చదువు లేకున్నా.. సేవల్లో మిన్న

అతను చిరు వ్యాపారి. మనసు మాత్రం చాలా పెద్దది. ముషీరాబాద్ ఏక్ మినార్ సమీపంలో కూల్ డ్రింక్స్ అమ్మే ఎండీ షాహెద్ సేవా కార్యక్రమాల్లో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.  సంపాదనలో  అధిక మొత్తం సేవ కోసమే ఉపయోగిస్తాడు. ఉన్నంతలో ఏదో ఒక మంచి పని చేయడం అతనికి అలవాటుగా మారింది. ఐదేళ్ల కిందట అతను చూసిన ఒక సంఘటన  సేవ వైపు మళ్లేలా చేసింది. పని మీద బస్తీలో ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లిన షాహెద్ కు ముగ్గురు పిల్లలతో దీనంగా ఉన్న ఒక మహిళ కనిపించింది. ఆరా తీయగా  ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ కోసం అప్లై చేయడానికి వచ్చినట్లు తెలిపింది.  ఒక్కొక్కరికి రూ.250 చొప్పున నెట్ సెంటర్ నిర్వాహకుడు డిమాండ్ చేశాడు. అయితే వాస్తవానికి రూ.5 ఖర్చు అవుతుందని తెలుసుకున్నాడు. వెంటనే ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ కొనుగోలు చేసి తెలిసిన వ్యక్తిని ఆపరేటర్ గా పెట్టి ఉచితంగా ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ సెంటర్ ను ప్రారంభించాడు.  ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు చేరవేసేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.

ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుతో ఉపాధి…

అలాగే హిదాయత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉపాధి లేని పేద కుటుంబాల మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించి దారి చూపుతున్నాడు. కుట్టు మిషన్ నేర్చుకున్న  మహిళలకు సంస్థ  నుంచి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వల్ల వారికి బ్యాంకుల నుంచి లోన్ సదుపాయం కల్పిస్తున్నారు.  ఇందుకోసం తన సంపాదన నుంచి ఖర్చు పెట్టి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో నెట్, కుట్టు మిషన్ సెంటర్లను నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా తాను చదువుకోకున్నా నేటి పిల్లలు బాగా చదువుకోవాలని టెన్త్‌‌‌‌‌‌‌‌ పరీక్షల సమయంలో 40 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు సాయంత్రం స్టడీ అవర్స్‌‌‌‌‌‌‌‌లో ఉచితంగా స్నాక్స్ అందజేస్తాడు. ఎండాకాలం బస్సుల్లోని ప్రయాణికులకు తాగునీరు అందిస్తుంటాడు. బస్తీల్లో పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నాడు.

విదేశీ చదువుల కోసం సాయం….

పేద విద్యార్థులకు విదేశీ విద్య కోసం ప్రభుత్వం నుంచి ఓవర్సిస్ లోన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తాడు. అంతే కాకుండా  పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం, పేద విద్యార్థులకు, అభా గ్యులకు బట్టలు పంపిణీ, ఆశ్రమంలో ఉండే అనా థ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చేందుకు వారికి పతంగులు ఇప్పించడం లాంటి చిన్న చిన్న సరదాలు తీరుస్తున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలపై ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి సాయం చేయడంలో ముందుంటాడు.

Latest Updates