ప్రేమ పేరుతో మోసం

love-fraud-photos-in-social-media

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడితో పాటు ఇందుకు సహకరించిన అతడి తల్లిని నాచారం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ మహేశ్​కథనం ప్రకారం..ఈసీఐఎల్ ఉండే ఓ యువతి(20)  ఓ జూనియల్ కాలేజీలో రెండేళ్ల క్రితం ఇంటర్ చదువుకుంది. నాచారంలోని హెచ్ఎంటీనగర్ లో ఉండే షాలెహ షాహిన్(45) అనే మహిళ యువతి చదువుకున్న కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పనిచేసి మానేసింది. షాహిన్ కు ఆ యువతితో పరిచయం ఉంది. తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని చెప్పి షాహిన్ ఆ యువతిని అప్పుడప్పుడు డబ్బులు అడిగేది.  షాహిన్ డబ్బు అడిగినప్పుడల్లా ఆ యువతి ఆమె ఇంటికి వెళ్లి ఇచ్చేది. ఈ క్రమంలో షాహిన్ పెద్ద కొడుకు మోహద్ అబ్దుల్ మాజిద్(19)తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. మాజిద్ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత మాజిద్ యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. కొడుకు ప్రవర్తన గమనించిన తల్లి షాహిన్ కూడా అతడికి సహకరించింది. మాజిద్, షాహిన్  ఏడాది కాలంగా  యువతిని బెదిరించి నుంచి సుమారు 7.5 తులాల బంగారు నగలు, రూ.60వేల డబ్బు దోచుకున్నారు. ఈ బ్లాక్ మెయిల్ ను తట్టుకోలేక యువతి ఈ నెల 1న నాచారం పోలీసులకు జరిగిన విషయం చెప్పి కంప్లయింట్ చేసింది. బాధితురాలి కంప్లయింట్ అందుకున్న పోలీసులు మంగళవారం షాహిన్, మాజిద్ ను అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి 36 గ్రాముల బంగారు నగలు, ఓ హోండా ఆక్టీవా, ఓ కారు, స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్టు సీఐ మహేశ్​తెలిపారు.

Latest Updates