నేడు మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ ప్రచారం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. వరుస టూర్లతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. సాయంత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో జరిగే….ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు. సీఎం సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా నేతలు. భారీగా జనం తరలించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకోవాలని చూస్తోంది టీఆర్ఎస్. మహబూబ్ నగర్ లో ప్రస్తుత సిట్టింగ్ MP జితేందర్ రెడ్డికి బదులు.. ఫార్మ పరిశ్రమకు చెందిన మన్నె శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించారు కేసీఆర్. బీజేపీ తరుపున డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్ సభకు హాజరయ్యారు ప్రధాని మోడీ. కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. దీంతో ఇవాళ్టీ కేసీఆర్ టూర్ కు ప్రధాన్యత సంతరించుకుంది.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు టీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి పి. రాములు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ముందుగా సాయంత్రం 4 గంటలకు నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి సభకు హాజరవుతారు. ఆ తర్వాత ఐదున్నరకు మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అమిస్తాపూర్ సభలో పాల్గొంటారు. జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Latest Updates