కృష్ణుడి వెన్నముద్దరాయికి మస్త్ గిరాకీ!

మనోళ్లకు రూ. 40..
ఫారినర్లకు రూ. 600 ఫీజు
మహాబలిపురంలో మోడీ,
జిన్ పింగ్ భేటీ తర్వాత
పెరిగిన టూరిస్టులు    

చెన్నై:  తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం మహాబలిపురంలో ఉన్న వెన్నముద్ద రాయికి క్రేజ్ పెరిగింది. దీంతో శనివారం నుంచి ఈ రాయిని చూసేందుకు వచ్చే స్వదేశీ టూరిస్టుల నుంచి రూ. 40 చొప్పున, విదేశీ టూరిస్టుల నుంచి రూ.600 చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్‌‌ల ఇన్ ఫార్మల్ మీటింగ్ మహాబలిపురంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీరివురు మహాబలిపురంలోని సముద్ర ఆలయం, పంచ రథాలు, వెన్నముద్దరాయి, అర్జున తపస్సు తదితర ప్రాంతాల్లో తిరిగారు. వీరి పర్యటన సందర్భంగా టూరిస్టులకు నిషేధం విధించారు.

ప్రస్తుతం మహాబలిపురం దేశ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో, వెన్నముద్దరాయిని చూసేందుకు రుసుము వసూలు చేస్తున్నట్లు పురావస్తు శాఖ అధికారి వెల్లడించారు. ఇందుకోసం అక్కడ  ప్రత్యేక కౌంటర్‌‌ తెరిచామన్నారు. ఇప్పటికే సముద్ర ఆలయం, పంచ రథాలు, ఇతర ప్రాంతాల సందర్శనకు రుసుమును పెట్టామన్నారు. మోడీ, జిన్ పింగ్ రాక సందర్భంగా వెన్నముద్దరాయి చుట్టుపక్కల కొరియన్‌‌ గడ్డి, అరుదైన పూల రకాలతో ముస్తాబు చేసి, వాటి సంరక్షణకు సిబ్బందిని నియమించామని తెలిపారు.

వెన్నముద్ద వెనక కథ ఇదీ..

ద్వాపరయుగంలో చిన్ని కృష్ణుడు అమ్మ యశోద దాచిన మజ్జిగ కుండలో నుంచి వెన్నముద్దను దొంగిలించి తెచ్చాడట. ఆ వెన్నముద్దే ఇక్కడ పడిపోయి రాయి రూపంలోకి  మారిపోయిందని చెబుతారు. ఈ రాయి 6 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు ఉంది. 250 టన్నులకు పైగా ఉంటుంది.

Latest Updates