నా కొడుకు పన్జేయకపోతే గల్లబట్టి అడుగుండ్రి

చింద్వారా: ‘‘నియోజకవర్గం అభివృద్ధి విషయంలోనా కొడుకు సరిగా పనిచేయకపోతే అతని గల్లాపట్టుకుని నిలదీయండి”అని కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ మధ్యప్రదేశ్ లోని చింద్ వారా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే సెగ్మెంట్ నుంచి ఇప్పటివరకు కమల్నాథ్ తొమ్మిదిసార్లు ప్రాతినిధ్యం వహించారు. లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న నకుల్ తరఫున కమల్ నాథ్ ఆమ్రవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లోశనివారం రాత్రి ప్రచారంలో మాట్లాడారు. చింద్ వారాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, ఈ బాధ్యతలు ఇపుడు తన కుమారుడికి అప్పగిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కమల్ నాథ్.. బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. బ్లాక్ మనీ వెలి కితీస్తానని, పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజల్ని మోసగించారని దుయ్యబట్టారు.మోడీకి అచ్చే దిన్ ఈ ఎన్నికల ఫలితాలతో ముగియనున్నాయన్నారు.

ఆప్ లేకుండా కాంగ్రెస్ గెలవలేదు
ఆప్ తో పొత్తు లేకుండా ఢిల్లీలో కాంగ్రెస్ గెలవలేదని కమల్ నాథ్ అభిప్రాయపడ్డారు. పొత్తులు ఫైనల్ కాలేదంటూ ఆదివారం ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ పై కమల్ నాథ్ ను ప్రశ్నించగా..ఢిల్లీలో కాంగ్రెస్ కు మద్దతు ఉన్నప్పటికీ.. ఒంటరిగా పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించక పోవచ్చన్నారు. బీజేపీని ఓడించేందుకు ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చలు కొలిక్కిరాలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఆప్ 5సీట్లు తీసుకుని, కాంగ్రెస్ కు 2 సీట్లిచ్చేందుకు రెడీ అయింది. కాంగ్రెస్ మాత్రం 3సీట్ల కోసం పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది.

Latest Updates