ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

మీ వల్లే బద్ధకం.. 

ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయనాయకుల హామీల కారణంగా ప్రజలు బద్ధకంగా తయారవుతున్నారంది. మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..! ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి. ఏ పార్టీ మెనిఫెస్టో చూసినా ఉచితాలే విన్పిస్తున్నాయి.ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి హామీలకు లెక్కే లేదు. ఉచితంగా టీవీ, ఏసీ, సైకిల్, బైక్ ఇస్తామని.. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉచిత కేబుల్ కనెక్షన్.. ఇలా ఒక్కటా రెండా.. అక్కడ అన్నీ ఉచితాలే. ఈ ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉచిత పథకాలతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారని.. ఏ పనీ చేయకుండా తయారు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ప్రకటించిన ఉచిత హామీలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.దీనిపై విచారించిన జస్టిన్ ఎన్.కిరుబకరన్, జస్టిస్ బి.పుగలెంతి నేతృత్వంలోని ధర్మాసనం..ఉచిత పథకాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఉచిత పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులుగా మారుతున్నారని అభిప్రాయపడింది. బిర్యానీ, బీరు కోసం ఓటువేస్తే, మీ నాయకుడిని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడుంటుందని ప్రశ్నించింది కోర్టు.

అంతేకాదు ఉచిత హామీల సంప్రదాయం కొనసాగడం ప్రజలకు ఎంత మాత్రమూ మంచిది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో అన్నం కూడా వండి తినిపిస్తారేమోనని సెటైర్లు వేసింది. ఉచిత హామీలను అవినీతి వ్యవహారంగా పరిగణించాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఉచిత థకాలకు సంబంధించి పిటిషనర్ పేర్కొన్న 20 ప్రశ్నలకు కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఉచిత హామీలకు అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడతారో ఏప్రిల్ 26 లోగా చెప్పాలని స్పష్టం చేసింది.