మంటల మాటున బతుకు

అక్కడ అకస్మాత్తుగా నీటిలోంచి మంటలు లేచి పచ్చని చెట్లు మండిపోతాయి. వరద కాలువల్లో అనూహ్యంగా అగ్గి అంటుకుంటుంది. చెత్తలో విస్పోటనం జరిగి మనుషులు చనిపోతారు. చెత్తలోఒక్కసారిగా మంటలు లేచి దట్టమైన పొగలు అలుముకుంటాయి. సినిమా షూటింగ్ ను తలపించే సన్నివేశాలు నిజ జీవితంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఆసియాలో నే అతిపెద్ద పారిశ్రామికవాడగా గుర్తింపు పొందిన జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిసరాల్లో పరిస్థితి ఇదీ. ఇక్కడి వారి జీవనం దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు గా మారింది.

జీడిమెట్ల పారిశ్రామికవాడలో సుమారు వందకుపైగా భారీ ఫార్మా, రసాయన పరిశ్రమలు, చిన్న,చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులోని కొన్నిఫ్యాక్టరీల యాజమాన్యం చేస్తున్న పొరపాట్లు స్థానికులకు ప్రాణ సంకటంలా మారుతున్నాయి. కాలుష్యంతో ప్రజల జీవనవిధానాన్ని దెబ్బకొట్టడం పక్కన పెడితే వ్యర్థాల పారబోత మరింత భయంకర సమస్యగా తయారైంది. వారం క్రితం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థ రసాయన ఘన పదార్థాలు నిండిన డ్రమ్ములను తెచ్చి మంటపెట్టారు. దీంతో భారీగా మంటలు, పొగ చెలరేగి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.మంటలు ఆర్పడం ఆలస్యమైతే పెను ప్రమాదమే జరిగేది. పక్కనే ఉన్న పరిశ్రమలకు మంటలు వ్యాపిస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఒక పద్ధతి ప్రకారం ట్రీట్ మెంట్ కేంద్రాలకు పంపాల్సిన ప్రమాదకర వ్యర్థాలు బయటకు ఎలా వస్తున్నాయనేది అంతుచిక్కని ప్రశ్న.

ఫార్మా,రసాయనాలపై పొల్యూషన్‍ కంట్రోల్‍ బోర్డు (పీసీబీ) నిఘా కొరవడడమే ఈ దుస్థితికి కారణంగా కన్పిస్తోంది. గత వారమేకాదు.. పారి శ్రామికవాడతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతునే ఉన్నాయి. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకోవడం పీసీబీ అధికారులకు అలవాటుగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పరిశ్రమ లోంచి ఎలాంటి వ్యర్థా లు బయటకు పంపకుండా చూడాలని వారు డిమాండ్‍ చేస్తున్నారు. కానీ, ఇలా తప్పని సరిగా శుద్ధికేంద్రాలకు పంపాల్సి ఉన్నా.. ఖర్చును తప్పిం చుకునేం దుకు యాజమాన్యాలు వ్యర్థాలను సమీపంలోని అడవుల్లో, ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు. రోడ్డుమార్గం గుండా వెళ్తూ రసాయన వ్యర్థాలను డంప్ చేస్తున్నారు.వీరు పారబోసిన వ్యర్థా లు ‘ల్యాండ్‍మైన్లు’ గా మారుతున్నాయి. చెత్త ఏరుకునే వారు వీటిలో ఏమైనా తమకు ఉపయోగపడే వస్తువులు దొరుకుతాయనే ఆశతో వెళ్లి చనిపోతున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు….

..జీడిమెట్ల పారిశ్రామికవాడలో చెత్తను ఏరుకునే వ్యక్తి వ్యర్థాల్లో ఉన్న ఓ డబ్బాను తెరవబోయి అది పేలి చనిపోయాడు .

..సుభాష్ నగర్ లో రసాయన డ్రమ్ము కత్తిరిస్తుండగా అదిపేలిపోయి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

..పైపులైను రోడ్డులోని ఓ నాలాలో రసాయనాలు పారబోయడంతో రసాయన చర్య జరిగి ఒక్కసారిగా నీటిలో మంటలు లేచి  పచ్చని చెట్లు కాలిపోయాయి.

..దూలపల్లి రోడ్డులో చెత్తలో రసాయన చర్యజరిగి మంటలు ఎగిశాయి. స్థానికులు వీటినిఆర్పేశారు.

..సుభాష్ నగర్ లోని వ్యర్థాల్లో సంచరిస్తున్న పంది ఓ వస్తువును కొరికి అక్కడికక్కడే చనిపోయింది.

..జీడిమెట్ల ఫేజ్ 1లో వరదనీటి కాలువల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి   మంటలార్పివేశారు.

..ఈనెల 3న జీడిమెట్ల ఫేజ్-1లో వ్యర్థ రసాయన ఘన పదార్థాలు ఉన్న డ్రమ్ములకు నిప్పుపెట్టారు. దీంతో దట్టమైన పొగలు, మంటలు వెలువడి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.

Latest Updates