బాలుడి కిడ్నాప్, హత్య కేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం

వరంగల్ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన మహబూబాబాద్ లో బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసు నిందితుడు సాగర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కిడ్నాప్ చేసిన రెండో రోజే పట్టుబడిన నిందితుడ్ని పోలీసులు కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ కు ఆదేశించారు. అప్పటి నుండి వరంగల్ కేంద్ర కారాగారంలో ఉంటున్ననిందితుడు సాగర్ ఊహించని విధంగా ఆత్మహత్యాయత్నం చేశాడు.  కరెంట్ బోర్డ్ లో వేలుపెట్టి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. జైలు

సిబ్బంది వెంటనే గుర్తించి అడ్డుకున్నారు. వెంటనే పోలీసు బందోబస్తు మధ్య వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాగర్ కు ప్రాణాపాయం  ఏమీలేదంటున్నారు వైద్యులు. తన వీధిలోనే ఉంటున్న చిన్నారి దీక్షిత్ రెడ్డిని చూసి అతడ్ని కిడ్నాప్ చేస్తే డబ్బులు వస్తాయని భావించి చాక్లెట్లు ఆశపెట్టి బాలుడ్ని తీసుకెళ్లిన గంటలోనే చంపేసిన విషయం అప్పట్లో పెద్ద ఎత్తున కలకలం రేపింది. కిడ్నాపర్ పట్టుబడిన వెంటనే ఉరితీయాలంటూ ప్రజా సంఘాల వారు ఆందోళనలు సైతం చేశారు.  ఊరిబయట గుట్టల్లోకి తీసుకెళ్లిన నిందితుడు బాలుడు ఏడుస్తుంటే సముదాయించడానికి విశ్వప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. తన వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని వెంటనే గొంతు నులిమి చంపేశానని.. డబ్బులొస్తాయోమోనని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తే మీ చిన్నారిని వదిలేస్తానని డిమాండ్ చేశానని తెలిపాడు.

 

 

Latest Updates