లోక్ సత్తా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ కన్నుమూత

లోక్ సత్తా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ కన్నుమూత

కరీంనగర్ జిల్లా : అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత, లోక్ సత్తా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ కన్నుమూశారు. కరోనాతో బాధపడ్తున్న ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. నరెడ్ల శ్రీనివాస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాస్పిటల్ కు వెళ్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

లోక్ సత్తా శ్రీనివాస్ గా కరీంనగర్ జిల్లాలో సుపరిచితులయ్యారు నరెడ్ల శ్రీనివాస్. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే ఆయనకు పేదల పక్షపాతిగా పేరుంది. దాదాపు 70 ఏళ్ల వయస్సులోనూ ఎంతో యాక్టివ్ గా సమాజాన్ని అధ్యయనం చేస్తుండేవారు. ప్రభుత్వ పాలసీలు, ప్రజా సమస్యలపై చర్చాగోష్టులు నిర్వహించేవారు

బ్యాంకు లో క్లర్క్ గా కేరీర్ ప్రారంభించిన శ్రీనివాస్.. మేనేజర్ గా రిటైరయ్యారు. రిటైర్మెంట్ కు ముందే జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తాలో శ్రీనివాస్ భాగస్వాములయ్యారు. ఎన్నో సామాజిక అంశాలపై పోరాటాలు చేశారు. వినియోగదారులకు జరిగే మోసాలపై పోరాటాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అక్రమాలను, అన్యాయాలను సమాచార హక్కు చట్టం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచారు. మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితుల తరపున చివరి వరకు పోరాటం సాగించారు. బొమ్మకల్ భూ అక్రమణల వ్యవహారాన్ని బయటకు తీశారు. ఫేక్ డాక్టరేట్ పట్టాల బాగోతాన్ని బయటపెట్టారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా, సంస్థ అధ్యక్షునిగా పలు దఫాలు పనిచేసిన శ్రీనివాస్.. సొసైటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.