ప్ర‌మాదంలో రెండు చేతులు పోయినా.. డాక్ట‌ర్ కావాల‌న్న‌ సంక‌ల్పంతో..

ప‌న్నెండేళ్ల వ‌యసులో ఆ పిల్లాడిని విధి వెక్కిరించింది.. ఓ ప్ర‌మాదంలో రెండు చేతులు, ఒక కాలు కోల్పోయాడు. అయినా ఏ మాత్రం ఆత్మ స్థైర్యం స‌డ‌ల‌కుండా నిల‌బ‌డ్డాడు. సంక‌ల్ప బ‌లంతో విధికి ఎదురు నిలిచాడు. కృత్రిమ అవ‌య‌వాల సాయంతో ముందుకు సాగాడు. ఆ చిన్న వ‌య‌సులో ఎదురైన గండం నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆ కుర్రాడు.. డాక్ట‌ర్ కావాల‌న్న ల‌క్ష్యంతో చ‌దువులో మేటిగా నిలిచాడు.

గుజ‌రాత్ లోని వ‌డోద‌రాకు చెందిన శివం సోలంకి అనే కుర్రాడు త‌న 12వ ఏట ప్ర‌మాద‌వ‌శాత్తు హైటెన్ష‌న్ క‌రెంటు తీగను ప‌ట్టుకోవ‌డంతో రెండు చేతులు, ఎడ‌మ కాలును కోల్పోయాడు. ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా సాధించొచ్చ‌ని నిరూపిస్తూ.. కృత్రిమ అవ‌య‌వాల సా‌యంతో ముందుకు సాగుతున్నాడు. త‌న 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో 92.33 శాతం మార్కులు సాధించాడు. తాను డాక్ట‌ర్ అయ్యి.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌ని శివం చెబుతున్నాడు. తాను ప‌రీక్ష‌ల స‌మ‌యంలో రోజంతా చ‌దివే వాడిన‌ని, సిల‌బ‌స్ రివైజ్ చేసుకోవ‌డంలో టీచ‌ర్స్ ఎంత‌గానో స‌హ‌క‌రించార‌ని చెప్పాడు. కాగా, శివం త్రండి వ‌డోద‌రా మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగిగా ప‌ని చేస్తున్నాడు.

Latest Updates