ఆహారాలను ఉపయోగించవచ్చో శరీరం గుర్తించగలదు. కాబట్టి అద్దంలో మొహం చూసుకున్నప్పుడు మీ పెదవుల రంగును గమనిస్తుండాలి.

గులాబీ రంగులో ఉంటే..

పెదవులు సహజమైన గులాబీ రంగులో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్య లేనట్టే. కాక పోతే ఆ రంగులో చిన్న చిన్న మార్పులు గమనిస్తే మాత్రం శరీరంలో ఏదో మార్పు మొదలైందనట్టే. పెదవులు గులాబీ నుంచి లేత గులాబీ రంగులోకి మారినప్పుడు అది రక్త హీనతను సూచిస్తుంది. శరీరంలో హిమో గ్లోబిన్​, ఎర్రరక్తకణాలు తక్కువ ఉన్నట్టు. శరీరంలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు పెదవులు మెల్లగా బ్లీచింగ్​కి గురై లేత గులాబీ రంగులోకి మారిపోతాయి. అప్పుడు.. ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్​, మాంసం, పండ్లు, ఐరన్​, విటమిన్–​ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినాలి.

ఎర్రగా మారితే..

కొందరి పెదవులు సహజంగానే ఎర్రగా ఉంటాయి. సహజ ఎరుపు పర్వాలేదు కానీ.. ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఎర్రగా ఉంటే.. ఆరోగ్య సమస్య
ఉన్నదని గ్రహించాలి. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నా, చెడు శ్వాసతో ఇబ్బంది పడుతున్నా పెదవులు ఎర్రగా మారతాయి. కాలేయ పనితీరు మందగించినా, ఫుడ్ అలర్జీ, లిక్విడ్ అలర్జీ వల్ల కూడా పెదవులు రంగు మారతాయి. ఈ సమస్యతో బాధపడేవారు టీ తక్కువగా తాగాలి. తేనె ఎక్కువగా తీసుకుం టే పెదాల రంగులో మార్పు కనిపిస్తుం ది. ఒత్తిడి తగ్గేలా వ్యా యామం చేయాలి.

నల్లగా.. ముదురు ఎరుపు

కొంతమందికి పుట్టుకతోనే పెదాలు నల్లగా ఉంటాయి. కొంతమందికేమో.. పొగ తాగడం వల్ల పెదవులు నలుపు రంగులోకి మారతాయి. అయితే.. పెదవులు బాగా నల్లగా మారినా, ముదురు ఎరుపు రంగులోకి మారినా.. మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గమనించాలి. ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు ముందుగా జాగ్రత్త పడితే దీర్ఘకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ముందే చెక్​ పెట్టొచ్చు. ప్రాసెస్డ్​ ఫుడ్​, బేకింగ్​ ఫుడ్​కి దూరంగా ఉండాలి. ఎక్కువగా ఫైబర్​ కంటెంట్​ దొరికే ఫుడ్​కి ప్రాముఖ్యత ఇవ్వాలి.ఆకుకూరలు, చిక్కుడుజాతి కూరలు, యాపిల్స్​, అరటిపండు, నారింజ, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఊదా రంగులోకి మారితే..

చలికాలం వచ్చిందంటే..ఎంతటి ఆరోగ్యవంతుల పెదవులైనా పొడిబారాల్సిందే.  అయితే.. సీజన్​తో సంబంధం లేకుండా పెదవుల చుట్టూ కొందరికి నీలిరంగులో, కొందరికి ఊదా రంగులో వలయాలు వస్తాయి. ఇది శ్వాసకోశ, గుండె సమస్యలను సూచిస్తుంది. శరీరంలో రక్తం సరిగ్గా సరఫరా కాకపోతే కూడా ఇలాంటి సంకేతాలు వస్తాయి. కాబట్టి మీ పెదవులు ఈ రంగులోకి వస్తే వెంటనే డాక్టర్​ని సంప్రదించడం బెటర్​.

లిప్​గ్లాస్​ వద్దు!

 పెదవులు నిండుగా కనిపించాలంటే పెదవుల అంచుల నుంచి లైనర్‌‌ రాయాలి. అలాగే కింది పెదవి మధ్యలో కొద్దిగా లిస్గ్లాస్ అద్దుకుంటే చాలు.. పెదవులు అందంగా కనిపిస్తాయి.

వయసు పెరిగే కొద్దీ పెదవుల సైజులో  మార్పు వస్తుంది. అందుకే ఒక వయసు వచ్చాక మ్యాటీ లేదా గ్లాస్ వేసుకోవద్దు.

లిప్‌‌స్టిక్ వేసుకున్న తర్వాత ఐస్‌‌ముక్కతో పెదవులపై అద్దాలి. ఇలా చేస్తే లిప్‌‌స్టిక్ చెదిరిపోకుండా ఎక్కువ సేపు ఉంటుంది.

చాలామంది ముదురురంగు లిప్​స్టిక్​ వేసుకుంటారు. ఇది.. చూడడానికి అంత బాగుండదు.

పెదవులకు ముందుగా లైనర్‌‌ని వేసుకుని, తర్వాత ఎంచుకున్న ముదురు రంగు లిప్‌‌స్టిక్‌‌ వేసుకోవాలి. అప్పుడే లిప్‌‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది. ఒకవేళ లేతరంగు లిప్‌‌స్టిక్ అయితే న్యూడ్ లైనర్‌‌నే వాడాలి.

లిప్‌‌స్టిక్ వేసుకోవడం పూర్తయిన తరువాత పెదవుల మధ్య మెత్తని టిష్యూ పేపర్‌‌ పెట్టి పెదవులతో అద్దాలి. ఇలా చేయడం వల్ల లిప్‌‌స్టిక్ ఏమైనా ఎక్కువతక్కువలుంటే సరిచేసినట్టు అవుతుంది. ఇలా చేయడం వల్ల పళ్లపై లిప్​స్టిక్​ మరకలు పడవు.

పెదవులకు రెడ్​కలర్​  లిప్‌‌స్టిక్ వేసుకోవాలంటే మేకప్ చాలా సింపుల్​గా ఉండాలి. అప్పుడే పెదవుల  రంగు ఎక్కువగా కనిపించదు.

Latest Updates