ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి

చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్య యత్నం చేసింది.  కూల్ డ్రింక్ లో గుళికలు కలుపుకుని, తాగి ఆత్మహత్యకు ఒడిగట్టిందా జంట.  ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా రంగారెడ్డి గూడకు చెందిన తిప్పిన సందీప్ రెడ్డి , దామరచర్ల కు చెందిన త్రివేణి వరుసకు బావ, మరదళ్లు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరి పెళ్ళికి  ఇరు కుటుంబాల మధ్య ఉన్న గొడవల కారణంగా వారి పెద్దలు ఒప్పుకోలేదు.  దీంతో ఈ రోజు చైతన్య పురి పరిధిలో రాజధాని థియేటర్ సమీపంలో సందీప్ రెడ్డి రూంలో సూసైడ్ నోట్ రాసి  క్రిమిసంహారక గుళికలు మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టారు.  తాము మరణించాక తమ సమాధులు పక్కపక్కనే ఉంచాలని సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య కు పాల్పడ్డారు.

తాము ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు సందీప్ రెడ్డి బంధువుకు సమాచారం అందించారు. బంధువు  సంఘటన స్థలానికి చేరుకొని వీరిని సమీప హాస్పిటల్  తరలించే లోగా  సందీప్ రెడ్డి మృతి చెందాడు. త్రివేణి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని  కేసు నమోదు చేసుకున్నారు. హాస్పిటల్ లో ఉన్న సందీప్ రెడ్డి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. త్రివేణిని కూడా ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. పోలీసులు ఇరువురు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates