మిడతల దండు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి: CM KCR

మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు చెప్పారు.

మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స‌మీక్ష‌లో సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో గల మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని, అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారని చెప్పారు సీఎం. అయినా మిగిలిన కొన్ని మిడతలు మధ్యప్రదేశ్ మీదుగా పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయన్నారు. గాలి మరలి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణవైపు కూడా రావచ్చని, అందుకే మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి సంహరించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

స‌మీక్ష‌లో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, ఎస్.నర్సింగ్ రావు, జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates