ప్రాణాలు తీస్తున్న లో లెవల్ బ్రిడ్జిలు

 ఏటా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నా పట్టించుకోని సర్కారు

 ఇటీవలి వరదలకు చాలారోడ్లపై నిలిచిన రాకపోకలు

 ఇప్పటికీ వాటర్​ క్లియర్​కాక జనాల ఇబ్బందులు

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఏటా వర్షాకాలంలో కాజ్​వేలు, లోలెవల్​ బ్రిడ్జిలపై వరద తీవ్రతను అంచనా వేయలేక వందలాది వెహికల్స్​కొట్టుకుపోయి పెద్దసంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇటీవలి వర్షాలు, వరదలకు కాజ్​వేలు, లోలెవల్​ బ్రిడ్జిలు చాలాచోట్ల మునిగిపోయి, కొన్నిచోట్ల కొట్టుకుపోయి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని కాజ్​వేలు, లోలెవల్​ బ్రిడ్జిలపై ఇప్పటికీ వాగులు పారుతున్నాయి. దీంతో అంబులెన్స్​లు కూడా పోలేక ఎమర్జెన్సీ టైంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు లోలెవల్​ బ్రిడ్జిలను హైలెవల్​ బ్రిడ్జిలుగా మార్చేందుకు ఆయా శాఖల ఆధ్వర్యంలో పంపిన ప్రపోజల్స్​ ఏండ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్నాయి. ఇక శాంక్షన్​అయిన చోట్ల ఫండ్స్​ లేక నిర్మాణాలు ఆగిపోయాయి.

కొట్టుకుపోతున్న వెహికల్స్, ప్రజలు

లోలెవల్​ వంతెనల కారణంగా వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వెహికల్స్, ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఈ సీజన్​లో ఇప్పటివరకు పది మందికిపైగా చనిపోయారు. ఆగస్టు నెలలో  సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌‌‌‌‌‌‌‌ వద్ద  లోలెవల్​బ్రిడ్జిపై మోయ తుమ్మెద వాగులో ఓ లారీ కొట్టుకుపోయి డ్రైవర్​మృతిచెందాడు. ఇదే జిల్లా చిన్నకోడూర్​మండలం సికింద్రాపూర్‌‌‌‌ ‌‌‌‌వద్ద కాజ్​వేపై వరద నీటి ధాటికి ఇన్నోవా వాహనం కొట్టుకుపోయింది. అందులో ఉన్న నలుగురిలో ఒకరు చనిపోగా, చెట్టును పట్టుకున్న ముగ్గురిని  స్థానికులు కాపాడారు. ఇటీవలి వర్షాలకు వాగులు, వరదల్లో కొట్టుకుపోయి యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలో ఇద్దరు, వలిగొండ లో ఒకరు, భువనగిరి లో ఇద్దరు,  సంగారెడ్డి జిల్లా కంది లో ఇద్దరు, జహీరాబాద్ సమీపంలోని కొత్తూరు (బి) లో ఒకరు,  వనపర్తి జిల్లాలో ఇద్దరు,  వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో ఒకరు,  చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలం బొడయికుంట గ్రామానికి చెందిన ఏడూళ్ల శివ చింతపడి వాగులో కొట్టుకుపోయాడు. ఇప్పటికీ దొరకలేదు.  రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వందలాది వెహికల్స్ కొట్టుకుపోయినా ఆఫీసర్లు కనీసం
ఆ వివరాలు కూడా నమోదు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

పెండింగ్​లో హైలెవల్ ​బ్రిడ్జి ప్రపోజల్స్​

లోలెవల్​ బ్రిడ్జిల వల్ల వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోవడం, తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి హైలెవల్​ బ్రిడ్జిల కోసం ఆఫీసర్లు ప్రపోజల్స్​పంపుతున్నా సర్కారు శాంక్షన్​ చేయడం లేదు. మంజూరు చేసినవాటికీ ఫండ్స్​ రాక చాలాచోట్ల బ్రిడ్జిల నిర్మాణం ఆగిపోయింది.

వరంగల్ రూరల్ జిల్లా వరంగల్–ములుగు నేషనల్​ హైవేపై కటాక్షపూర్ చెరువు వద్ద, పరకాల–ఎర్రగట్టు గుట్ట రోడ్డుపై నడికూడ మండలం కంఠాత్మకూర్ ​వద్ద లో లెవెల్ బ్రిడ్జిలు డేంజరస్​గా మారాయి. 20 ఏళ్లుగా హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎన్నికలప్పుడు చెబుతున్న లీడర్లు తర్వాత పట్టించుకుంటలేరు.

ఆదిలాబాద్ జిల్లాలో 34 లో లెవెల్ బ్రిడ్జిలు ఉండగా హైలెవల్​గా మార్చేందుకు రూ.119.9 కోట్ల అంచనాతో ఆఫీసర్లు ప్రపోజల్స్​పంపించారు. అందులో  8 బ్రిడ్జిలు ఇటీవలే మంజూరయ్యాయి. ఆసిఫాబాద్​ జిల్లాలో 14 హై లెవల్ బ్రిడ్జిల కోసం ప్రపోజల్స్​ పంపారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్ మండలం బీరెవల్లి–జామ్​ మధ్య రూ. 5 కోట్లతో, పెంబి మండలం పస్పుల – తుల్సిపేట్ మధ్య రూ.4.5 కోట్లతో హైలెవల్​ బ్రిడ్జిలు మంజూరైనా ఫండ్స్​ రిలీజ్​ కాక పనులు ప్రారంభించలేదు.

కరీంనగర్ జిల్లాలో 58 చోట్ల హైలెవల్​ బ్రిడ్జిల కోసం గత ఆగస్టులోనే  ప్రపోజల్స్​ పంపినా సర్కారు నుంచి స్పందన లేదు.

కామారెడ్డి జిల్లాలో 12 లో లెవల్ బ్రిడ్జిలు ఉండగా, జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి సమీపంలో, మద్నూర్ మండలం పెద్ద తడ్కోల్ సమీపంలో హైలెవల్​బ్రిడ్జిలు ఫండ్స్​ లేక లేటవుతున్నాయి.

మహబూబ్​నగర్​ జిల్లాలో 48, నారాయణపేట జిల్లాలో 32 లో లెవల్ బ్రిడ్జిలున్నాయి. చిన్నపాటి వర్షాలకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో 495 లోలెవల్ బ్రిడ్జిలు ఉండగా, ఇటీవలి వరదలకు 22 చోట్ల కొట్టుకుపోయాయి. అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల కేంద్రం నుంచి ధర్మాపూర్ వెళ్లే రోడ్డుపై బ్రిడ్జి పూర్తిగా తెగిపోయింది. మునిపల్లి మండలం బోడపల్లి-పిల్లోడి గ్రామాల  మధ్య డబ్బా వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులు ఫండ్స్​లేక ఆగిపోయాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానం బైలు ప్రాంతంలో హైలెవల్ బ్రిడ్జికి రూ.9 కోట్లు మంజూరు చేసినా ఫండ్స్​ లేక పనులు ప్రారంభించలేదు. శెట్టిపల్లి నుంచి ఆళ్ల పల్లి రోడ్ మధ్య10 లో లెవెల్ బ్రిడ్జిలను  రూ.30 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి లు గా మార్చాలని 4 నెలల కింద ప్రపోజల్స్​ పంపినా సర్కారు నుంచి స్పందన లేదు.

అంచనా వేయలేక అదుపు తప్పింది 

మేళ్లచెరువు, వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాదారం బండరేవు వాగు వద్ద గురువారం ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది.  కృష్ణా జిల్లా నుంచి సిమెంటు పరిశ్రమకు వస్తుండగా బండరేవు వాగు వద్ద అండర్​బ్రిడ్జి మార్జిన్ ను  డ్రైవర్ అంచనా వేయలేకపోవడంతో వాగులో పడింది. డ్రైవర్, క్లీనర్  సేఫ్​గా బయటపడ్డారు.

వానొచ్చిందంటే భయమే

వర్షాకాలంలో మూడు, నాలుగు నెలల పాటు మల్లన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తది. రాకపోకలు నిలిచిపోయి అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటేందుకు కష్టాలు పడుతున్నం. ఈ సారి వర్షాలు ఎక్కువగా ఉన్నందున ఇంకా కష్టమవుతోంది. ఏండ్లు గడుస్తున్నా వాగుపై బ్రిడ్జి మాత్రం పూర్తయితలేదు. వెంటనే నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. – మాలోత్ కల్యాణ్​, నరసాపురం,  భద్రాద్రి జిల్లా.

ఓకే అంటల్లు.. బ్రిడ్జి రావట్లే

వరంగల్ రూరల్ జిల్లా నడికూడా మండల పరిధిలో 30 ఏండ్ల కింది కంఠత్మకూర్ లో లెవెల్ బ్రిడ్జి ఎన్నడో పనికి రాకుండా పోయింది. 24 గంటలు లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్​నడుస్తయి. కొద్దిపాటి వర్షం పడితే.. వరద వల్ల ఇక రోడ్డు దాటరాదు. ఐదు కిలోమీటర్ల దూరం ఉండే ఊరికి కూడా 30 కిలోమీటర్లు తిరిగి పోవాలి. వానాకాలం వచ్చిందంటే చాలామంది ప్రాణాలు పోతున్నయి. హై లెవల్ బ్రిడ్జి కట్టాలని అడిగి అడిగి.. తిరిగి తిరిగి ఇక ఊరుకున్నం. ఇగ వస్తది అగ వస్తది అంటారు తప్పించి పట్టించుకునేవారు లేరు. –కుమ్మరి నరేశ్​, కంఠత్మకూర్, వరంగల్ రూరల్ జిల్లా

Latest Updates