ఏప్రిల్ 15 వ‌ర‌కు రాష్ట్రంలో లాక్ డౌన్ : కేసీఆర్

రాష్ట్రంలో లాక్ డౌన్ కొన‌సాగుతున్నా కరోనా కేసులు పెర‌గ‌డం కరోనా తీవ్ర‌త సూచిస్తోందన్నారు సీఎం కేసీఆర్. కరోనా విజృంభణపై ప్రగతి భవన్ లో జ‌రిగిన‌ మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. క‌రోనా ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం అంతటా అంత‌టా ఏప్రిల్ 15వ తేదీ వరకు లాక్ డౌన్ కొన‌సాగిస్తామ‌న్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 58 మంది కరోనా బాధితులున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. మరో 20 వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో కానీ, హోం క్యారంటైన్ లో కానీ ఉన్నారన్నారు. వీరి కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా నిరోధక చర్యల్లో ప్రజల సహకారాన్ని ప్రశంసించారు. ప్రజలు సహకరించకుంటే కరోనా విస్ఫోటనం చెందేదని, జరిగే నష్టాన్ని ఊహించలేమని అభిప్రాయపడ్డారు. అయితే… లాక్ డౌన్ విధించినా, రాత్రివేళల్లో కర్ఫ్యూ పొడిగించినా ఇవాళ ఒక్కరోజే 10 కేసులు రావడం ఆందోళనకరమని, ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరింత క్రమశిక్షణ పాటించాలని కోరారు. ఇది ఎంత భయంకరమైన వ్యాధో, అర్థం చేసుకుంటే అంత సింపుల్ వ్యాధి అని చెప్పారు. దీనికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదని… ఉన్న మందు ఏదంటే దీని వ్యాప్తిని నిరోధించడమేనన్నారు. కరోనాపై సరైన నివారణ చర్యలు తీసుకోని ఫలితంగా అన్ని వసతులు ఉన్న అమెరికా దేశం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోందని తెలిపారు. మనదేశంలో సామాజిక దూరం పాటించడమే కరోనా నివారణకు ఏకైక మార్గమని చెప్పారు. చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తరహాలో కరోనా భారతదేశంలో ప్రబలితే 20 కోట్లమందికి సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దాంట్లో మనం కూడా ఉండొచ్చని హెచ్చరించారు. దీనికి ప్రధానమంత్రులు, మంత్రులు, అధికారులు ఎవరూ అతీతులు కారని, ఈ విపత్తు సమయంలో స్వీయరక్షణే శ్రీరామరక్ష అని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. అయితే, కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోడీతో కూడా మాట్లాడానని, ఆయన కూడా అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారన్నారు.

Latest Updates