రాష్ట్ర‌మంతా జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్: మ‌హారాష్ట్ర స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌

క‌రోనా వైర‌స్ రోజు రోజుకీ విజృంభిస్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి రాష్ట్ర‌మంతా లాక్‌డౌన్ విధించాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది. మ‌రోసారి ప్ర‌జ‌లు క‌ఠినంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించాలంటూ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అత్య‌వ‌స‌మైతేనే బ‌య‌టకు రావాల‌ని, నాన్ ఎసెన్షియ‌ల్స్ కోసం ద‌గ్గ‌ర ప్రాంతాల్లోనే ప‌ని చూసుకోవాల‌ని సూచించింది. ఎటువంటి పరిస్థితిలోనైనా బ‌య‌ట‌కు వ‌స్తే ఫేస్ మాస్క్ క‌ట్టుకోవ‌డం, సామాజిక దూరం పాటించ‌డం మ‌ర్చిపోకూడ‌ద‌ని పేర్కొంది. ఆఫీసుల‌కు వెళ్లేవారిని, అత్య‌వ‌స‌ర ప‌నుల‌పై బ‌య‌ట‌కు వ‌చ్చే వారిని మాత్ర‌మే ఎటువంటి ఆంక్ష‌లు లేకుండా అనుమతిస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. మెడిక‌ల్ రీజ‌న్స్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చే వారిపైనా ఆంక్ష‌లు ఉండ‌వ‌ని తెలిపింది.  ము‌న్సిప‌ల్ ఆఫీసుల కేవ‌లం 15 శాతం లేదా 15 మంది ఉద్యోగులతో (ఏది ఎక్కువైతే అది) న‌డిపించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ప్రైవేటు కార్యాల‌యాలు 10 శాతం లేదా 10 మంది ఉద్యోగుల‌ను మాత్ర‌మే అనుమ‌తించాల‌ని స్ప‌ష్టం చేసింది. వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ విష‌యంలో జిల్లా కలెక్ట‌ర్లు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్లు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది. స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆయా ప్రాంతాల్లో నాన్ ఎసెన్షియ‌ల్ స‌ర్వీసుల‌ను ఏ మేర‌కు అనుమ‌తించాలి, ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డంపై ఆంక్ష‌ల విధింపు వంటి అంశాల‌పై నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసులు దాదాపు ఐదున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరాయి. అందులో 3 ల‌క్ష‌ల 20 వేల మందికి పైగా క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి 16,475 మంది మ‌ర‌ణించారు. దేశంలోనే మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 1,64,626 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. ఏడున్న‌ర వేల మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌తి రోజూ భారీగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రే ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే మ‌రోసారి లాక్‌డౌన్ విధించాల్సి వ‌స్తుంద‌ని చెప్పారు. వెంట‌నే ఆయ‌న ఇవాళ లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తూ.. రాష్ట్ర‌మంతా క‌ఠిన ఆంక్ష‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు.

Latest Updates