పాస్‌వర్డ్ మర్చిపోయిండు.. గుర్తురాకపోతే రూ.1,600 కోట్లు హుష్

శాన్‌‌ఫ్రాన్సిస్కో: ఈ రోజుల్లో పాస్‌‌వర్డ్‌‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెక్ వరల్డ్‌‌‌లో మొబైల్ ఫోన్, ల్యాప్‌‌ట్యాప్, ఏటీఎం, యాప్‌‌ల్లో ఇలా చాలా వాటిల్లో పాస్‌‌వర్డ్‌‌లు పెట్టుకోవడం తప్పనిసరిగా మారింది. భద్రత కోసం దీన్ని వాడుతుంటాం. అయితే ఒక్కోసారి వీటిని మర్చిపోతుంటాం. ఈ-మెయిల్స్‌, ఫోన్ నంబర్ల ద్వారా మర్చిపోయినా మళ్లీ కొత్త పాస్‌‌వర్డ్‌‌ను సెట్ చేసుకుంటాం. కానీ ఇక్కడో వ్యక్తి పాస్‌వర్డ్‌ను మర్చిపోవడంతో కోట్లాది డబ్బులను కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. జర్మనీకి చెందిన ఆ వ్యక్తి పేరు స్టీఫెన్ థామస్. ప్రోగ్రామర్ అయిన స్టీఫెన్.. ప్రస్తుతం శాన్‌‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా ఇతడు సంపాదించిన డబ్బులతో బిట్‌‌కాయిన్స్‌‌లో ఇన్వెస్ట్ చేశాడు. వీటి విలువ దాదాపు 220 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1,610 కోట్లకు పైమాటే).

రీసెంట్‌‌గా బిట్‌కాయిన్ విలువ 50 శాతం పడిపోయింది. దీంతో తన డబ్బులను తిరిగి తీసుకుందామని స్టీవెన్ యత్నించాడు. అయితే అందుకు తన అకౌంట్‌లో ఐరన్‌‌కీ అనే హార్డ్‌డ్రైవ్‌ను అన్‌‌లాక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అన్‌లాక్ చేస్తే వచ్చే ప్రైవేట్ కీ ద్వారా డిజిటల్ వ్యాలెట్‌‌ను ఆయన యాక్సెస్ చేసుకోవచ్చు. తద్వారా అందులో ఉన్న 7,002 బిట్ కాయిన్స్ అతడి సొంతమవుతాయి. అయితే స్టీఫెన్ పాస్‌‌‌వర్డ్‌‌‌‌ మర్చిపోవడంతో ఐరన్‌కీ అన్‌లాక్ కాలేదు. కొన్నిసార్లు ప్రయత్నించినా అన్‌‌లాక్ కాలేదు. ఐరన్‌‌కీని అన్‌‌లాక్ చేయడానికి ఆయనకు రెండు చాన్సులే ఉన్నాయి. అందులో స్టీఫెన్ విఫలమైతే ఆయన అకౌంట్ సీజ్ అవుతుంది. కొన్నేళ్ల క్రితం తన ఐరన్‌కీ పాస్‌‌వర్డ్‌‌ను ఓ లెటర్‌‌లో స్టీఫెన్ రాశాడు. అయితే ఇప్పుడా లెటర్ కనిపించకుండా పోయిందట. ‘నేను బెడ్ మీద పడుకొని పాస్‌వర్డ్ గురించే ఆలోచిస్తున్నా. ఏదోటి గుర్తుకురాగానే కంప్యూటర్ దగ్గరకు వెళ్లి ప్రయత్నిస్తున్నా. కానీ వర్కౌట్ అవ్వట్లేదు. నేను చాలా నిరాశలో ఉన్నా’ అని పాస్‌‌వర్డ్ మర్చిపోవడం గురించి స్టీఫెన్ చెప్పుకొచ్చాడు.

Latest Updates