ఊళ్ల‌కు వ‌ల‌స కార్మికులు, ఆర్మీతో ఆస్ప‌త్రుల నిర్మాణం: కేంద్రానికి డిమాండ్స్

క‌రోనా క‌ట్ట‌డికి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ తో ఎక్క‌డిక‌క్క‌డ‌ నిలిచిపోయిన వ‌ల‌స కార్మికుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కేంద్రాన్ని మ‌రోసారి కోరారు మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రే. ఏప్రిల్ 30లోపు వారిని స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లించేందుకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌లు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌కు కేంద్రం ఏర్పాటు చేసిన ఇంట‌ర్ మినిస్టీరియ‌ల్ సెంట్ర‌ల్ టీమ్ నిన్న దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులున్న‌ మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించింది. ఈ టీమ్ తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి చెప్పిన ఆయ‌న‌.. కేంద్రం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. లాక్ డౌన్ తో నిలిచిపోయిన వ‌ల‌స కార్మికుల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు పంప‌డంతో పాటు, పీపీఈలు, వెంటిలేట‌ర్లు, ఇత‌ర మెడిక‌ల్ ప‌రిక‌రాల‌ను భారీగా అందించాల‌ని కోరారు. అలాగే అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆర్మీతో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఆస్ప‌త్రుల నిర్మాణం చేప‌ట్టేలా కేంద్రం చర్య‌లు తీసుకోవాల‌న్నారు.

సొంత రాష్ట్రాల‌కు పంపి క్వారంటైన్ చేయండి

మ‌హారాష్ట్ర‌లో 6 ల‌క్ష‌ల మందికిపైగా వ‌ల‌స కార్మికులు నిలిచిపోయార‌ని, లాక్ డౌన్ విధించిన నాటి నుంచి వారిని షెల్ట‌ర్ హోమ్స్ లో ఉంచి ఆహారం అందిస్తున్నామ‌ని చెప్పారు ఉద్ధ‌వ్. కానీ, వారు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లాల‌ని కోరుకుంటున్నార‌ని, నిర‌స‌న‌లు చేస్తున్నార‌ని గ‌త వారంలో ముంబైలో వేలాది కార్మికులు ఆందోళ‌న‌కు దిగిన ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించారు. ఒక వేళ ఏప్రిల్ 30 నుంచి మే 15 మ‌ధ్య క‌రోనా కేసుల సంఖ్య ఇంకా భారీగాపెరిగే చాన్స్ ఉంద‌ని కేంద్రం భావిస్తుంటే ఈ నెలాఖ‌రులోపే వ‌ల‌స కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపే ఏర్పాటు చేయాల‌న్నారు. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. కార్మికుల‌ను వారి సొంత రాష్ట్రాల‌కు త‌ర‌లించి అక్క‌డ హోం క్వారంటైన్ చేసి మానిట‌ర్ చేయ‌డం ద్వారా క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చని అన్నారు.

80 శాతం కేసుల్లో ల‌క్ష‌ణాలు లేవు

రాష్ట్రంలో న‌మోదైన క‌రోనా కేసుల్లో 80 శాతం పేషెంట్ల‌లో ఎటువంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని చెప్పారు మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్. ఇంత భారీ సంఖ్య‌లో అసింప్ట‌మేటిక్ కేసులు రావడంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అమెరికాలో క‌రోనా విజృంభించిన తీరు చూస్తూనే ఉన్నామ‌ని, దీనిని దృష్టిలో పెట్టుకుని వైర‌స్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు ఉండాల‌ని సూచించారు. కేవ‌లం ఏడు వేల కేసుల‌తో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగిన దుబాయ్ అనుస‌రించిన విధానాల‌ను స్ట‌డీ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Latest Updates