పీఎం మోడీ విమానం పాకిస్థాన్ మీదుగా వెళ్లదు

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు చేరుకోవడానికి  ప్రధానమంత్రి నరేంద్రమోడీ…. పాకిస్థాన్ గగన తలం(ఎయిర్ స్పేస్) ను వాడుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. జూన్ 13-14 తేదీల్లో శాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం.. కిర్గిజ్ స్థాన్ లోని బిష్కెక్ నగరంలో జరగనుంది. ఈ దేశానికి తొందరగా వెళ్లాలంటే మనదేశం నుంచి పాకిస్థాన్ మీదుగా చేరుకోవాలి. ఐతే… ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ .. పాకిస్థాన్ పట్ల తన వైఖరి మార్చుకుంది. ఉగ్రవాదులను దూరం పెట్టేవరకు పాకిస్థాన్ తో చేయి కలిపేది లేదని పాకిస్థాన్ తో అంటీ ముట్టనట్టు ఉండాలని నిర్ణయించింది. ఈ పరిణామాలతో… కిర్గిజ్ స్థాన్ చేరుకోవడానికి పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ను వాడుకోకూడదని ప్రధానమంత్రి నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.

కిర్గిజ్ స్థాన్ వెళ్లేందుకు.. పాకిస్థాన్ మీదుగా కాకుండా ఆల్టర్ నేట్ రూట్ లో వెళ్లాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. ఒమన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల గగన తలం నుంచి ప్రధాని మోడీ ప్రయాణించే VVIP విమానం వెళ్తుందని భారత అధికారులు చెబుతున్నారు.

SCO సదస్సు సన్నాహక సమావేశాల్లో మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మే నెలలో పాల్గొన్నారు. కిర్గిజ్ స్థాన్ లో జరిగిన సమావేశానికి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ మీదుగా వెళ్లి హాజరయ్యారు. ఐతే.. ప్రధానమంత్రి మాత్రం ఆ దారిలో వెళ్లకూడదని నిర్ణయించినట్టు సమాచారం.

2015 డిసెంబర్ లో ప్రధాని మోడీ .. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను లాహోర్ ఎయిర్ పోర్టులో సర్ ప్రైజ్ విజిట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. రష్యా టూర్ ముగించుకుని..ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తూ.. లాహోర్ ఎయిర్ పోర్టులో దిగి… ఆ దేశ ప్రధాని షరీఫ్ తో భేటీ అయి.. ఇండియాకు వచ్చారు మోడీ. ఐతే… 2019లో సీన్ మారిందనుకోవచ్చు. ప్రధాని మోడీ ప్రయాణించే VVIP విమానం తమ దేశంమీదుగా వెళ్లేందుకు పాకిస్థాన్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. మోడీ అందుకు సిద్ధంగా లేరు. పాకిస్థాన్ పట్ల మారిన వైఖరికి ఇది ఓ ఉదాహరణగా చెప్పుకుంటున్నారు.

Latest Updates