రాజ్యసభ ముందుకు ఇవాళ త్రిపుల్ తలాక్ బిల్లు

పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఆమోదం పొందిన వివాదాస్పద త్రిపుల్ తలాక్ బిల్లును ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఇక ఫైనాన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బడ్జెట్ పై మాట్టాడిన TRS ఎంపీలు.. మోడీ సర్కార్ తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. నీతి ఆయోగ్ సూచించినా పథకాలకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.

పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనుండటంతో కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన త్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలోప్రవేశపెట్టనున్నారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. రాజకీయ  ప్రయోజనాల కోసం జాతీయ దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తున్న టీఎంసీ ఎంపీలు.. దీనిపై చర్చకు సభలో నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.

ఫైనాన్స్ బిల్లుకు ఆమోదం తెలిపింది లోక్ సభ. బడ్జెట్ పద్దులపై మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్.. తెలంగాణపై బీజేపీ సర్కార్ పై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ నినాదం ప్రచారానికి పరమితం అయిందని, తెలంగాణకు కేంద్రం ఖాళీ చేతులు చూపిస్తోందని విమర్శించారు. నీతిఆయోగ్ సూచించినా మిషన్ భగీరథ, కాకతీయకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు బూర.

రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని  జీరో అవర్ లో టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా గుర్తించాల్సిన అవసరముందని వినోద్ డిమాండ్ చేశారు.

ఇటీవల శివైక్యం పొందిన కర్ణాటక రాష్ట్రంలోని సిద్ధగంగ పీఠాధిపతి శివకుమారస్వామికి భారతరత్న  ఇవ్వాలని ఎంపీ బీబీ పాటిల్ డిమాండ్ చేశారు. శివకుమారస్వామి గొప్పమానవతావాది, ఆధ్యాత్మిక గురువని ఆయన లోక సభలో చెప్పారు.

మరోవైపు 16వ లోక్ సభ గడువు ముగియనుండటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ రాత్రి విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై , విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా  పలువురు కేంద్రమంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు విందుకు హాజరయ్యారు.

Latest Updates