సుప్రీంకోర్టు చరిత్రలో లాంగెస్ట్ కేసులు

కోర్టులో కేసులంటేనే సంవత్సరాలపాటు విచారణ జరుగుతుంది. ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు కేసులు బదిలీ అవుతుంటాయి. అలా భారత న్యాయవ్యవస్థలో కొన్ని కేసులు నెలలతరబడి విచారణ సాగాయి. అవి చిన్నా చితకా కేసులు కాదు. అసలు రాజ్యాంగానికి, దాని మౌలిక లక్షణాలకు, రాజ్యాంగ వివాదాలకు కేరాఫ్‌‌గా నిలిచిన కేశవానంద భారతి కేసు,  దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూసిన అయోధ్య కేసు, అసలు గోప్యత అనేది ప్రాథమిక హక్కా కాదా ఆధార్ సంగతేంటి వంటి ప్రశ్నలతో కోర్టుకెక్కిన ఆధార్ కేసు.  ఇందులో లాంగెస్ట్ కేసుగా కేశవానంద భారతి కేసు నిలిచింది. అసలు ఈ కేసులేంటి? వాటి తీర్పులేంటి? వాటిని విచారించిన న్యాయమూర్తులెవరు? ధర్మాసనాలేవి వంటి అంశాలు ఈవారం కరెంట్​ టాపిక్​లో..

ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల న్యాయవ్యవస్థలో ఉన్న మంచి లక్షణాలను స్వీకరించి భారత న్యాయవ్యవస్థను తీసుకొచ్చారు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్న 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ సుప్రీంకోర్టు నిర్మాణం, అధికారాలు – విధుల గురించి చెబుతాయి.

కేశవానంద భారతి కేసు

భారత సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యధిక కాలం (68 రోజుల)పాటు విచారించిన కేసు కేశవానంద భారతి కేసు. 1950లో సుప్రీంకోర్టు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కువ రోజులు సాగిన కేసుగా ఇది ఫస్ట్ ప్లేస్‌‌లో నిలిచింది. కానీ ఈ కేసు గురించి తెలుసుకునే ముందు మరో మూడు కేసుల గురించి చదువుకోవాలి. అవి 1952 నాటి శంకరీ ప్రసాద్ కేసు, 1965 నాటి సజ్జన్‌‌సింగ్ కేసు, 1967 నాటి గోలక్‌‌నాథ్​ కేసు. ప్రధానంగా ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య విభేదాల కారణంగానే ఈ కేసు నమోదు చేశారు. ఉదాహరణకు ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కు ఉండేది.

దేశంలో జమీందారుల దగ్గర వేల ఎకరాల భూములు ఉండేవి. వీటిని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జమీందారుల భూములను ప్రజలకు పంపిణీ చేయడం కోసం చట్టాలు చేశాయి.  జమీందారులందరూ మాకు ఆస్తిహక్కు ఉన్నది కావున మా భూములను ప్రభుత్వం తీసుకుని  పంపిణీ చేయడానికి వీలులేదంటూ కోర్టులకు వెళ్లారు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం మొదటి రాజ్యాంగసవరణ చేసి ఆర్టికల్ 31ఏను పొందుపర్చింది. ఈ సవరణ ఆధారంగానే 9వ షెడ్యూల్‌‌ ఏర్పాటు చేసి భూసంస్కరణలకు సంబంధించిన చట్టాలను 9వ షెడ్యూల్‌‌లో పొందుపర్చారు. ఇది న్యాయసమీక్షకు అతీతంగా కొనసాగుతుందని మొదటి రాజ్యాంగ సవరణ పేర్కొంటుంది. మొదటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ శంకరీప్రసాద్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని తీర్పునిచ్చింది. 17వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ సజ్జన్‌‌సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని సజ్జన్‌‌సింగ్ వర్సెస్ రాజస్థాన్‌‌ కేసుగా భావించి సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని కోర్టు పేర్కొంది.

1967లో గోలక్‌‌నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని,  ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని రాజ్యాంగానికి చేసిన 1, 4, 17 రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ విరుద్ధమే కానీ కొనసాగుతాయని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో భారత పార్లమెంటు 24, 25, 29 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చింది. 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగ
సవరణ సాధారణ చట్టంగా పరిగణించరాదు. ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు కల్పించడం జరిగింది. 25వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు మధ్య విభేదం వచ్చినప్పుడు ఆదేశిక సూత్రాలలో 39 బీ, 39 సీ అమలు చేయడానికి ప్రాథమిక హక్కులలో 14, 19, 31 ఆర్టికల్స్ అవరోధం వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సవరణ పేర్కొంటుంది. అదే విధంగా సుప్రీంకోర్టు వీటిని న్యాయసమీక్ష చేసే అధికారం లేదని పేర్కొంటుంది. 29వ రాజ్యాంగ సవరణ ఆధారంగా కేరళ రాష్ట్రంలో భూసంస్కరణలకు సంబంధించిన అనేక చట్టాలను న్యాయసమీక్షకు అవకాశంలేని 9వ షెడ్యూల్‌‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో 24, 25, 29 రాజ్యాంగ సవరణలను సవాలు చేస్తూ కేశవానంద భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఒక మైలురాయిలా మిగిలిపోయింది.

ముఖ్యాంశాలు

కేరళ ప్రభుత్వం ఎడ్నార్‌‌‌‌మరాకు చెందిన కేశవానంద భారతి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆయన ఆర్టికల్ 14, 19, 26, 31లను కోడ్ చేస్తూ 24, 25, 29 రాజ్యాంగ సవరణలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు గోలక్‌‌నాథ్ కేసు తీర్పుకు విరుద్ధంగా కేశవానంద భారతి కేసులో తీర్పును ప్రకటించింది.

24వ రాజ్యాంగ సవరణ సరైనదేనని పేర్కొంది. 25వ రాజ్యాంగ సవరణలో కొన్ని అంశాలు సరైనవే కానీ సుప్రీంకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం లేదని చెప్పటం సరైంది కాదని వివరించింది.

29వ రాజ్యాంగ సవరణ సరైనదేనని పేర్కొంది.

రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకుండా సవరణ చేసే అధికారం మాత్రమే పార్లమెంటుకు ఉంటుంది.

ఏ రాజ్యాంగ సవరణనైనా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అనగా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా న్యాయసమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది.

రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం.

రాజ్యాంగ సవరణ మౌలిక సూత్రాలకు లోబడి ఉండాలి.

మౌలిక సూత్రాల భావన రాజ్యాంగంలో పొందుపర్చలేదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా కొన్ని మౌలిక సూత్రాలను అవగాహన చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ చట్ట ఔన్నత్యం, ప్రాథమిక హక్కులు మొదలైనవి. న్యాయమసమీక్షను రాజ్యాంగ మౌలిక సూత్రంగా ఈ కేసులో పేర్కొంది.

అయోధ్య స్థల వివాదం

సుప్రీంకోర్టు చరిత్రలో సెకండ్ లాంగెస్ట్ కేసుగా అయోధ్య రామ జన్మభూమి వివాదం కేసు నిలిచింది. ఈ కేసు విచారణ 2019 ఆగస్టు 6న ప్రారంభమవగా అక్టోబర్ 16న వాదనలు ముగిశాయి. మొత్తంగా 40 రోజులపాటు విచారణ సాగింది. సుమారు 134 సంవత్సరాల నుంచి అయోధ్య రామజన్మభూమి పై కేసులు కొన సాగాయి. 1528లో అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టారు. రాముని గుడి కూల్చి అక్కడ మసీదు కట్టారంటూ హిందూ సంస్థలు వాదనకు దిగడంతో 1853లో మొదటిసారిగా మత కలహాలు చెలరేగాయి. 1885లో రామజన్మ స్థలానికి తానే మహల్‌‌నని చెబుతూ మసీదు ఆవరణలోని రామ్‌‌ చబుత్రా వద్ద ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ రఘువర్‌‌‌‌దాస్ అనే వ్యక్తి ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు.  1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీనిపై కేంద్రప్రభుత్వం లిబర్‌‌‌‌హాన్ కమిషన్‌‌ను ఏర్పాటు చేసింది. 2002లో అలహాబాద్ హైకోర్టు ముగ్గురు జడ్జీలతో అయోధ్య కేసు విచారణ చేపట్టింది. జస్టిస్ డీవీ శర్మ, జస్టిస్ ఎస్‌‌యూ ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్‌‌లతో కూడిన ధర్మాసనం 2010 సెప్టెంబర్‌‌‌‌లో తీర్పునిచ్చింది. వివాదాస్పద అయోధ్య స్థలాన్ని 3 భాగాలుగా విభజించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హిందూ, ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. సున్నితమైన అంశం కావడంతో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీం కలీపుల్లా నేతృత్వంలో శ్రీశ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. కానీ కమిటీ ఏ విధమైన పరిష్కారం చూపించలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్‌‌ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌‌‌లు ఈ వివాదంపై తుది తీర్పును నవంబర్ 9న వెలువరించారు.

వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల అయోధ్య స్థలం రామ్‌‌లల్లాకే చెందుతుందని అక్కడ రాముడి గుడి నిర్మించాలని పేర్కొంది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌‌బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని అయోధ్యలోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. మందిర నిర్మాణానికి 3నెలల్లోగా ట్రస్టును ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కేసును ప్రధానంగా భూవివాదంగా భావించి విచారించగా ఐదుగురు జడ్జిల బెంచ్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

గోప్యత ప్రాథమిక హక్కు

ఆధార్ చట్టబద్ధతను, ప్రభుత్వ పథకాలకు దానిని తప్పనిసరి చేయడాన్ని, దాని సమాచారాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని 5గురు సభ్యుల ధర్మాసనం విచారిస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా? కాదా అన్న ప్రశ్న తలెత్తింది. దీంతో  గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు 9మంది న్యాయమూర్తుల ధర్మాసనం(జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్‌‌ఏ బోబ్డే, జస్టిస్ ఆర్‌‌‌‌కే ఆగర్వాల్, జస్టిస్ ఆర్‌‌‌‌ఎఫ్ నారీమన్, జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌‌కే కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌‌‌‌) 2017 ఆగస్టులో ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ 38 రోజులపాటు కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ‘గోప్యత హక్కు అనేది ఆర్టికల్ 21, రాజ్యాంగంలోని మొత్తం 3వ భాగం ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అంతర్గత భాగం’ అని తీర్పునిచ్చింది. దీనిపై డీవై చంద్రచూడ్ 9మంది ధర్మాసనంలో ఒకరిగా తీర్పునిస్తూ ‘వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కులు మానవ మనుగడతో విడదీయరానివి ఇవి అనంత కాలం నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని సహజన్యాయాల కింద గుర్తించాలని పేర్కొన్నాడు.

గతంలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్, జబల్‌‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితి విధించిన సమయంలో కారణం చూపకుండానే అరెస్టులు చేసే సందర్భంలో దాఖలైన పిటిషన్‌‌పై అప్పటి చీఫ్ జస్టిస్ ఎ ఎన్ రే, హెచ్ ఆర్ ఖన్నా, హెచ్ఎం బేగ్, వైవీ చంద్రచూడ్, పీఎన్ భగవతిలతో కూడిన ధర్మాసనం విచారణ జరపగా హెచ్ ఆర్ ఖన్నా మినహా మిగిలిన నలుగురు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చారు.

Latest Updates