పల్లెల్లో సైతం ఎల్ఆర్ఎస్​ బెంగ

పంచాయతీల్లో అనుమతి లేని​ ప్లాట్లు​ 12 లక్షలపైనే

1.22 లక్షల గుంటల్లో ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ఆఫీసర్లు

ఒక్కో ప్లాటుకు సగటున రూ 20 వేలకు పైగా భారం

జనగామ, వెలుగుపల్లెలకూ ఎల్ఆర్ఎస్​ ఫికర్​పట్టుకుంది. జీపీ తీర్మానం ఉన్నా ఎల్ఆర్ఎస్​ కట్టాల్సిందేననే రూల్స్​ ఆందోళన కలిగిస్తున్నాయి. లే అవుట్​విషయంలో పంచాయతీ పాలకవర్గాల తీర్మానాలు చట్ట విరుద్ధమని ఆఫీసర్లు చెబుతున్నారు. డీటీసీపీ పర్మిషన్​ ఉన్న వెంచర్లకే మినహాయింపు ఇచ్చారు. సర్కారు ఆర్డర్​తో గ్రామాలవారీగా ఉన్న అక్రమ లే అవుట్​వెంచర్లు, ప్లాట్ల లెక్కలను తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 12,766 పంచాయతీల పరిధిలో 12,14,574 అన్​ అప్రూవుడ్​ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్​ మినహా 32 జిల్లాల్లో మొత్తంగా16,22,681 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో నాలుగోవంతు 4,08,107 మాత్రమే అప్రూవుడ్​ ప్లాట్లుగా ఉన్నాయి. మిగతావన్నీ రూల్స్​కు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ప్లాట్ల ఓనర్ల నుంచి కంపల్సరీగా ఎల్ఆర్ఎస్​చార్జీలు వసూలు చేయాలని సర్కారు ఆర్డర్స్​ ఉన్నాయి.

14 వేల వెంచర్లు

రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 539 మండలాల్లో 12,766 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో లక్షా22 వేల గుంటల విస్తీర్ణంలో ప్లాట్లు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు.  ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,568 వెంచర్లకు మాత్రమే లే అవుట్​ ఉంది. ఇక మిగిలిన 11,001 వెంచర్లకు లేఅవుట్​ లేదు. వీటి పరిధిలోని 12 లక్షలకు పైగా ప్లాట్లకు ఎల్ఆర్ఎస్​ కట్టాల్సిందే. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధి జీపీల్లో 1,807, అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 18 అక్రమ వెంచర్లు ఉన్నాయి.

ఒక్కో ప్లాటుకు సగటున రూ.20 వేల ఖర్చు

పల్లెల్లోనూ ఎల్ఆర్ఎస్​ పేరిట వేలకు వేలు వసూలు చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. ఉదాహరణకు ఒక ఊరిలో 200 గజాల ప్లాటు ఉండి దాని రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ గజానికి రూ 500 ఉన్నట్లయితే సదరు వ్యక్తికి రూ రూ. 30,700లు ఖర్చు కానుంది. అదే 150 గజాల ప్లాటు ఉండి, రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ 500 అయితే రూ. 23 వేల చార్జీలు పడనున్నాయి. గ్రామాల్లో కనీసం 150 గజాలకు పైనే ప్లాట్ల కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే గ్రామాల్లో రిజిస్ట్రేషన్​ వాల్యూ తక్కువగా ఉంది. ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా రేటు ఉంది. నేషనల్​ హైవేలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో గజానికి రూ .800 నుంచి 1200 వరకు రిజిస్ట్రేషన్​ చార్జీలు ఉన్నట్లు రిజిస్ట్రార్​ఆఫీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన గ్రామాల్లో రూ.200 నుంచి 600 వరకు గజానికి రిజిస్ట్రేషన్​ ధరలు ఉన్నాయి.  ఈ​ చార్జీలు తక్కువగా ఉన్నా కూడా సరాసరిగా ఒక్కో ప్లాటు ఓనర్​ నుంచి రూ.20 వేల వరకు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

గీ టైంల కష్టమే

గ్రామీణ ప్రాంతాలను ఎల్ఆర్ఎస్​ పరిధిలోకి తీసుకురావడం పై విమర్శలు ఎక్కువయ్యాయి. పట్టణాల్లో రీ సేల్​పర్పస్​లో అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. కానీ పల్లెల్లో గూడు కట్టుకోవడానికే కొంటుంటారు. ఎక్కువ మొత్తం ప్లాట్లు ఈ కోవలోకే వస్తాయి. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్​ కట్టాలన్న ప్రభుత్వ హుకుం పల్లె ప్లాట్ల ఓనర్లకు కష్టంగా మారింది. కరోనా కరువుతో పట్టణాల నుంచి పల్లెకు చేరిన వారిలో ఈ టెన్షన్​ మరింత ఎక్కువగా ఉంది. అసలే పనిలేక కష్టాల్లో ఉంటే ఎల్ఆర్ఎస్​ కట్టాలన్న ఆర్డర్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

 

Latest Updates