బిట్రగుంట వెంకటేశ్వరస్వామి రథానికి నిప్పు: దేవాదాయ శాఖ విచారణకు ఆదేశం

నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయ రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ విచారణకు ఆదేశించింది. కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథానికి గురవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. రథంపైన కప్పి ఉన్న తాటాకులను అంటించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఊరిలో అందరూ నిద్రిస్తున్న సమయం కావడంతో దీనిని గుర్తించడానికి చాలా ఆలస్యమైంది. స్థానికులు చూసే లోపు మంటలు ఎక్కువైపోవడంతో రథం చాలావరకు కాలిపోయింది.

రథానికి నిప్పు పెట్టిన ఘటనపై దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. విషయం తెలిసిన వెంటనే విచారణకు ఆదేశించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి.. దుండగులను వేగంగా గుర్తించాలని చెప్పారు. అలాగే ఘటనపై చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణికి సూచించారు. ఆకతాయిలు, దుండగులు చేస్తున్న ఇటువంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేవాలయాల పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.

Latest Updates