వ‌ల‌స కార్మికులు, విద్యార్థుల‌కు రిలీఫ్: సొంత రాష్ట్రాల‌కు తీసుకెళ్లేందుకు కేంద్రం అనుమ‌తి

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ ఎక్క‌డిక‌క్క‌డ చిక్కుకుపోయి ఇబ్బందులు ప‌డుతున్న వ‌ల‌స కార్మికుల క‌ష్టాలు తీర‌బోతున్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లో కూలీనాలీ చేసుకుని బ‌త‌క‌డానికి వెళ్లిన ఉన్న‌ట్టుండి లాక్ డౌన్ పెట్ట‌డంతో నిలిచిపోయిన వారిని సొంత రాష్ట్రాల‌కు తీసుకెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వారితో పాటు కోచింగ్ సెంట‌ర్లు, హాస్ట‌ళ్ల‌లో ఉండిపోయిన విద్యార్థులు, ఆధ్యాత్మిక‌, విహార యాత్ర‌ల‌కు వెళ్లి తిరిగి రాలేక‌పోయిన వారిని కూడా సొంత ప్రాంతాల‌కు చేర్చేందుకు అనుమ‌తిచ్చింది. వారిని స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌కు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు బుధ‌వారం కేంద్ర హోం శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.

– అన్ని రాష్ట్రాలు త‌మ ద‌గ్గ‌ర ఉన్న వ‌ల‌స కార్మికుల‌ను పంపడం, ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న వారిని తీసుకుని వ‌చ్చేందుకు నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మించాల‌ని కేంద్రం సూచించింది. నిలిచిపోయిన కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు ఎంత మంది ఉన్నార‌నేది గుర్తించి, ప్ర‌యాణానికి వారు రిజ‌స్ట‌ర్ చేసుకునే వీలు క‌ల్పించే డ్యూటీ నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌దే. అలాగే వారంద‌రినీ ఎలా త‌ర‌లించాల‌న్న ప్ర‌ణాళిక‌ల‌నూ ఈ అధికారులు సిద్ధం చేయాలి.

– సొంత ప్రాంతాల‌కు వెళ్లేందుకు భారీ సంఖ్య‌లో రిజిస్ట‌ర్ చేసుకుంటే ఆయా రాష్ట్రాలు ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకుని రోడ్డు మార్గంలో త‌ర‌లించే ఏర్పాట్లు చేసుకోవాలి. అలా బ‌య‌లుదేరిన వారిని మ‌ధ్య‌లో ఏ రాష్ట్రాలు ఆప‌కుండా ముందుగానే చ‌ర్య‌లు తీసుకోవాలి.

– వారంద‌రికీ స్క్రీనింగ్ చేసి, ఎటువంటి ల‌క్ష‌ణాలు లేని వారిని మాత్ర‌మే త‌ర‌లించాలి.

– ఎక్కువ మంది ఉంటే బ‌స్సుల్లో సొంత రాష్ట్రాల‌కు తీసుకెళ్లాలి. ఆ బ‌స్సుల‌ను డిసిన్ఫెక్ట్స్ తో శుభ్రం చేసి, సీటింగ్ లోనూ సోష‌ల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలి.

– సొంత ప్రాంతాల‌కు చేరిన త‌ర్వాత స్థానిక వైద్యులు వారిని చెక‌ప్ చేసి.. హోం క్వారంటైన్ లో ఉంచాలి. కొన్ని రోజుల పాటు వారి ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించాలి. అలాగే ప్ర‌తి ఒక్క‌రితో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేయించి.. ట్రాక్ చేసేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలి.

Latest Updates