బంగారంపై ఎక్కువ అప్పు 90 శాతం దాకా లోన్

ఇక నుంచి బంగారంపై ఎక్కువ లోన్‌‌: ఆర్బీఐ ప్రకటన

న్యూఢిల్లీ: గోల్డ్‌‌లోన్ తీసుకోవాలనుకునే వారికి గుడ్‌‌న్యూస్. ఇక నుంచి బంగారం విలువలో 90 శాతం మొత్తాన్ని లోన్‌ గా పొందవచ్చు. ఉదాహరణకు పది గ్రాముల గోల్డ్ రేటు రూ.50 వేలు అనుకుంటే, రూ.45 వేల వరకు లోన్ తీసుకోవచ్చు. మరింత ఈజీగా గోల్డ్‌‌లోన్స్‌‌ ఇచ్చేలా ఆర్‌‌బీఐ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లకు ఆదేశాలు ఇచ్చింది. గతంలోని రూల్స్ ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరకు వరకు లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని 90 శాతానికి పెంచారు. అయితే వచ్చే ఏడాది మార్చి వరకే ఈ సదుపాయం ఉంటుంది. ‘‘కరోనా, లాక్డౌన్ల వల్ల చాలా మంది వ్యాపారవేత్తలకు డబ్బు పుట్టడం కష్టంగా మారింది. అందుకే గోల్డ్‌‌లోన్ రూల్సు‌ను మరింత ఈజీ చేశాం. లోన్ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచాం ”అని ఆర్‌‌బీఐ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

లాక్డౌన్ వల్ల చాలా మంది ఆదాయాలు పడిపోవడంతో గోల్డ్‌‌ లోన్స్‌‌కు డిమాండ్ ఎక్కువయింది. అన్‌ సెక్యూర్డ్ లోన్ల కంటే గోల్డ్‌‌లోన్లు సేఫ్‌ కాబట్టి బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నాయి. చాలా మంది జాబ్స్‌‌కు దూరం కావడంతో సాధారణ లోన్ల కిస్తీ లు కట్టే వారి సంఖ్య తగ్గవచ్చని భావిస్తున్నాయి. ప్రస్తుత సమస్యల నుంచి గట్టెక్కడానికి చాలా మంది గోల్డ్‌‌లోన్స్‌‌ను ఎంచుకుంటున్నారని గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ చెప్పారు. బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకునే వారిలో ఎక్కువ మంది రూ.40 వేల వరకు తీసుకుంటున్నారని వివరించారు.

Latest Updates