‘కర్వెన’ కట్టకు నెర్రెలు

  •             చిన్న వానకే పలు చోట్ల మూడు మీటర్ల లోతైన కోతలు
  •                 సీఎం వచ్చిన ఐదు రోజులకే బయటపడ్డ నాసిరకం పనులు
  •                 పనులు ఇలాగైతే కట్టకు ప్రమాదమంటున్న గ్రామస్తులు

ఆందోళనలో రైతులుపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఆర్‍ఎల్‌‌) పథకంలోని అతిపెద్దదైన కర్వెన రిజర్వాయర్‌‌ కట్టకు భారీ నెర్రులొచ్చాయి. చిన్న వానలకే కట్టపొడవునా చాలా చోట్ల మూడు మీటర్ల లోతుతో కోతలు పడ్డాయి. సాక్షాత్తు సీఎం కేసీఆర్‍ కర్వెన రిజర్వాయర్‍ సందర్శనకు వచ్చి వెళ్లిన ఐదు రోజులకే ఆనకట్ట పగుళ్లు ఏర్పడటం చర్చనీయాంశం అవుతోంది. నాసిరకం పనుల వల్లే కట్టకు కోతలుపడ్డాయని.. చిన్నపాటి వర్షాలకే కట్టకు భారీ కోతలు పడడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. పీఆర్‍ఎల్‌‌ స్కీమ్‌‌లో మొత్తం ఐదు లిఫ్టులు, ఆరు రిజర్వాయర్లు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‍, నల్గొండ జిల్లాల్లోని 12.50 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది ప్రణాళిక. లిఫ్ట్-3ను నాగర్‌‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ లిఫ్ట్ వద్ద 9 పంపులు (145 మెగావాట్ల సామర్థ్యంతో) ఏర్పాటు చేసి వాటి ద్వారా నాలుగో రిజర్వాయర్ అయిన 17.34 టీఎంసీల సామర్థ్యం కలిగిన కర్వెనకు నీటిని విడుదల చేస్తారు. సీఎం కేసీఆర్ ఈ పథకానికి 2015లో ఇక్కడే శంకుస్థాపన చేయగా.. దాదాపు నాలుగేళ్ల తర్వత గతనెల 29న పనుల పరిశీలనకు వచ్చారు. భూత్పూర్ మండలం కర్వెన వద్ద రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. పనులు సగం వరకు పూర్తయ్యాయి. మిగతా పనులు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2500 కోట్ల రూపాయల విలువైన ఈ రిజర్వాయర్‌‌ పనులు ప్రతిమ కన్‌‌స్ట్రక్షన్స్‌‌ చేపడుతోంది.

ఇటీవలి చిన్నపాటి వర్షాలకే ఆనకట్టపై మూడు మీటర్ల లోతుతో కోతలు పడ్డాయి. ఆనకట్ట చుట్టూ రివిట్‌‌మెంట్ సరిగా చేయటం లేదని చుట్టుపక్కల రైతులు ఆరోపిస్తున్నారు. కర్వెన రిజర్వాయర్ నిర్మాణపు పనుల్లో మొదటి నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనులు నాణ్యంగా చేయాలని ఏజెన్సీలకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. తాము అనుమానిస్తున్నట్లుగానే పనుల్లో నాణ్యత ప్రమాణాలు గాలికోదిలేశారని అంటున్నారు. ఆనకట్ట మరో ఏడు కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. దీంతో ఇప్పటికే కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. నాణ్యత ప్రమాణాలు పాటించని సదరు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Latest Updates