రాజ్యసభ నుంచి 11 మంది ఎంపీలు రిటైర్.. వాళ్లు ఎవరంటే?

ఈ ఏడాది రాజ్యసభ నుంచి 11 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. పదవీకాలం పూర్తయి.. ఈ ఏడాది నవంబర్‌లో రిటైర్ కానున్న ఆ 11 మంది సభ్యుల పేర్లను రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు బుధవారం ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన డాక్టర్ ఛత్రపాల్ సింగ్ యాదవ్, జావేద్ అలీ ఖాన్, పిఎల్ పునియా, రవి ప్రకాష్ వర్మ, రాజా రామ్, రామ్ గోపాల్ యాదవ్, వీర్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, నీరజ్ శేఖర్, అరుణ్ సింగ్, రాజ్ బబ్బర్ వచ్చే నవంబర్ నెలలో పదవీ విరమణ చేయనున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు.

‘ఈ 11 మంది ఎంపీలు పదవీ విరమణ చేసినా.. దేశ ప్రజలకు సేవ చేస్తారని అనుకుంటున్నాను. వీరంతా రాజ్యసభలో ఎంతో సహకరించారు. రాజ్యసభ గొప్ప వ్యక్తులను కోల్పోతుంది. పదవీ విరమణ చేసిన సభ్యులు.. ప్రజా ప్రయోజనాలకు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. వారు కేవలం తమ పదవుల నుంచి మాత్రమే రిటైర్ అయ్యారు.. కానీ, అలసిపోలేదు. వారు ప్రజలకు సేవ చేస్తూ.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు. వారు మంచి ఆయురారోగ్యాలతో ఈ దేశానికి మరిన్ని సంవత్సరాల పాటు సేవ చేయాలని కోరుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.

రాజ్యసభకు ప్రతి సభ్యుడు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. సభ్యులలో మూడింట ఒకవంతు ప్రతి రెండవ సంవత్సరం పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత కొత్త సభ్యులను ఎన్నుకోవటానికి ఎన్నికలు జరుగుతాయి.

For More News..

సీసీటీవీ ఫుటేజ్: అబిడ్స్‌లో ఆక్సిడెంట్.. క్షణాల్లో గాలిలో కలిసిన ప్రాణాలు

రాష్ట్రంలో మరో 2,296 కరోనా పాజిటివ్ కేసులు

అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఎల్ఆర్ఎస్ ఫీజులు

Latest Updates