12 వేల చిన్న ఇండస్ట్రీలకు తాళాలు

అందని సబ్సిడీలు.. పట్టించుకోని రాష్ట్ర సర్కారు
రూ. 2 వేల కోట్లకు పైగా రాయితీల సొమ్ము బాకీ
ఫలితమివ్వని ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్
ఆదుకోవడానికి ముం దుకు రాని బ్యాంకులు
రీషెడ్యూల్ పై ఆర్బీఐ ఆదేశాలు బేఖాతరు
మూడున్నర లక్షల మంది కార్మికులు రోడ్డు పాలు

రాష్ట్రంలో గడిచిన ఐదేండ్లలో ఇదీ పరిస్థితి

పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అవి ఆశించిన ఫలితాలివ్వడం లేదు. పెద్ద పరిశ్రమల పరిస్థితిని పక్కనబెడితే ఎక్కువగా ఉపాధి కల్పించే చిన్న ఇండస్ట్రీలు​ మాత్రం మూతపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది, అంతకు ముందు కరెంట్​ సమస్యతో చిన్న పరిశ్రమలు బందయ్యాయి. నాలుగేండ్లుగా నిరంతర విద్యుత్, రాయితీలతో తాము ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నా మూతపడుతున్న చిన్న పరిశ్రమల లిస్ట్  పెరుగుతూనే ఉంది. ఇటు రాష్ట్ర సర్కారు నుంచి రాయితీల సొమ్ము అందక.. అటు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టక పారిశ్రామికవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. గడిచిన ఐదేండ్లలో సుమారు 12 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్​ఎంఈలు) మూతపడ్డాయి. ఫలితంగా మూడున్నర లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

హైదరాబాద్, వెలుగుతెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌‌ ఐపాస్‌‌ పేరుతో కొత్త ఇండస్ట్రియల్​ పాలసీని ప్రకటించింది. దానితో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని చెప్పింది. ఈ కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత పెద్ద కంపెనీలు అనుకున్నంతగా వచ్చినప్పటికీ. ఎంఎస్​ఎంఈ సెక్టార్​లో మాత్రం కొత్తవి రాకపోగా ఉన్న కంపెనీలు కూడా మూతపడ్డాయి. చిన్న పరిశ్రమలకు అనుమతులు, మౌలిక వసతులు సకాలంలో అందక, ప్రభుత్వం  నుంచి రాయితీలు రాక ఆ వైపు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం లేదు. వివిధ సబ్సిడీల రూపంలో ఇండస్ట్రీస్​కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 2వేల కోట్ల బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో దాదాపు 70 వేల కంపెనీలున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.

అయితే ఇందులో గత ఐదేండ్లలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 3 వేలకు పైగా కంపెనీలు వివిధ కారణాలతో మూతపడ్డాయి. మిగతా జిల్లాల్లో 9 వేలకు పైగా ఎంఎస్​ఎంఈలు బందయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2017–18 ఏడాదిలో సుమారు  మూడు వేల చిన్న పరిశ్రమలు మూతపడగా.. 2018–19 ఏడాదిలో సుమారు మూడున్నర వేల పరిశ్రమలు క్లోజ్​ అయ్యాయి. ఇలా ఏటేటా మూతపడుతున్న పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. కొత్త ఇండస్ట్రియల్​ పాలసీని ప్రకటించిన టైంలో వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుపై గొప్పగా చెప్పుకొంటున్న సర్కార్..​ ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడంలో మాత్రం ఆసక్తి చూపడంలేదన్న విమర్శలు వస్తున్నాయి.

అందని రాయితీలు

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో విరివిగా ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతోపాటు రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగానికి అనేక రాయితీలు ప్రకటించింది. ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్, స్థానికంగా పరిశ్రమలు స్థాపించడం వంటి అంశాల ప్రాతిపదికన సబ్సిడీలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసే టైంలో స్టాంప్‌‌ డ్యూటీ రిఫండ్‌‌, పెట్టుబడి మొత్తంలో ఆయా పరిశ్రమలను బట్టి 20 నుంచి 25 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పింది. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధారణంగా లభించే రాయితీతోపాటు అదనంగా 10 శాతం రాయితీ ఇస్తామంది. ఎస్సీలు, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమ స్థాయినిబట్టి మరింత అదనంగా రాయితీ ఉంటుందని తెలిపింది. ఇవే కాకుండా పావలా వడ్డీ లోన్లు, కరెంట్​ వాడకంలో రాయితీ, పట్టణ, జిల్లా స్థాయిలో పరిశ్రమలవారీగా, ప్రాంతాలవారీగా ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. అయితే రెండేండ్లుగా రాయితీల సొమ్ము విడుదల కావడం లేదు.

పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీల సొమ్ము రూ. 2 వేల కోట్ల దాకా పేరుకుపోయింది. మరోవైపు ఆర్‌‌ అండ్‌‌ బీ, పంచాయతీరాజ్, డిఫెన్స్,  ఏరో నాటికల్‌‌ తదితర విభాగాల నుంచి పరిశ్రమలకు పెద్దమొత్తంలో బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించడంలో చాలా జాప్యం చేస్తున్నారని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాలు కూడా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆయా యూనిట్లు మూసివేతకు కారణమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, యూనిట్ల నిర్వహణ లోపం, మూలధన పెట్టుబడి వ్యయాన్ని క్రాప్‌‌లోన్​ చెల్లింపునకు మళ్లించడం, ఉత్పత్తులకు డిమాండ్‌‌ లేకపోవడం, మార్కెటింగ్‌‌ లోపం, ముడిసరుకు కొరత వంటి కారణాలు కూడా పరిశ్రమల మూసివేతకు కారణమవుతున్నట్లు ఓ స్టడీలో తేలినట్లు పారిశ్రామికవర్గాలు తెలిపాయి.

పరిశ్రమల శాఖ నిర్లక్ష్యం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దు,  జీఎస్టీ అమలుతోపాటు లెవీ సేకరణపై ఆంక్షలు, మార్కెటింగ్‌‌ సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం, అందాల్సిన రాయితీలు అందకపోవడంతో రాష్ట్రంలో చాలా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దివాలా అంచున ఉన్నాయి. స్థానిక వనరుల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ సరైన సమాచారం ఇవ్వకపోవడం కారణంగా జిల్లాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు.దీంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.
మరో పక్క ఉన్న కంపెనీలు కూడా మనుగడ కష్టం కావడంతో  కార్మికుల సంఖ్యను  తగ్గించుకుంటున్నాయి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికులను తయారుచేయడంలో సరైన ప్రయత్నాలు ప్రభుత్వం తరఫున లేవని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు. ఐదేండ్ల కాలంలో 12వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో సుమారు మూడున్నర లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.

ఆర్బీఐ గైడ్​లైన్స్​ను పాటించని బ్యాంకులు

లోన్ల రీ స్ట్రక్చరింగ్ పై రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన గైడ్​లైన్స్​ను బ్యాంకులు పట్టించుకోవడం లేదు. వాటిని పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఖాతరు చేయడం లేదు. కంపెనీల పనితీరు బాగలేకుంటే బ్యాంకులు దశలవారీ ప్రక్రియను అమలు చేయకుండానే పరిశ్రమలను డీఫాల్టర్‌‌గా ప్రకటించి నాన్​ పెర్ఫార్మింగ్​ అసెట్స్​(ఎన్​పీఏ) జాబితాలో చేరుస్తున్నాయి. దీంతో నిధులు సమకూర్చుకోలేక కంపెనీలు ఖాయిలా పడిన పరిశ్రమలుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి కంపెనీల ఆస్తులను బ్యాంకులు జప్తు చేసి అమ్మకానికి పెడుతున్నాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామని, చేయూతనిస్తే నష్టాల నుంచి బయటపడతామని బ్యాంకుల చుట్టూ రెండేండ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై, ముప్ఫై ఏండ్లుగా పరిశ్రమలను నడుపుతున్న కంపెనీలకు రూ. కోట్ల విలువైన ఆస్తులు సెక్యూరిటీగా ఉన్నా కొత్త రుణం ఇవ్వడానికి బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు.

ఆ గైడ్​లైన్స్​ ఏం చెప్తున్నాయంటే..

ఆర్బీఐ  గైడ్​లైన్స్​  ప్రకారం ఒక పరిశ్రమ మూడు నెలలపాటు అసలు, వడ్డీ చెల్లించలేకపోతే  రుణం మంజూరు చేసిన బ్యాంకు మొదట ఆ పరిశ్రమకు ఆర్థికంగా సాయం చేయాలి. కనీసం నెలపాటు దీనిని అమలు చేయాలి. ఆ తర్వాత కంపెనీ నిర్వహణ లోపాల ను కరెక్ట్ చేసే విధంగా కనీసం రెండు నెలలపాటు యాక్షన్​ ప్లాన్​ అమలు చేయాలి. ఆ తర్వాతనే రీ స్ట్రక్చరింగ్​ ప్రక్రియ అమలు చేయాలి.బకాయిలను మూడు నుంచి ఐదేండ్లలో చెల్లించే అవకాశం ఇవ్వాలి. మూతపడ్డ పరిశ్రమను మళ్లీ తెరవడానికి కొత్త యాజమాన్యాలు, డైరెక్టర్ల నియామకం, క్యాపిటల్​ పెంపునకు చర్యలు తీసుకోవాలి. వీటి తర్వాత స్వతంత్ర సంస్థ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పరిశ్రమకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేవీ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. మూడు నెలలుగా బకాయిల చెల్లించకపోతే కంపెనీలు డిఫాల్టర్ గా ప్రకటించేస్తున్నాయి. ఒక పరిశ్రమను మళ్లీ ప్రారంభించిన తర్వాత ఏడాది వరకూ ఆ పరిశ్రమను ఎన్​పీఏ జాబితా నుంచి తొలగించే అవకాశం లేకపోవడంతో బ్యాంకులు దీని పట్ల ఆసక్తి చూపడం లేదని ఓ పెద్ద బ్యాంకు ఆఫీసరే చెప్పారు.

రుణాలు రీస్ట్రక్చరింగ్‌‌ చేయాలి

బందైన పరిశ్రమలను మళ్లీ ఓపెన్​ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకులు సహకరించాలి. బ్యాంకులు రుణాల రీస్ట్రక్చరింగ్‌‌, రీ షెడ్యూల్‌‌ చేయాల్సి అవసరం ఉంది. గతంలో విజయవంతంగా పనిచేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటిని బ్యాంకులు ఆదుకోకుంటే, అవి కూడా ఖాయిలా జాబితాలో చేరే ప్రమాదం ఉంది. – తెలంగాణ చాంబర్‌‌ ఆఫ్‌‌ కామర్స్‌‌ అండ్‌‌ ఇండస్ట్రీ

రాయితీలు రాకపోవడం, ట్యాక్స్లే కారణం

నాచారంలో చాలా చిన్న తరహా పరిశ్రమల మూతపడటానికి ప్రభుత్వ రాయితీలు నిలిచి పోవడం, ట్యాక్స్​లే కారణం. గతంలో జీఎస్టీ వంటి ట్యాక్సులు లేవు.  టాక్సులు పెంచడంతో మెటీరియల్ రేట్లు కూడా పెరిగాయి. పెద్ద పరిశ్రమలవాళ్లు బల్కులో కొంటున్నందున వారికి కొంత జీఎస్టీ వంటి టాక్సులు తక్కువగా పడుతున్నాయి. అయితే చిన్న పరిశ్రమలు అంతపెద్ద మొత్తంలో ఒకే సారి కొనలేకపో వడం, మెటీరియల్ ఖర్చులు అధికంగా పెరగడం వల్ల వాటి నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం నుంచి రాయితీలు రావడం లేదు. ఉత్పత్తి  జరిగినా సేల్స్​ లేవు. దీంతో తయారు చేసిన  వస్తువులు అట్లనే ఉంటున్నాయి. కార్మికులకు కూడా ఉపాధి లేకుండాపోతోంది. – నారాయణ, ఆర్కే కెమికల్స్ అధినేత, నాచారం

Latest Updates