బైట తాళం.. లోపల మాయం

లాక్ డౌన్తో వైన్ షాపు ఓనర్ల దందా
వెనుక నుంచి సరుకు మొత్తం ఖాళీ
సగానికి పైగా స్టాకు బెల్ట్ షాపులకు సరఫరా
బార్లలోనూ లిక్కర్ ఖాళీ
3, 4 రెట్లు ఎక్కువ ధరకు అమ్మకాలు

హైదరాబాద్, వెలుగు: వేసిన తాళం వేసినట్టే ఉంటోంది.. కానీ లోపలి మందు బాటిళ్లన్నీ మాయమవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో మందు కోసం జనం అస్కలాడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వైన్స్, బార్ షాపుల యజమానులు ఎవరికంటా పడకుండా మందు బాటిళ్లను బయటకు తీసి మూడు, నాలుగు రెట్లు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. వైన్స్ మూతపడి దాదాపు నెల రోజులు అవుతున్నా ఇంకా బ్లాక్ దందా నడుస్తూనే ఉంది. 90 శాతానికి పైగా వైన్ షాపుల్లో సరుకు మొత్తం ఖాళీ అయినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్నిఅబ్కారీ శాఖ పెద్దగా పట్టించుకోవడం లేదు. ‘జనతా కర్ఫ్యూ ముందు రోజు అన్ని వైన్ షాపుల్లో పూర్తి స్థాయి సరుకుంది. ఇప్పుడు చూస్తే ఆ రోజు ఉన్నంత సరుకు ఏ ఒక్క షాపులోనూ ఉండే పరిస్థితి లేదు’ అని అబ్కారీ శాఖలోని ఓ అధికారి చెప్పారు.

బార్లదీ ఇదే దందా
బార్ల నిర్వాహకులు కూడా ఇదే దందా మొదలు పెట్టారు. ‘వైన్ షాపుల్లో స్టాకు అయిపోతుండడంతో మాకూ కాల్ చేసి అడుగుతున్నరు. అమ్ముకోక ఏం చేయాలి.’ అని ఖైరతాబాద్ లోని ఓ బార్ నిర్వాహకుడు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,500 కోట్లకు పైగా లిక్కర్ విక్రయాలు జరిగితే.. అబ్కారీ శాఖ 601 కేసులనే రికార్డుచేసింది. 5,030 లిక్కర్ బాటిళ్ళను, 4,119 బీరు బాటిళ్లను సీజ్ చేసింది.

లాక్డౌన్ పెంచారు.. ధర పెరిగింది
గత ఏడాది ఏప్రిల్ లో రాష్ట్రంలో రూ.1,885 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచింది. దీని తర్వాత నుంచి ప్రతి నెలా సగటున రూ.2 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2,211 వైన్స్, 1 ,032 బార్లు ఉన్నాయి. అన్ని షాపుల్లో కలిపి రోజూ రూ.70 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. ప్రతి షాపులో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల సరుకు ఉంటుంది. రోజువారీగా అమ్మిన పైసలతో షాపు వాళ్లు మరుసటి రోజు పొద్దున చలానా తీస్తారు. చలానా తీసిన మొత్తానికి సరిపడా లిక్కర్ స్టాకు మధ్యాహ్నంలోపు డెలివరీ అవుతుంది. ఇలా ప్రతి రోజూ జరుగుతుంది. జనతా కర్ఫ్యూకు ముందు రోజు షాపులలో స్టాకు అలాగే ఉండిపోయింది. లాక్డౌన్ మొదలైన రోజు నుంచి ఈ స్టాకును వైన్ షాపు నిర్వహకులు మెల్లగా బయటికి తరలించారు. ఎక్కువ శాతం లిక్కర్ను మొదటే బెల్ట్ షాపులకు తరలించారు. ప్రతి వైన్ షాపు పరిధిలో కనీసం 20కి తక్కువ కాకుండా బెల్ట్ షాపులున్నాయి. ఎక్కువ శాతం స్టాకును డబుల్ రేటుకు సరఫరా చేశారు. మిగిలిన లిక్కర్ ను వైన్ షాపు ఓనర్లు అమ్ముకుంటున్నారు. మొదట్లో ఎంఆర్పీ మీద రెండు రెట్లు ఎక్కువకు అమ్మారు. లాక్డౌన్ పెంచాక 4 రెట్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి సరుకు అయిపోవచ్చింది. దీంతో రేటు మరింత పెంచారు. ‘స్టాకు ఉందని అందరికీ తెలుసు. అందుకే ఫోన్లు చేసి అడుగుతున్నరు’అని ఉప్పల్ లోని ఓ వైన్ షాపు యజమాని చెప్పారు.

మినిమం స్టాకు లేకుండా ఓపెన్ చేసుడెట్ల?
లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం అమ్మకాలకు అనుమతి ఇచ్చినా దాదాపు 90 శాతం స్టాకు లేని కారణంగా అదే రోజు తెరవడం కష్టం. సగం బార్లలోనూ ఇదే పరిస్థితి. లాక్ డౌన్ తర్వాత వైన్ షాపులు తెరవడానికి మూడు రోజుల ముందే డిపోల నుంచి వైన్ షాపులకు లిక్కర్ సరఫరా చేయాలనే డిమాండ్ వస్తోంది.

For More News..

రేషన్ షాపుల్లో మాస్కుల అమ్మకం

చీపురు పట్టి ఇల్లు ఊడ్చి, తుడిచిన యంగ్ టైగర్

ఎన్టీఆర్, రాంచరణ్ లకు సవాల్ విసిరిన రాజమౌళి

గ్రీన్‌ జోన్‌లోకి తెలంగాణలోని ఏడు జిల్లాలు

లాక్డౌన్ పెంచడానికి కారణం అదే..

Latest Updates