ల‌వ‌ర్‌ని, పేరెంట్స్ చూసిన అమ్మాయినీ ఒకేసారి పెళ్లాడిన యువ‌కుడు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ యువ‌కుడు ఒకే సారి ఇద్ద‌రు యువ‌తుల్ని పెళ్లాడిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువ‌తిని, పేరెంట్స్ చూసిన అమ్మాయిని ఒకే మండ‌పంలో వివాహం చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బెతుల్ జిల్లా కెరియా గ్రామంలో జ‌రిగింది. ఈ పెళ్లి ముగ్గురికి కుటుంబస‌భ్యులు, గ్రామ‌స్తుల మ‌ధ్య జ‌ర‌గ‌డం విశేషం.

అమ్మాయిలిద్ద‌రూ ఓకే చెప్పాక‌నే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఘోర‌డోంగ్రీ బ్లాక్ ప‌రిధిలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ అనే యువ‌కుడు.. భోపాల్‌లో చ‌దువుకునేట‌ప్ప‌డు హోషంగాబాద్‌కు చెందిన యువ‌తితో ప‌రిచయం ఏర్ప‌డింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అమ్మాయి ఇంట్లో పెళ్లికి ఓకే అన్నారు. దీంతో ఆనందంతో సందీప్ త‌న ఇంట్లో వారిని కూడా ఒప్పించ‌వ‌చ్చ‌ని అనుకున్నాడు. అయితే తీరా అత‌డు ఇంటికి వెళ్లేస‌రికి త‌న గ్రామానికి స‌మీపంలోని కోయ‌ల‌రి గ్రామానికి చెందిన యువ‌తిని అత‌డికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె పెద్ద‌ల‌తో మాట్లాడి నిశ్చ‌యించారు. అయితే అత‌డు తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకుని రావ‌డంతో ఈ విష‌యం తెలిసి కోయ‌ల‌రి గ్రామానికి చెందిన అమ్మాయి త‌ల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వారంతా గొడ‌వ‌కు దిగ‌డంతో విష‌యం సందీప్ గ్రామ పంచాయ‌తీ పెద్ద‌ల వ‌ద్ద‌కు చేరింది. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చెప్పాల‌ని కోర‌డంతో అమ్మాయిల‌కు ఇద్ద‌రికీ అభ్యంత‌రం లేకుంటే వారిద్ద‌రినీ పెళ్లి చేసుకోవాల‌ని సందీప్‌ను ఆదేశించారు. త‌మ‌కు ఈ ప్ర‌తిపాద‌న‌కు అంగీకార‌మేన‌ని అమ్మాయిలిద్ద‌రూ ఓకే అన‌డంతో జూన్ 29న‌ ఒకే మండ‌పంలో వారిని పెళ్లాడాడు. దీనికి ఆ మూడు కుటుంబాల పెద్ద‌ల్లో కూడా ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని, ఈ పెళ్లి పూర్తిగా అంద‌రి ఇష్టంతోనే జ‌రిగింద‌ని పంచాయ‌తీ పెద్ద‌లు చెబుతున్నారు.

ఇది చ‌ట్ట విరుద్ధం: త‌హ‌శీల్దార్

బ‌హుభార్య‌త్వం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని, దీనిపై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని ఘోర‌డోంగ్రీ త‌హ‌శీల్దార్ మోనికా విశ్వ‌క‌ర్మ తెలిపారు. వాస్త‌వానికి క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎటువంటి ఫంక్ష‌న్లు చేయాల‌న్నా త‌మ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని, కానీ ఈ పెళ్లికి సంబంధించి ఎటువంటి ప‌ర్మిష‌న్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోలేద‌ని ఆమె తెలిపారు. మీడియా ద్వారానే త‌మ‌కు విష‌యం తెలిసింద‌ని, బ‌హుభార్య‌త్వం చ‌ట్ట వ్య‌తిరేక‌మ‌ని, దీనిపై ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా సంబంధించి పోలీస్ స్టేష‌న్‌లో తాము ఫిర్యాదు చేశామ‌న్నారు.

Latest Updates