ఎగ్జిట్ పోల్స్‌‌కు ముందే పరుగు

lok-sabha-elections-2019-stock-markets-reacted-to-exit-polls

ఆదివారం ఎగ్జిట్ పోల్స్‌‌ అంచనాలు ఇప్పుడే స్టాక్ మార్కెట్‌‌ను పరుగులు పెట్టించాయి. మరో రెండు రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతుండటంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా పెరిగింది. ప్రైవేట్ బ్యాంక్‌‌లు, ఫైనాన్సియల్, ఆటో, రియాల్టీ స్టాక్స్‌‌లో  కొనుగోళ్ల జోరు మార్కెట్‌‌కు సహకరించింది. బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌‌ ఏకంగా 537 పాయింట్ల ర్యాలీ జరిపింది. చివరికి 37,930.77 వద్ద క్లోజైంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు పెరిగి 11,400 మార్క్‌‌పైన 11,407.15 వద్ద సెటిలైంది. ఏడో దశ పోలింగ్ మే 19న జరగబోతోంది. అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌‌పై ఇండియన్ ఓటర్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్రేడర్లు తమ పొజిషన్లను అడ్జస్ట్ చేసుకున్నారని జెమ్‌‌స్టోన్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ అడ్వయిజరీ సర్వీసెస్‌‌ కన్సల్టెంట్ టెక్నికల్ ఎనలిస్ట్ ఎం. వైష్ణవ్ అన్నారు.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్​, ఎఫ్‌‌ఎంసీజీ స్టాక్స్‌‌లో కొనుగోళ్ల జోరు కూడా మార్కెట్‌‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ ట్విన్సే   సెన్సెక్స్‌‌కు 140 పాయింట్ల లాభం అందించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహింద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ 120 పాయింట్లు, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలివర్ 85 పాయింట్ల సహకారం అందించాయి. నిఫ్టీకి చెందిన నాలుగు కంపెనీలు శుక్రవారం తమ మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి. వాటిలో మూడు కంపెనీలు మంచి లాభాలను ఆర్జించాయి. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు మంచి  ఫలితాలను ప్రకటించడంతో ఈ రెండు కంపెనీల షేర్లు 6.09 శాతం లాభపడ్డాయి. అటు డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు తగ్గి 70.20 వద్ద ముగిసింది.

Latest Updates